సినిమా రివ్యూ : టక్కర్
రేటింగ్ : 1.75/5
నటీనటులు : సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీష్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు
ఛాయాగ్రహణం : వాంచినాథన్ మురుగేశన్
సంగీతం : నివాస్ కె ప్రసన్న
సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల
నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్
రచన, దర్శకత్వం : కార్తీక్ జి. క్రిష్
విడుదల తేదీ: జూన్ 9, 2023
హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా సిద్ధార్థ్ (Siddharth)ను అభిమానించే ప్రేక్షకులు తెలుగులోనూ ఉన్నారు. 'బొమ్మరిల్లు'తో పాటు ఆయన చేసిన కొన్ని సినిమాలే అందుకు కారణం. ఆయనలు లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. అది పక్కన పెట్టి మాస్ హీరోగా ఎదగాలని చేసిన ప్రయత్నమే 'టక్కర్' (Takkar Movie 2023). ఇందులో 'మజిలీ', 'మైఖేల్' సినిమాల ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Takkar Movie Story) : గుణశేఖర్ (సిద్ధార్థ్) పేద కుటుంబంలో జన్మిస్తాడు. తాను పేదవాడిగా చావకూడదని, డబ్బు సంపాదించాలని విశాఖకు వస్తాడు. బెంజ్ కార్ / క్యాబ్ డ్రైవర్‌గా ఉద్యోగం చేయడం ప్రారంభిస్తాడు. విశాఖలో రాజ్ (అభిమన్యు సింగ్) పెద్ద క్రిమినల్. అమ్మాయిలను కిడ్నాప్ చేసి... విదేశాలలో వ్యక్తులకు అమ్మేయడం లేదంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ డబ్బు తీసుకుని వదిలేయడం అతడి వృత్తి. జీవితంలోని ప్రతి అడుగులో అవమానాలు ఎదురు కావడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న గుణశేఖర్... రాజ్ అడ్డాకు వెళ్లి అక్కడ ఉన్న రౌడీలను కొట్టి వాళ్ళ కారు కొట్టేసి వస్తాడు. ఆ కారు డిక్కీలో ఉన్న లక్కీ అలియాస్ మహాలక్ష్మి (దివ్యాంశ కౌశిక్) ఉంటుంది.
రాజ్ మనుషులను గుణశేఖర్ ఎందుకు కొట్టాడు? లక్కీతో పరిచయం తర్వాత అతడి జీవితంలో వచ్చిన మార్పు ఏమిటి? అసలు ఆమెను తొలిసారి ఎక్కడ చూశాడు? కోట్లకు వారసురాలైన లక్కీకి సమస్యలు ఏమిటి? ఇంట్లో చూసిన పెళ్లి సంబంధం ఎందుకు వద్దని చెబుతుంది? గుణశేఖర్, లక్కీ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? రాజ్ అండ్ రౌడీలను తప్పించుకుని ఎలా బయట పడ్డారు? అనేది సినిమా.
విశ్లేషణ (Takkar Movie Review) : సిద్ధార్థ్ కెరీర్‌లో ఫ్లాప్స్ ఉన్నాయి. కానీ, ప్రేక్షకుల్లో అతడి ఇమేజ్ డ్యామేజ్ చేసే సినిమాలు లేవని చెప్పాలి. ఆ లోటు 'టక్కర్' భర్తీ చేసేలా ఉంది. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' తర్వాత తెలుగులో సిద్ధార్థ్ పేరు చెబితే ఆడియన్స్ ఊగిపోయిన రోజులు ఉన్నాయి. ఆ స్టార్ ఇమేజ్ తెలియని ఈ తరం ప్రేక్షకులు ఎవరైనా 'టక్కర్' చూస్తే... 'సిద్ధార్థ్‌కు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా వచ్చింది?' అని ఆశ్చర్యపోవచ్చు.
