ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. భారత్ లో పాస్ వర్డ్ షేరింగ్ అవకాశాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు వినియోగదారులకు నెట్ ఫ్లిక్స్ సమాచారం అందజేసింది. సబ్‌ స్క్రిప్షన్ పొందిన వాళ్లు తమ అకౌంట్ ను కుటుంబ సభ్యులతో పంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. కుటుంబ సభ్యులను కాదని ఇతరులకు పాస్ వర్డ్ ఇచ్చినా, ఉపయోగించుకునే అవకాశం లేకుండా నియంత్రించనున్నట్లు నెట్ ఫ్లిక్స్ తెలిపింది. పాస్ వర్డ్ షేరింగ్ ద్వారా ఆదాయానికి గండి పడుతుందని భావించిన కంపెనీ, ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.


ఇండియన్ యూజర్లకు నెట్ ఫ్లిక్స్ షాక్


భారత్ లో చాలా మంది నెట్ ఫ్లిక్స్ వినియోగదారులు విచ్చల విడిగా పాస్ వర్డ్ షేర్ చేస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ గుర్తించింది. కుటుంబ సభ్యులు కాని వారికి కూడా పాస్ వర్డ్ అందిస్తున్నట్లు తెలియడంతో నెట్ ఫ్లిక్స్ ఈ చర్యలు చేపట్టింది. కుటుంబ సభ్యులు కాకుండా, ఇతరులకు పాస్ వర్డ్ పంపించే వారందరికీ ఈ సేవను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సదరు వినియోగదారులకు మెయిల్ ద్వారా సమాచారం అందించింది. తమ వినియోగదారుల కోసం వీలైనంత ఎక్కువ ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ తెలిపింది. కొత్త సినిమాలతో పాటు, సరికొత్త టీవీ షోలను రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం భారీగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలిపింది. వినియోగదారుల ఆసక్తికి అనుకూలంగా, వారికి నచ్చిన కార్యక్రమాలను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.  నిరంతరం కొత్త కంటెంట్ తో వినియోగదారులను అలరించనున్నట్లు ప్రకటించింది.  


భారత్ లో నెట్‌ఫ్లిక్స్ ప్లాన్స్ ఇవే!


ఇక నెట్ ఫ్లిక్స్ పాస్ వర్డ్ షేరింగ్ క్యాన్సిలేషన్ ను మే నెలలో మొదలు పెట్టింది. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ సహా ఏకంగా 100కు పైగా దేశాల్లో ఈ ప్రక్రియను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ కు  భారీగా చందాదారులు వచ్చారు. భారత్ లో  నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్‌కు నెలకు రూ.149 ఖర్చవుతుంది. సాధారణ ప్రాథమిక ప్లాన్‌కు నెలకు రూ.199 ఖర్చవుతుంది. రెండు ప్లాన్‌లు ఒకేసారి ఒక డివైస్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తాయి. రూ.149 మొబైల్ ప్లాన్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లో మాత్రమే పని చేస్తుంది. రూ.199 ప్లాన్ హెచ్‌డీ రిజల్యూషన్‌లో ఏ డివైస్‌లో అయినా సపోర్ట్ చేయవచ్చు. దీంతో పాటు నెట్‌ఫ్లిక్స్ మరో రెండు ప్లాన్‌లు అందిస్తుంది. రూ.499 ప్లాన్ రెండు డివైస్‌లను సపోర్ట్ చేస్తుంది. వినియోగదారులు పూర్తి-HD రిజల్యూషన్‌లో కంటెంట్‌ను స్ట్రీమ్ చేయవచ్చు. టాప్ ప్రీమియం ప్లాన్‌కు నెలకు రూ. 649 ఖర్చవుతుంది. వినియోగదారులు Ultra-HD రిజల్యూషన్‌లో కంటెంట్‌ని స్ట్రీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వినియోగదారులు పాస్ వర్డ్ షేరింగ్ చేయకుండా వారి స్వంత వ్యక్తిగత ప్లాన్‌లను పొందాలని కంపెనీ సిఫార్సు చేస్తుంది.


Read Also: ఎప్పటికప్పుడు వెదర్ అప్ డేట్స్ తెలుసుకోవాలా? మీ ఫోన్ లో జస్ట్ ఈ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది!


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial