Jyotika at Shaitaan Trailer Launch Event: సీనియర్ హీరోయిన్ జ్యోతిక.. హీరో సూర్యతో పెళ్లి తర్వాత చాలాకాలం సినిమాలకు దూరంగా ఉంది. కొన్నేళ్ల క్రితం తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి జాగ్రత్తగా స్క్రిప్ట్స్‌ను సెలక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తోంది. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించడం మాత్రమే కాకుండా కంటెంట్ ఉండి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే హీరోల సరసన లీడ్ రోల్ చేయడానికి కూడా సిద్ధమవుతోంది. ఇక ఎన్నో ఏళ్ల తర్వాత తను బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతోంది. త్వరలోనే ‘సైతాన్’ అనే సినిమాతో హిందీ ప్రేక్షకులను పలకరించనుంది. ఇక ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అజయ్ దేవగన్‌ను సౌత్ హీరోలతో పోలుస్తూ జ్యోతిక చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.


ఇంత ప్రాధాన్యత ఇవ్వరేమో..


‘‘సినిమా మొత్తం షూటింగ్‌లో అజయ్ ప్రవర్తించిన విధానం నన్ను బాగా సర్‌ప్రైజ్‌కు గురిచేసింది. నేను సౌత్‌లో చాలామంది హీరోలతో, దాదాపు అందరితో కలిసి పనిచేశాను. తాజాగా నా చివరి చిత్రం మమ్ముట్టి సార్‌తో చేశాను. ఈ సినిమా అజయ్‌తో చేస్తున్నాను. నేను ఇన్నేళ్ల తర్వాత ఒక విషయం తెలుసుకున్నాను. అది ఏంటంటే మన పని కోసం మనం ఎంత చేస్తామనేది చాలా ముఖ్యం. అజయ్ అసలు ఏ స్వార్థం లేకుండా ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. ఆఖరికి పోస్టర్‌లో కూడా నాకు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. సౌత్‌లో హీరోలతో సినిమాలు చేసినా కూడా ఎవరూ పోస్టర్‌లో ఇంత ప్రాధాన్యత ఇవ్వరేమో’’ అంటూ పోస్టర్ గురించి, అజయ్ గురించి వ్యాఖ్యలు చేసింది జ్యోతిక.


20 ఏళ్ల తర్వాత..


‘‘మమ్ముట్టి సార్‌ను, అజయ్‌ను చూస్తుంటే వీరే సినిమాలకు అసలైన స్టార్స్ అనిపిస్తుంది. తీసుకునేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ తిరిగి ఇచ్చేవాళ్లు చాలా తక్కువ. వాళ్లు సినిమా కోసం తిరిగి ఇస్తున్నారు. చాలా గ్రేట్’’ అంటూ మమ్ముట్టితో అజయ్‌ను పోలుస్తూ జ్యోతిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అజయ్ తర్వాత మాధవన్ గురించి మాట్లాడడం మొదలుపెట్టింది జ్యోతిక. ఒకప్పుడు తను, మాధవన్ కలిసి హీరోహీరోయిన్లుగా నటించారు. అదే విషయాన్ని‘సైతాన్’ ట్రైలర్‌ లాంచ్‌లో గుర్తుచేసుకుంది. ‘‘మ్యాడీ, నేను 20 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి సినిమా చేస్తున్నాం. హీరోహీరోయిన్ కలిసి చేసిన తర్వాత మళ్లీ ఇలాంటి పాత్రలు కలిసి చేయడం అంటే నటీనటులుగా మేము ఎదిగామనే అనుకుంటున్నాను’’ అని తెలిపింది.






ఒకటే కుటుంబం..


‘సైతాన్’ గురించి, అందులో నటించిన ఇతర నటీనటుల గురించి కూడా జ్యోతిక చెప్పుకొచ్చింది. ‘‘ఎవ్వరం పోటీపడి నటించలేదు. ఎవరి పాత్రలో వారు ఒదిగిపోయారు. అందుకే మేము ఒకటే కుటుంబం అన్న ఫీలింగ్ వచ్చింది. సినిమా కూడా కొన్నిరోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేసుకుంది. నేను చాలాసార్లు అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఎందుకంటే బాలీవుడ్‌కు తిరిగి రావడం, ఇలాంటి పాత్రతో కమ్ బ్యాక్ ఇవ్వడం చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది’’ అని చెప్పింది. గుజరాతి మూవీ ‘వష్’కు రీమేక్‌గా తెరకెక్కిన చిత్రమే ‘సైతాన్’. జియో స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మార్చి 8న ‘సైతాన్’ థియేటర్లలో విడుదలకు సిద్ధమవ్వగా తాజాగా విడుదలయిన ఈ మూవీ ట్రైలర్ హారర్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.


Also Read: ఈ రోజు మూవీ టికెట్ ధర రూ.99 మాత్రమే - కేవలం ఆ సినిమాలకే ఆఫర్!