వెండితెర ఆదిపురుషుడు ప్రభాస్ (Prabhas) అమెరికాలో ఉన్నారు. ప్రతి సినిమా విడుదలకు ముందు ఫారిన్ టూర్ వేయడం బాహుబలికి అలవాటు. ఈసారి అగ్ర రాజ్యం అమెరికా వెళ్లారు. 'ఆదిపురుష్' (Adipurush Movie) విడుదల సమయంలో ఆయన అక్కడే ఉంటారు. 


అభిమానులకు ఓ బంపర్ ఆఫర్!
సాధారణంగా ఫారిన్ టూర్ వేసినప్పుడు ప్రభాస్ అజ్ఞాతంలో ఉంటారు. కానీ, ఈసారి అలా కాదు. సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఓకే చెప్పారని టాక్. ఇది అమెరికాలోని ఆయన అభిమానులకు బంపర్ ఆఫర్ అని చెప్పాలి. ప్రభాస్‌తో కలిసి థియేటర్లలో సినిమా చూడొచ్చు. ఆయన్ను కలవచ్చు. 


'ఆదిపురుష్' సినిమా దర్శక నిర్మాతలతో పాటు సన్నిహితులు, శ్రేయోభిలాషులు,  అభిమానులు అమెరికాలో సినిమా ప్రమోట్ చేస్తే బావుంటుందని అడగడంతో ప్రభాస్ 'సరే' అని చెప్పినట్లు తెలిసింది. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున సినిమా విడుదల కానుంది.


Also Read : 'టక్కర్' రివ్యూ : మాస్ యాక్షన్ హీరో కావాలని సిద్ధార్థ్ ట్రై చేస్తే?



'ఆదిపురుష్'ను అందరూ చూడొచ్చు!
Adipurush Censor : 'ఆదిపురుష్' సెన్సార్ పూర్తి అయ్యింది. హిందీ సెన్సార్ బోర్డు ఈ సినిమాకు క్లీన్ 'యు' సర్టిఫికేట్ ఇచ్చింది. పిల్లలు, పెద్దలు... అందరూ పాన్ ఇండియా రెబల్ స్టార్ సినిమా చూడొచ్చు అన్నమాట. దీని రన్ టైమ్ ఒక్క నిమిషం తక్కువ మూడు గంటలు. కంటెంట్ ఎంగేజింగ్‌గా ఉంటే... రన్ టైమ్ ఎక్కువైనా సరే ప్రేక్షకులు సినిమా చూస్తున్నారు. అందువల్ల, 'ఆదిపురుష్' చిత్ర బృందం మూడు గంటల సినిమాను చూపించడానికి మొగ్గు చూపించినట్టు ఉంది. 


Also Read విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?


'ఆదిపురుష్' చూసిన సెన్సార్ సభ్యులు దర్శక, నిర్మాతలను ప్రశంసించారని బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరం ప్రేక్షకులు సైతం హర్షించేలా సినిమా తీశారని చెప్పారట. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో ప్రభాస్ నటన, ఎమోషన్స్ అన్ని వర్గాలను ఆకట్టుకోవడం ఖాయమని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.      


అరణ్య కాండ, యుద్ధ కాండ... 
రామాయణం నేపథ్యంలో 'ఆదిపురుష్' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే, పూర్తి రామాయణాన్ని ఓం రౌత్ తీసుకోలేదు. అరణ్య కాండ, యుద్ధ కాండ... ఆ రెండిటిలో ముఖ్యమైన ఘట్టాలను తీసుకుని సినిమా తీశారు. జూన్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా త్రీడీలో విడుదల కానుంది. 


20 ఏళ్ళల్లో ఇటువంటి దర్శకుడిని చూడలేదు!
తన 20 ఏళ్ళ కెరీర్ లో ఓం రౌత్ లాంటి దర్శకుడు ఎవడినీ చూడలేదని ప్రభాస్ వ్యాఖ్యానించడం విశేషం. గత ఏడెనిమిది నెలలుగా ప్రతిరోజూ నిద్ర లేకుండా పని చేశారని ఆయన చెప్పారు. రోజుకు రెండు మూడు గంటలు మాత్రమే నిద్ర పోయారని, కుటుంబాలకు టైమ్ లేకుండా ఒక్కొక్కరూ పది రేట్లు పని చేశారని ఆయన చెప్పారు. గడిచిన ఎనిమిది నెలలు ఓం రౌత్ అండ్ టీమ్ ఒక యుద్ధం చేశారని, ఒక్కసారి వాళ్ళ ముఖాలు చూడమని ప్రభాస్ వ్యాఖ్యానించారు. 'ఆదిపురుష్'లో సీతా దేవిగా కృతి సనన్ నటించారు. లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్, హనుమంతుని పాత్రను దేవదత్తా నాగే పోషించారు. లంకేశుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు.