Special Video on Upasana Birthday Video : సక్సెస్ ఫుల్ బిజినెస్ పర్సన్ గా పేరు తెచ్చుకుని, మెగా ఫ్యామిలీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తన సతీమణి ఉపాసన కొణిదెల పుట్టిన రోజు సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ స్పెషల్ వీడియో చేశారు. దాంతో పాటు ఈ రోజుతో తమ కూతురు క్లీంకార పుట్టి నెల రోజులు పూర్తి చేసుకుందని తెలిపారు. అంతే కాకుండా ఈ పదకొండేళ్ల తమ వైవాహిక జీవితంలో ఉపాసన ఎన్నో త్యాగాలు చేసిందంటూ రామ్ చరణ్ తన భార్య గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. తమ ప్రేమకు గుర్తుగా జన్మించిన క్లీంకార తమ జీవితంలోకి వచ్చిన సమయంలో తమ కుటుంబసభ్యులు ఎలా ఫీలయ్యారు, ఎలాంటి వాతావరణం నెలకొందన్న విషయాలను కూడా ఆయన ఈ వీడియో ద్వారా తెలియజేశారు.
పెళ్లయి పదకొండేళ్లయినా వారికి పిల్లలు లేరన్న విషయంపై స్పందించిన రామ్ చరణ్.. అలా అందరూ అంటుంటే తాము ఎంతో ఒత్తిడికి లోనయ్యామని, ఏదైనా సరే సరైన సమయంలో జరుగుతుందని తాను నమ్ముతానని చెప్పారు. అలా సరైన సమయంలోనే క్లీంకార తమ జీవితాల్లోకి వచ్చిందని, పాపను పట్టుకున్న ఆ క్షణం చాలా సంతోషంగా అనిపించిందంటూ తండ్రిగా రామ్ చరణ్ తన ఆనందాన్ని మాటల్లో చెప్పుకొచ్చారు. "క్లీంకార పుట్టే సమయంలో మా అందరిలోనూ తెలియని టెన్షన్. అంతా మంచి జరగాలని మేమంతా ప్రార్థిస్తున్నాం. అందుకు తగినట్టే అన్నీ అనుకూలంగా మారి సరైన సమయానికి పాప ఈ లోకంలోకి అడుగు పెట్టిందని భావిస్తున్నాను. పాప పుట్టిన ఆ క్షణం మనసుకి ఆహ్లదంగా, చాలా సంతోషంగా అనిపించింది. పాప పుట్టటానికి పట్టిన 9 నెలల సమయం, అప్పుడు జరిగిన ప్రాసెస్ అంతా తలుచుకుని హ్యాపీగా ఫీలయ్యాం" అని రామ్ చరణ్ అన్నారు. అంతే కాదు... తమ పాపను చెంచుల పాపగా పెంచుతామని తెలిపారు. చెంచులను ఇంటికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేయించారు.
ఇక ఇదే విషయంపై రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా తన భావాన్ని పంచుకున్నారు. "మా పాప ద్రావిడ సంస్కృతిలో భాగం కావాలని నేను కోరుకున్నాను. ఆమె పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగులను ఇవ్వకండి. అలాంటి వాటిని వారే స్వయంగా సాధించుకోవాలని నా అభిప్రాయం. పిల్లల పెంపకంలో ఇవెంతో ముఖ్యమైనవి. జీవితంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలి. మనం అందరితో కలిసి సంతోషంగా ఉన్న సమయానికి విలువ ఇవ్వాలని నేను భావిస్తాను" అని అన్నారు.
ఇక ఈ మోస్ట్ మెమోరెబుల్ వీడియోలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖా కొణిదెలతో పాటు ఉపాసన తల్లిండ్రులు శోభా కామినేని, అనీల్ కామినేని, ఇంకా మరికొందరు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అందరిలోనూ ఆ ఎగ్జయిట్‌మెంట్, ఆనందం ఉండటాన్ని కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు. క్లీంకార పుట్టిన తర్వాత కుటుంబ సభ్యులు, అభిమానులు అందరూ పండుగ చేసుకున్నారు. వాటన్నింటినీ ఈ క్లిప్పింగ్ చాలా అందంగా చూపించారు.
క్లీంకార ఆగమనానికి సంబంధించిన హృదయానికి హత్తుకునే ఈ అందమైన వన్ మంత్ బర్త్ యానివర్సరీ వీడియోను టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ జోసెఫ్ ప్రతనిక్ డైరెక్ట్ చేసి నిర్మించారు. క్లీంకార రాకతో పాటు ఆ తర్వాత వారి మధ్య చోటుచేసుకున్న సన్నివేశాలు, ఆ మధురమైన క్షణాలను, పాపకు పేరు పెట్టే అన్ని దృశ్యాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. యాదృచ్చికంగానే జరిగినప్పటికీ ఈ రోజుతో తమ పాప పుట్టి నెల రోజులు కావడం.. ఇదే రోజున ఉపాసన పుట్టినరోజు కావటం వారి ఫ్యామిలీలో మరింత ఆనందాన్ని తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఆద్యంతం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తోన్న ఈ వీడియోపై నెటిజన్లు, ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఉపాసనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మెగా ఫ్యామిలీపై తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Netflix: ఇండియన్ యూజర్లకు నెట్ ఫ్లిక్స్ షాక్, పాస్‌వర్డ్ షేరింగ్‌పై ఇకపై కుదరదట!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial