Killer Mike Arrest: తాజాగా అమెరికాలో లాస్ ఏంజెల్స్‌లో గ్రామీ అవార్డుల వేడుక చాలా ఘనంగా జరిగింది. అందులో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు గ్రామీ అవార్డులను గెలుచుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు అమెరికాకు చెందిన ర్యాపర్ కిల్లర్ మైక్. కానీ గ్రామీ అవార్డుల వేడుక పూర్తయిన వెంటనే కిల్లర్ మైక్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. మూడు అవార్డులను అందుకున్నాడని ఈ ర్యాపర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేసే లోపల పోలీసులు తనను అరెస్ట్ చేశారని తెలుసుకొని కలవరపడ్డారు. ఇక పోలీసులు.. తన చేతికి సంకెళ్లు వేసి తీసుకెళ్తున్న వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.


పోలీసుల క్లారిటీ..


‘‘గ్రామీ అవార్డుల కార్యక్రమం జరుగుతున్నప్పుడు సాయంత్రం 4 గంటల సమయంలో మైక్ ఒక వాగ్వాదంలో పాల్గొన్నాడు. అందుకే తనను అదుపులోకి తీసుకున్నాం’’ అంటూ పోలీస్ స్పోక్స్ పర్సన్ మైక్ లోపేజ్.. మీడియాకు తెలిపారు. ముందుగా మూడు గ్రామీ అవార్డులను అందుకున్న కిల్లర్ మైక్.. తర్వాత అదే వేడుకలో వాగ్వాదానికి దిగినందుకు పోలీసులు తనను అరెస్ట్ చేశారని క్లారిటీ ఇచ్చారు. ఈ 48 ఏళ్ల ర్యాపర్.. అవార్డ్ అందుకున్న తర్వాత మాట్లాడిన మాటలు తన ఫ్యాన్స్‌ను ఎంతగానో ఇన్‌స్పైర్ చేశాయి. మీరు చేసే పనికి నిజాయితీగా ఉండండి అంటూ అందరికీ సలహా ఇచ్చాడు. ఇక ఈసారి గ్రామీ అవార్డుల వేడుకలో తనకు బెస్ట్ ర్యాప్ పర్ఫార్మెన్స్, బెస్ట్ ర్యాప్ సాంగ్, బెస్ట్ ర్యాప్ ఆల్బమ్ కేటగిరిల్లో అవార్డులు దక్కాయి.


మూడు కేటగిరిల్లో అవార్డులు..


కిల్లర్ మైక్ క్రియేట్ చేసిన ‘సైంటిస్ట్స్ అండ్ ఇంజనీర్స్’ అనే పాటకు బెస్ట్ ర్యాప్ పర్ఫార్మెన్స్, బెస్ట్ ర్యాప్ సాంగ్ కేటగిరిలో అవార్డులు దక్కాయి. ఈ పాటలో ఆండ్రే, ఫ్యూచర్, ఎరీన్ ఆలన్ కేన్ నటించారు. ఇక తను క్రియేట్ చేసిన ‘కిల్లర్’ అనే ఆల్బమ్‌కు బెస్ట్ ర్యాప్ ఆల్బమ్ కేటగిరిలో గ్రామీ అవార్డును అందుకున్నాడు. అలా మొత్తంగా మూడు గ్రామీ అవార్డులను దక్కించుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు కిల్లర్ మైక్. మూడో గ్రామీ అవార్డును అందుకోవడానికి తను స్టేజ్‌పైకి వచ్చినప్పుడు ‘స్వీప్ అట్లాంటా స్వీప్’ అని అరుస్తూ తన సంతోషాన్ని బయటపెట్టాడు కిల్లర్ మైక్. అంతే కాకుండా తను చిన్న వయసులో ఎన్నో తప్పులు చేశానని, ఇప్పుడు మాత్రం తన మనసు సంతోషంతో నిండిపోయిందని బయటపెట్టాడు.


సామాజిక కార్యక్రమాల్లో యాక్టివ్..


2003లో చివరిగా గ్రామీ అవార్డును అందుకున్నాడు కిల్లర్ మైక్. ‘ది హోల్ వరల్డ్’ అనే పాటకు బెస్ట్ ర్యాప్ పర్ఫార్మెన్స్ కేటగిరిలో తనకు అవార్డ్ దక్కింది. మ్యూజిక్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా.. సామాజిక కార్యక్రమాల్లో కూడా కిల్లర్ మైక్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. నల్లవారికి సమాన హక్కులు కావాలి అని పోరాడేవారి వెనుక ఈ ర్యాపర్ కచ్చితంగా ఉంటాడని తన అభిమానులకు తెలుసు. రేస్ మధ్య ఉన్న విభేదాలను తొలగించడానికి కిల్లర్ మైక్ చాలాసార్లు తన అభిప్రాయాలను గట్టిగా బయటపెట్టాడు. అలా పలుమార్లు ఇబ్బందుల్లో కూడా పడ్డాడు. ఇప్పుడు ఏకంగా గ్రామీ అవార్డుల వేడుకల్లో వాగ్వాదానికి దిగి పోలీసుల కస్టడీలోకి వెళ్లాడు. 


Also Read: ఉపాసన తాతయ్య బయోపిక్‌లో రామ్ చరణ్!?