విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. 1974లో 'తాతమ్మ కల' అనే సినిమాతో తెరంగేట్రం చేసిన బాలయ్య.. పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మక చిత్రాలలో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. వందకు పైగా చిత్రాల్లో నటించి, 'నటసింహం'గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. డైలాగ్ డెలివరీలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. హీరోగా నిర్మాతగా గత ఐదు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు తన సేవలు అందిస్తున్న బాలకృష్ణుడు, నేడు తన 63వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ జర్నీపై ఓ లుక్కేద్దాం. 


1960 జూన్ 10న మద్రాసులో జన్మించిన నందమూరి బాలకృష్ణ.. తన తండ్రి ఎన్.టి.రామారావు దర్శకత్వంలో 'తాతమ్మ కల' చిత్రం ద్వారా పద్నాలుగేళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్‌ గా సినీ కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత రామబాణం, అన్నాదమ్ముల అనుబంధం, వేములవాడ భీమకవి, దాన వీర సూర కర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీ మద్విరాట పర్వం, రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, అనురాగ దేవత, సింహం నవ్వింది వంటి చిత్రాల్లో కీలకమైన సహాయ పాత్రల్లో నటించారు. 


1984లో భారతి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన 'సాహసమే జీవితం' సినిమాలో తొలిసారిగా సోలో లీడ్‌ గా నటించాడు బాలకృష్ణ. అదే ఏడాది కోడి రామకృష్ణ డైరెక్షన్‌ లో చేసిన 'మంగమ్మ గారి మనవడు' సినిమాతో హీరోగా తొలి బ్లాక్‌ బస్టర్ అందుకున్నారు. ఆ తరువాత ముద్దుల కృష్ణయ్య, అపూర్వ సోదరులు, మువ్వ గోపాలుడు, ముద్దుల మావయ్య, సీతారామ కళ్యాణం, నారీ నారీ నడుమ మురారి, లారీ డ్రైవర్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించడమే కాదు, నటుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. జంధ్యాలతో చేసిన 'బాబాయ్ అబ్బాయ్' సినిమా బాలయ్యలోని కామెడీ యాంగిల్‌ ను అభిమానులకు పరిచయం చేసింది.


1991లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన తొలి సైన్స్ ఫిక్షన్ మూవీ 'ఆదిత్య 369' ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇదే క్రమంలో వచ్చిన రౌడీ ఇన్‌స్పెక్టర్, బంగారు బుల్లోడు సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్ సాధించి, ఆయన్ను అగ్ర హీరోల సరసన నిలిపాయి. బంగారు బుల్లోడు, నిప్పురవ్వ చిత్రాలు ఒకేరోజు రిలీజ్ అవ్వడం అనేది టాలీవుడ్ లో ఒక సంచలనమనే చెప్పాలి. ఇక 1994లో చేసిన 'భైరవ ద్వీపం' మూవీ బాలయ్య కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆ తర్వాత బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య, పవిత్ర ప్రేమ వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ ను అలరించారు.


1999లో వచ్చిన 'సమరసింహా రెడ్డి' సినిమా బాలయ్య కెరీర్‌ ను మలుపు తిప్పింది. ఫ్యాక్షన్ సినిమాలకు నాంది పలుకుతూ, బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. స్క్రీన్ పై ఆయన తొడగొట్టడం, ఇండస్ట్రీ రికార్డ్స్ చెల్లాచెదురు అవ్వడం ఏకధాటిన జరిగిపోయాయి. ఈ సినిమాతో బాలకృష్ణ తిరుగులేని మాస్ ఫాలోయింగ్‌ ను సంపాదించుకున్నారు. అయితే ఆ తరువాత మరో హిట్ అందుకోడానికి చాలా సమయమే పట్టింది. 


సుల్తాన్, కృష్ణబాబు, వంశోద్ధారకుడు, గొప్పింటి అల్లుడు వంటి బ్యాక్ టూ బ్యాక్ నాలుగు పరాజయాలు పలకరించాయి. ఈ నేపథ్యంలో బి. గోపాల్ తో కలిసి చేసిన 'నరహింహా నాయుడు' మూవీ బాలయ్యకు భారీ బ్లాక్‌ బస్టర్ అందించడమే కాదు, ఇండస్ట్రీ రికార్డ్ నెలకొల్పింది. ఆ తర్వాత భలేవాడివి బాసూ, సీమసింహం సినిమాలు ప్లాప్ అవ్వగా.. చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీనరసింహ చిత్రాలు హిట్ అయ్యాయి. 


అయితే పల్నాటి బ్రహ్మానాయుడు, విజయేంద్ర వర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, మహారథి, ఒక్క మగాడు, పాండురంగడు, మిత్రుడు వంటి వరుస డిజాస్టర్లు పలకరించడంతో, అందరూ ఇక బాలయ్య పని అయిపోయిందనుకున్నారు. అలాంటి టైములో 2010లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన 'సింహా' సినిమాతో సింహ గర్జన ఎలా ఉంటుందో బాక్సాఫీస్ కు చూపించాడు. కానీ ఆ తర్వాత వచ్చిన పరమ వీర చక్ర, శ్రీరామ రాజ్యం, అధినాయకుడు, శ్రీమన్నారాయణ చిత్రాలు ఆకట్టుకోలేదు. 


2014లో 'లెజెండ్' మూవీతో బౌన్స్ బ్యాక్ అయిన బాలయ్య..  గౌతమిపుత్ర శాతకర్ణి మూవీతో ఆకట్టుకున్నాడు. కాకపోతే ఎన్నో అంచనాలు పెట్టుకున్న తన తండ్రి బయోపిక్ డిజాస్టర్ గా మారడం ఆయన్ను తీవ్రంగా నిరాశ పరిచింది. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని చవి చూశాయి. జై సింహా, రూలర్ చిత్రాలు కూడా సక్సెస్ సాధించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ బోయపాటి శ్రీనుతో చేసిన 'అఖండ' సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచి, బాలయ్యను ట్రాక్ ఎక్కించింది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'వీర సింహారెడ్డి' సినిమా కూడా హిట్ స్టేటస్ అందుకుంది.


ఇప్పటి వరకు 107 సినిమాల్లో నటించిన నటసింహం.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. బర్త్ డే స్పెషల్ గా ఇప్పటికే రిలీజైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీతో బాలయ్య 'గ్లోబల్ లయన్' గా పాన్ ఇండియాని టార్గెట్ చేయబోతున్నారు. ఓవైపు సినిమాల్లో మరోవైపు రాజకీయాల్లో అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్న బాక్సాఫీస్ బొనాంజా నందమూరి బాలకృష్ణ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ 'ABP దేశం' శుభాకాంక్షలు తెలియజేస్తోంది.


Read Also: 2023 సెకండ్ ఆఫ్‌లో వస్తున్న పాన్ ఇండియా చిత్రాలివే, ఈ సారి లక్ ఎలా ఉండబోతుందో!