'టక్కర్' థియేటర్లలో అడుగు పెట్టిన కాసేపటికి ప్రేక్షకులకు ఓ సందేహం వస్తుంది. 'అసలు సిద్ధార్థ్ ఈ కథను ఎలా అంగీకరించారు?' అని! 'ఆ లుక్ ఎలా ఓకే చేశారు?' అని! ప్రయోగాలు చేయడంలో తప్పు లేదు. సిద్ధార్థ్ ఇమేజ్ ముందు మీసాలు తీసేసి, పిల్లి గడ్డం పెట్టుకున్న ఆ లుక్ యాక్సెప్ట్ చేసేలా లేదు. కథలో 'ఆవారా' ఛాయలు ఎక్కువ కనిపించాయి. అటు యాక్షన్, ఇటు రొమాన్స్, మధ్యలో కామెడీ... ఏదీ సరిగా లేదు. సగం సగం సీన్లతో తీసిన సినిమాలా ఉంది.
'టక్కర్'ను యాక్షన్ థ్రిల్లర్ తరహాలో తీయాలా? లేదంటే కామెడీతో మిక్స్ చేసి యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలా? రొమాంటిక్ సీన్లు రెండు మూడు పెడితే జనం చూస్తారా? అని దర్శకుడు కన్ఫ్యూజ్ అయ్యారు. యాక్షన్ సీన్స్ బాగా తీశారు. యోగిబాబు కామెడీ సీన్లు కథకు అడ్డు తగిలాయి. పాటలు ఓకే. అయితే, సరైన సందర్భం లేకుండా పాటలు వచ్చాయి. పార్టులు పార్టులుగా చూస్తే సినిమాలో కొన్ని సీన్లు బావుంటాయి. కానీ, కథగా చూస్తే అతుకుల బొంతలా ఉంది.
'టక్కర్'లో ప్రేక్షకులు ఫీలయ్యే కొత్తదనం ఏదైనా ఉందంటే... అది సిద్ధార్థ్ చేసే యాక్షన్ సీక్వెన్సులు! కార్ ఛేజింగ్ సీన్లు బావున్నాయి. హాలీవుడ్ రిఫరెన్సులతో వాటిని తీసినట్టు అనిపించినా ఎంటర్టైన్ చేస్తాయి.
నటీనటులు ఎలా చేశారు? : నటుడిగా సిద్ధార్థ్ ఎప్పుడో పేరు తెచ్చుకున్నారు. ఈ రోజు కొత్తగా ఆయన్ను పొగడాల్సిన అవసరం లేదు. అయితే, ముందు చెప్పినట్టు ఈ కథ ఎలా ఓకే చేశారా? అని డౌట్ కొడుతుంది. యాక్షన్ & ఎమోషనల్ సీన్స్... తన క్యారెక్టర్ వరకు ఆయన బాగా చేశారు. పేలవమైన కథను ఆయన నటన నిలబెట్టలేకపోయింది. దివ్యాంశ కౌశిక్ అందంగా కనిపించారు. పాత్ర పరిధి మేరకు చేశారు. అభిమన్యు సింగ్‌కు ఇటువంటి క్యారెక్టర్లు కొత్త కాదు. బ్యాడ్ బాయ్, క్రిమినల్ రోల్స్ చాలా చేశారు. ఆ లిస్టులో ఇంకో క్యారెక్టర్ అంతే! యోగిబాబు కామెడీ కొన్ని సీన్లలో మాత్రమే నవ్వించింది.
Also Read : 'బ్లడీ డాడీ' రివ్యూ : జియో సినిమాలో షాహిద్ కపూర్ యాక్షన్ థ్రిల్లర్ - ఎలా ఉందంటే?
చివరగా చెప్పేది ఏంటంటే? : టక్కర్... రెండు గంటల టార్చర్! సిద్ధార్థ్ మాస్ హీరో కావాలని అనుకుంటే మరో ప్రయత్నం చేయాలి. 'టక్కర్' వంటి రొటీన్ కథలతో, అంత కంటే రొటీన్ సీన్లతో వస్తే ప్రేక్షకులు ఆదరించడం కష్టమే.
Also Read : విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?