Meera Chopra: సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పెళ్లిళ్ల సందడి కొనసాగుతోంది. మూడు పదుల వయస్సు దాటిన హీరోయిన్లంతా ఒక్కరొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. మొన్న అగ్ర కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడిని వివాహమాడి మూడు మూళ్ళ బంధంలో అడుగుపెట్టగా.. ఇప్పుడు మరో టాలీవుడ్ హీరోయిన్ కూడా పెళ్లికి రెడీ అయింది. ప్రముఖ నటి మీరా చోప్రా త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయిందని, వచ్చే నెలలో ఆమె డెస్టినేషన్ వెడ్డింగ్‌ను జరుపుకోనుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 


40 ఏళ్ళ మీరా చోప్రా ఈ ఏడాది కొత్త జీవితం మొదలుపెట్టబోతున్నట్లు గతంలోనే హింట్ ఇచ్చింది. అన్నట్లుగానే ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ ని వివాహం చేసుకోడానికి సిద్ధమైంది. ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్తతో గత ఆరేళ్లుగా డేటింగ్ లో ఉంది మీరా. అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చి 11 లేదా 12న జైపూర్‌ ప్యాలెస్ లో ఆమె పెళ్లి వేడుక ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే డెస్టినేషన్ ఫైనలైజ్ అయింది.. హిందూ సాంప్రదాయం ప్రకారం తన వివాహం జరగనుందని, త్వరలోనే అన్ని వివరాలను పంచుకుంటానని మీరా చెప్పినట్లుగా బాలీవుడ్ మీడియా పేర్కొంది. 


మీరా చోప్రా స్టార్‌ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రాకు కజిన్‌ అవుతుందనే సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా 2018 డిసెంబర్ లో జోధ్‌పూర్‌లోని ప్రసిద్ధ ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో నిక్ జోనాస్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అలానే బాలీవుడ్ స్టార్స్ సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ గతేడాది జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో పెళ్లి చేసుకున్నారు. విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ ల పెళ్లి రాజస్థాన్‌లోని రణతంబోర్ సమీపంలోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో జరిగింది. ఇప్పుడు మీరా కూడా తన డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం రాజస్థాన్‌ - జైపూర్ ప్యాలెస్ ను ఎంచుకుంది.


ఇప్పటికే మీరా చోప్రాతో పాటు ఆమె ఫ్యామిలీ అంతా పెళ్లి పనుల్లో తలమునకలై ఉన్నారట. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు అతిథులు మాత్రమే హాజరవుతారని అంటున్నారు. పెళ్లి తర్వాత బాలీవుడ్‌లోని ఫ్రెండ్స్‌ కోసం ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్‌ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందట. అయితే మీరా ఇప్పటివరకు తనకు కాబోయే భర్త వివరాల్ని బయటకు వెళ్లడించలేదు. మరికొన్ని రోజుల్లో ఈ వివరాలు బయటకు రాబోతున్నాయి. 


కాగా మీరా చోప్రా 2005లో 'అన్‌బే ఆరుయిరే' అనే తమిళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తమిళ చిత్ర పరిశ్రమలో నీలా అనే ఆన్ స్క్రీన్ నేమ్ తో పరిచయమైన ఈ బ్యూటీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'బంగారం' చిత్రంలో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత 'వాన' 'మారో' వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగులో చివరగా 2013లో కింగ్ నాగార్జున హీరోగా నటించిన 'గ్రీకు వీరుడు' మూవీలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె నటించిన 'సఫేద్‌' మూవీ గతేడాది జీ5 ఓటీటీలో రిలీజ్ అయింది. ఇప్పుడు పెళ్లి టాపిక్‌తో వార్తల్లో నిలిచింది మీరా చోప్రా. 


Also Read: చెన్నైలో ఉండి బ‌తికిపోయాడు - సంగీత దర్శకుడిపై 'సిద్ధార్థ్ రాయ్' డైరెక్టర్ ఫైర్