Cinema Lovers Day: ఈ రోజు (ఫిబ్రవరి 23) సినీ లవర్స్ డే. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్‌కు ఒక ట్రీట్ ఇవ్వాలని థియేటర్ల ఓనర్లు ఫిక్స్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా చైన్స్ అన్నింటిలో టికెట్ ధరను తగ్గించాలని నిర్ణయించుకున్నారు. దీంతో 2024 ఫిబ్రవరి, 23న దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లలో అతి తక్కువ టికెట్ ధరకే సినిమాలు చూసే అవకాశం లభిస్తుంది. కానీ ఈ టికెట్ ధర కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుందని వారు ప్రకటించారు. అయితే, ఈ ఆఫర్ అన్ని సినిమాలకు వర్తించదని కూడా కూడా స్పష్టం చేశారు. 


ఆ సినిమాలకు మాత్రమే..


తాజాగా విడుదలయిన ఎన్నో సినిమాల్లో ‘ఆల్ ఇండియా ర్యాంక్’, ‘ఆర్టికల్ 370’, ‘క్రాక్’, ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’, ‘ఫైటర్’లాంటి బాలీవుడ్ చిత్రాలను రూ.99 టికెట్ ధరకే చూడవచ్చని మల్టీప్లెక్స్‌లు ప్రకటించాయి. ఇక ‘మేడం వెబ్’, ‘ది హోల్డ్ ఓవర్స్’, ‘బాబ్ మార్లీ - వన్ లవ్’, ‘మీన్ గర్ల్స్’, ‘ది టీచర్స్ లాంజ్’ లాంటి హాలీవుడ్ మూవీస్‌కు కూడా పీవీఆర్‌లో ఇంతే టికెట్ ధర ఉందని తెలుస్తోంది. మామూలు సీట్స్‌కు మాత్రమే కాదు.. రిక్లైనర్ సీట్స్ విషయంలో కూడా టికెట్ ధరలను తగ్గించింది పీవీఆర్ ఐనాక్స్. రిక్లైనర్ సీట్స్‌ ధరలను రూ.199 నుంచి రూ.99కు తగ్గించింది. పీవీఆర్ మాత్రమే కాదు.. ఐమ్యాక్స్, 4డీఎక్స్, ఎమ్ఎక్స్4డీ ఫార్మాట్స్‌లో సినిమా చూడాలని అనుకున్నవారికి కూడా ఈ డిస్కౌంట్ ధరలు వర్తిస్తాయి.


అవకాశాన్ని వినియోగించుకోండి..


‘‘ఇండియన్ ప్రేక్షకుల మనసుల్లో సినిమాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వారు సినిమాలను ఎనలేని ఉత్సాహంతో ఆదరిస్తారు. నేషనల్ సినిమా డేకు స్ఫూర్తిగా ప్రారంభమయిన సినిమా లవర్స్ డే సందర్భంగా ఈ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలని అనుకుంటున్నాం. ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోమని సినిమా లవర్స్‌కు ఆహ్వానం పలుకుతున్నాం. ఫిబ్రవరీ 23న పేర్కొన్న సినిమాల నుండి ఏ సినిమాను అయినా తక్కువ ధరకు చూడవచ్చు’’ అని పీవీఆర్ ఐనాక్స్ కో సీఈఓ గౌతమ్ దత్తా ప్రకటించారు. ఈ వార్త దేశవ్యాప్తంగా సినీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. అయితే, తెలుగు సిినిమాలకు ఎందుకు ఈ ఆఫర్ ప్రకటించలేదని సినీ ప్రేమికులు వాపోతున్నారు.


తెలుగు ప్రేక్షకుల నిరాశ..


సినిమా లవర్స్ డే సందర్భంగా మల్టీప్లెక్స్‌లు అందిస్తున్న ఈ ఆఫర్ నార్త్ స్టేట్స్‌లో మాత్రమే. సౌత్ రాష్ట్రాల్లోని కర్ణాటకలో తప్పా ఇంకా ఎక్కడా ఈ డిస్కౌంట్ టికెట్ ధరలు ప్రేక్షకులకు అందుబాటులో లేవు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సినిమాలను ఆదరిస్తారు, ఏ భాష సినిమా అయినా కంటెంట్ బాగుంటే దానిని హిట్ చేస్తారు అని ఎందరో సినీ సెలబ్రిటీలు ప్రశసించారు. కానీ ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రం వారికి ఆఫర్లు అందించకపోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. టికెట్ ధరల విషయంలో డిస్కౌంట్ లభించినా.. ఏ సినిమా అయినా రూ.99 టికెట్ ధరకే చూడవచ్చన్న ఆఫర్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో లేదు. దీంతో వారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: 'సిద్దార్థ్‌ రాయ్‌' చేయాలంటే ధైర్యం ఉండాలి - నేనైతే భయంతో పారిపోయేవాడిని..