Tollywood Comedians as Heroes: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో కమెడియన్స్ తర్వాతి రోజుల్లో హీరోలుగా మారి ఆడియన్స్ ను అలరించారు. అలనాటి రాజబాబు, రేలంగి దగ్గర నుంచి.. నిన్న మొన్నటి సుడిగాలి సుధీర్, సుహాస్ వరకూ.. చాలా మంది హాస్యనటులు హీరోలుగా మెప్పించారు. అయితే ఇప్పుడు లేటెస్టుగా వైవా హర్ష, వెన్నెల కిషోర్, అభినవ్ గోమఠం లాంటి మరో ముగ్గురు స్టార్ కమెడియన్స్ హీరోలుగా మారుతున్నారు. వారం గ్యాప్ లో బాక్సాఫీసు దగ్గర అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నారు. 


వైవా హర్ష: 
కమెడియన్ హ‌ర్ష చెముడు (వైవా హర్ష) కథానాయకుడిగా నటించిన సినిమా ‘సుందరం మాస్టర్’. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలోతెరకెక్కిన ఈ చిత్రాన్ని మాస్ మహారాజా రవితేజ నిర్మించారు. ఇది విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ లో రూపొందిన ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్. ఇందులో హర్ష ఒక ఇంగ్లీష్ మాస్టర్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, అక్కినేని నాగచైతన్య లాంటి హీరోలు ప్రమోషన్స్ లో భాగం కావడంతో ఈ సినిమా చుట్టూ కావల్సినంత బజ్ క్రియేట్ అయ్యింది. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 23) ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.


అభినవ్ గోమటం: 
'సేవ్ ది టైగర్స్' అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించిన కమెడియన్ అభినవ్ గోమటం.. ఇప్పుడు 'మస్త్ షేడ్స్ ఉన్నాయి రా' సినిమాతో మెయిన్ హీరోగా మారుతున్నారు. ఈ చిత్రానికి తిరుప‌తి రావు ఇండ్ల ద‌ర్శ‌క‌త్వం వహించారు. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా.. ప్రమోషనల్ కంటెంట్ తో కొంత మేరకు ఆకట్టుకోగలిగింది. వరుణ్ తేజ్, నిఖిల్ లాంటి యువ హీరోలు ఈ సినిమాకి తమవంతు సపోర్ట్ అందించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 24న థియేటర్లలోకి రానుంది.


వెన్నెల కిషోర్: 
స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా హీరో అవతారమెత్తాడు. 'చారి 111' అనే స్పై కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఏజెంట్ బ్రహ్మచారిగా వెన్నెల కిషోర్ స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలయిన టీజర్, ట్రైలర్, సాంగ్ కు మంచి స్పందన లభించింది. మార్చి 1న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.


ఇలా ముగ్గురు పాపులర్ కమెడియన్స్ ఇప్పుడు హీరోలుగా థియేటర్లలోకి రాబోతున్నారు. ఇన్నాళ్లూ తమ కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ను అలరించిన వీళ్ళు.. ఈసారి కథానాయకులుగా కథలు చెప్పడానికి వస్తున్నారు. రాబోయే కొన్ని వారాలు పెద్ద సినిమాల రిలీజులు ఏవీ లేకపోవడంతో, ఈ గ్యాప్ లో బాక్సాఫీసు మీద దాడి చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తే, మున్ముందు హీరో కమ్ కమెడియన్లుగా కొనసాగే అవకాశం ఉంది. మరి వీరి ముగ్గురిలో ఎవరెవరు హిట్లు కొడతారో చూడాలి.


Also Read: ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'గుంటూరు కారం' హిందీ వెర్షన్!