Premam Re Release: మలయాళ సినిమాను దేశవ్యాప్తంగా మూవీ లవర్స్‌కు పరిచయం చేసిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. అందులో ‘ప్రేమమ్’ కూడా ఒకటి. 2015లో విడుదలయ్యింది ఈ సినిమా. పూర్తిస్థాయి ప్రేమకథగా తెరకెక్కిన ‘ప్రేమమ్’.. కేవలం మలయాళంలో మాత్రమే కాదు.. ఇతర దక్షిణాది భాషల్లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మలయాళంతో పాటు, తమిళ థియేటర్లలో కూడా చాలా ప్రాంతాల్లో 200 రోజులకు పైగా ఆడింది ఈ చిత్రం. తాజాగా ఈ సినిమా మరోసారి ఆ రెండు రాష్ట్రాల్లో రీ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే మూవీ విడుదలయ్యి వారం రోజులు అవుతున్నా.. తమిళనాడులోని థియేటర్లలో ఇంకా ‘ప్రేమమ్’ టికెట్స్ దొరకడం కష్టంగా ఉందని సమాచారం.


టికెట్లు దొరకడం లేదు..


2015లో చెన్నైలోని పలు థియేటర్లలో 200 రోజులు సక్సెస్‌ఫుల్‌గా నడిచింది ‘ప్రేమమ్’. అప్పట్లో కూడా ఈ సినిమా టికెట్ల కోసం యూత్ ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి కనిపిస్తోంది. 2015లో సూపర్ సక్సెస్ సాధించిన తర్వాత వరుసగా రెండు సంవత్సరాలు.. అంటే 2016, 2017లో కూడా ‘ప్రేమమ్’ రీ రిలీజ్ అయ్యింది. ఇక తాజాగా ఫిబ్రవరీ 1న కూడా ఈ మూవీ థియేటర్లలో రీ రిలీజ్ అయ్యింది. థియేటర్లలో ఈ మూవీ రీ రిలీజ్ అవ్వడం మూడోసారే అయినా.. దీనిని మళ్లీ మళ్లీ చూడడానికి యూత్ అంతా క్యూ కట్టారు. దీంతో చెన్నైలోని థియేటర్లలో టికెట్లు దొరకడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.


రీ రిలీజ్ కలెక్షన్స్‌లో రికార్డ్..


ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ ‘ప్రేమమ్’ రీ రిలీజ్ అవ్వడంతో యూత్ అంతా దీనిని చూడడానికి థియేటర్లకు వెళ్తున్నారు. ఆల్ఫోన్సో పుత్రేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బడ్జెట్ కేవలం రూ.4 కోట్లు మాత్రమే. కానీ దేశవ్యాప్తంగా రూ.75 కోట్ల కలెక్షన్స్‌ను సాధించి సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇప్పుడు రీ రిలీజ్ కలెక్షన్స్ విషయంలో కూడా ‘ప్రేమమ్’ దూసుకుపోతోంది. రీ రిలీజ్ అయిన అయిదు రోజుల్లోనే రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.2 కోట్ల కలెక్షన్స్ సాధించిందట ‘ప్రేమమ్’. దీంతో ఈ మూవీ ఫ్యాన్స్ అంతా తెగ సంతోషిస్తున్నారు. ఇలాంటి మంచి సినిమాలకు ఎక్స్‌పైరీ డేట్ లాంటిది ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


ముగ్గురు హీరోయిన్లు పరిచయం..


అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్.. ఈ ముగ్గురు హీరోయిన్లు ‘ప్రేమమ్’ సినిమా ద్వారానే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. హీరోయిన్లంటే మేకప్ వేసుకోవాలి, తమ మొహాన్ని అందంగా చూపించాలి అనుకునే అందరి అంచనాలను సాయి పల్లవి.. ఈ ఒక్క సినిమాతో బద్దలుకొట్టింది. సింపుల్‌గా కాటన్ శారీలతోనే యూత్‌ను ఫిదా చేసింది. అనుపమ పరమేశ్వరన్ సైతం తన రింగుల జుట్టుతో చాలామందికి క్రష్‌గా మారిపోయింది. మలయాళంలో అప్పటికే బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘ప్రేమమ్’ను తెలుగులో అదే టైటిల్‌తో రీమేక్ చేసే రిస్క్ తీసుకున్నాడు నాగచైతన్య. తను హీరోగా తెలుగులో రీమేక్ అయిన ‘ప్రేమమ్’ కూడా క్లీన్ హిట్‌ను అందుకుంది. ఈ మూవీ ద్వారానే అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యారు. మలయాళంలో సాయి పల్లవి చేసిన పాత్రలో  శృతి హాసన్ కనిపించింది.


Also Read: 'ఈగల్' మూవీ చూసిన రవితేజ - మాస్ మహారాజ్ ఫస్ట్ రివ్యూ ఇదిగో