Amaran: తమిళ హీరో శివకార్తికేయన్‌, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమరన్‌’. రాజ్‌ కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రాన్ని సీనియర్ నటుడు కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఇటీవల శివకార్తికేయన్‌ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకుంది. మూవీ టీజర్‌లో ముస్లింలను చెడుగా చిత్రీకరించారని ఆరోపిస్తూ, తమిళ మక్కల్ జననాయక కచ్చి (TMJK) రాజకీయ సంస్థ సభ్యులు బుధవారం తమిళనాడులో నిరసనలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. 


మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ నిజ జీవిత సంఘటనల ఆధారంగా ‘అమరన్‌’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టీజర్ లో హీరో శివకార్తికేయన్‌ ను మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంతో ప్రజెంట్‌ చేసారు. కాశ్మీర్ లోని టెర్రర్ ఎటాక్స్ నేపథ్యంలో భారత ఆర్మీని నడిపించే పవర్ ఫుల్ మేజర్ పాత్రలో చూపించారు. ఓవైపు దేశభక్తిని మరోవైపు యాక్షన్‌ అంశాలతో కట్ చేయబడిన ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఇందులో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ టీఎంజేకే సభ్యులు బుధవారం నిరసనలకు దిగారు. 


‘అమరన్‌’ సినిమా విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులోని తిరునెల్వేలి, తిరుచిరాపల్లి, తిరుప్పూర్, వెల్లూరు, కడలూరు తదితర ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. శివకార్తికేయన్, కమల్ హాసన్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఇద్దరు నటులపై గూండాస్ చట్టం ప్రయోగించాలని డిమాండ్ చేసారు. ఈ క్రమంలో వారి దిష్టిబొమ్మలను దహనం చేయడానికి ప్రయత్నించారు. అయితే వెంటనే పోలీసులు రంగంలోకి దిగి నిరసకారులను చెదరగొట్టి, పరిస్థితిని కంట్రోల్ చేసారు. కొందరు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. 


ఈ సందర్భంగా టీఎంజేకే తిరుచిరాపల్లి జిల్లా కార్యదర్శి రాయల్‌ సిద్ధిక్‌ మీడియాతో మాట్లాడుతూ.. ''అమరన్‌ సినిమా టీజర్‌లో ముస్లింలను, కాశ్మీర్ ప్రజలను ఉగ్రవాదులుగా చిత్రీకరించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి. తమిళనాడు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ సినిమాను నిషేధించాలి'' అని అన్నారు. రాష్ట్రంలో అన్ని మతాల వారితో సామరస్యంగా జీవిస్తున్న ముస్లింలను తమిళ చిత్ర పరిశ్రమ చెడుగా చిత్రీకరిస్తోందని ఆయన ఆరోపించారు. మరి దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. 


కాగా, భార‌త ఆర్మీకి విశేష సేవలందించిన మేజర్ ముకుంద్ వరదరాజన్ గురించి రాహుల్ సింగ్, శివ్ అరూర్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్’ అనే పుస్త‌కం అధారంగా ‘అమరన్‌’ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఆయన జీవితంపై చాలాకాలం రీసెర్చ్ చేసి స్క్రిప్ట్ రెడీ చేసారు. రాష్ట్రీయ రైఫిల్స్‌ 44వ బెటాలియన్‌కు చెందిన మేజర్ వరదరాజన్.. ఏప్రిల్ 2014 లో జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్‌లోని ఒక గ్రామంలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తూ ప్రాణాలు కోల్పోయారు.


ఆయనకు మరణానంతరం దేశ అత్యున్నత శాంతి శౌర్య పురస్కారం అశోక చక్ర లభించింది. ఇప్పుడు అలాంటి స్ఫూర్తిదాయమైన పాత్రలో శివకార్తికేయన్ కనిపించనున్నారు. సాయి పల్లవితో పాటుగా భువన్ అరోరా, రాహుల్ బోస్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌, సోనీ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. 2024 సమ్మర్ లో తెలుగు తమిళ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. 



Also Read: హీరోలుగా ముగ్గురు కమెడియన్లు.. హిట్టు కొట్టేదెవరు?