Women’s World Cup 2023: ఫుట్‌బాల్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ (ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్)కు ముందే ఆతిథ్య దేశం న్యూజిలాండ్‌లో కాల్పుల కలకలం రేగింది. ఆస్ట్రేలియాతో పాటు సంయుక్తంగా ఫిఫా వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిస్తున్న న్యూజిలాండ్‌లో గురువారం ఉదయం కాల్పుల ఘటన ఆ దేశ ప్రజలతో పాటు ఫుట్‌బాల్ అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఆక్లాండ్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భాగంగా నేడు న్యూజిలాండ్ - నార్వే మధ్య ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. నార్వే ఆటగాళ్లు ఉంటున్న హోటల్ ఏరియాకు కొద్దిదూరంలోనే ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇక్కడికి సమీపంలో నిర్మిస్తున్న ఓ బిల్డింగ్‌లో పనిచేసే వ్యక్తే కాల్పులకు పాల్పడ్డట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఇది ఉగ్రవాద చర్య కాదని, నేషనల్ సెక్యూరిటీకి వచ్చిన ముప్పేమీ లేదని న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్ హోప్కిన్స్ తెలిపారు.
ఆక్లాండ్ లోని క్వీన్ స్ట్రీట్ సమీపంలో కాల్పులు వినిపించగానే పలువురు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్లు అక్కడికి చేరుకున్నాడు. సాయుధుడైన ఆగంతకుడు నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌లోకి దూరి కాల్పులు జరిపాడు. పోలీసులు అప్రమత్తమై వెంటనే కౌంటర్ అటాక్ చేశారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్టు ప్రధాని వివరించారు. ఆగంతకుడి కాల్పులలో మృతి చెందినవారిలో ఓ పోలీస్ కూడా ఉన్నాడు. కాగా ఈ చర్య వల్ల ఆటగాళ్ల భద్రతకు ఏ ముప్పూ లేదని, టోర్నీ జరిగినన్ని రోజులూ ఆటగాళ్లతో పాటు మ్యాచ్‌లు జరిగే స్టేడియాలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని హామీ ఇచ్చారు.
కాగా నేటి నుంచి మొదలుకాబోయే ఈ మెగా టోర్నీ ఏకంగా ఆగస్టు 20 వరకూ జరుగనుంది. మొత్తం 32 దేశాలు పాల్గొనబోయే ఈ మెగా టోర్నీలో జట్లను 8 గ్రూపులుగా (ఒక్కో గ్రూపు నుంచి 4) విభజించారు. గ్రూపు-ఏ లో న్యూజిలాండ్, నార్వే, ఫిలిప్పీన్స్, స్విట్జర్లాండ్ ఉండగా మరో ఆతిథ్య దేశం ఆస్ట్రేలియా.. కెనాడ, నైజీరియా, ఐర్లాండ్ తో ఆడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అమెరికా.. గ్రూప్-ఈలో ఉంది. గ్రూప్, క్వార్టర్స్ ఫైనల్స్, సెమీస్ వరకూ మ్యాచ్‌లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరుగనుండగా రెండో సెమీస్, పైనల్ మ్యాచ్ మాత్రం ఆస్ట్రేలియాలో జరుగనుంది. ఫైనల్ మ్యాచ్‌కు సిడ్నీ ఆతిథ్యమివ్వనుంది. 32 జట్లు తలపడబోయే ఈ మెగాటోర్నీలో 64 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial