HanuMan Box Office Collections: ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’ ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ రికార్డులు పడుతూనే ఉన్నాయి. సంక్రాంతికి విడుదలయిన ఈ సినిమా.. ఇంకా కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికీ ఈ మూవీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండడంతో దీనిని ఓటీటీ విడుదలను కూడా పోస్ట్‌పోన్ చేశారు మేకర్స్. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ‘హనుమాన్’ ఎంత కలెక్ట్ చేసిందో చెప్తూ.. దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఒక స్పెషల్ పోస్టును షేర్ చేశాడు. తమ సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుండి లభిస్తున్న ఆదరణ.. తనను ఎంతగానో సంతోషపెడుతుందని చెప్పుకొచ్చాడు.


సంక్రాంతి విన్నర్ ‘హనుమాన్’..


జనవరి 12న సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘గుంటూరు కారం’కు పోటీగా ‘హనుమాన్’ విడుదలయ్యింది. సంక్రాంతికి సీనియర్ హీరోల సినిమాలు పోటీగా ఉన్నాయని, అందుకే ‘హనుమాన్’ తప్పుకోవాలని చాలామంది ప్రశాంత్ వర్మకు సలహా ఇచ్చారు. కానీ ప్రశాంత్ మాత్రం అస్సలు వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేడు. జనవరి 12న మూవీ రిలీజ్ అయితే.. 11న పెయిడ్ ప్రీమియర్స్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్. ఆ పెయిడ్ ప్రీమియర్స్ నుండే ‘హనుమాన్’కు పాజిటివ్ రివ్యూలు లభించడంతో సంక్రాంతి విన్నర్ హనుమానే అని దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. మొదటి రోజు నుండే మౌత్ టాక్‌తో పాటు కలెక్షన్స‌ను కూడా ఓ రేంజ్‌లో సాధించింది ఈ సినిమా.


ప్రతీసారి కొత్త పోస్టర్..


‘హనుమాన్’ మూవీ విడుదలైన 25 రోజుల్లోనే రూ.300 కోట్ల కలెక్షన్స్ సాధించిందని, ఇంకా సాధిస్తూనే ఉందని ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా తన మూవీని ఆధరించిన ఆడియన్స్‌కు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. ‘హనుమాన్‌’ను మళ్లీ మళ్లీ చూడడానికి థియేటర్లకు వచ్చిన ప్రతీ కుటుంబానికి రుణపడి ఉంటాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశారు ప్రశాంత్ వర్మ. అంతే కాకుండా దీంతో పాటు ఒక స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ‘హనుమాన్’ సినిమా కలెక్షన్స్ పెరుగుతున్న ప్రతీసారి ఇలా కొత్త పోస్టర్లతో ఆకట్టుకుంటూనే ఉన్నారు ఈ యంగ్ డైరెక్టర్.






ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ..


ప్రస్తుతం ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్‌కు సంబంధించిన రెండో సినిమా ‘జై హనుమాన్’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రశాంత్ వర్మ బిజీగా ఉన్నాడు. దానికోసం అమెరికాలో అడుగుపెట్టాడు. ఆ విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఇక ‘హనుమాన్’ విషయానికొస్తే.. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో.. నార్త్ నుండి కూడా ఈ మూవీకి అదే రేంజ్‌లో ఆదరణ లభించింది. కేవలం హిందీలోనే కలెక్షన్స్ విషయంలో రికార్డులను బ్రేక్ చేసుకుంటూ వెళ్తోంది ‘హనుమాన్’. అంతే కాకుండా ఇప్పటికే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు సినిమాల లిస్ట్‌లో ‘హనుమాన్’ చోటు దక్కించుకుంది.


Also Read: రికార్డ్ క్రియేట్ చేస్తున్న సాయి పల్లవి ‘ప్రేమమ్’, రి-రిలీజ్‌లోనూ అదే క్రేజ్