సినిమా రివ్యూ : బ్లడీ డాడీ
రేటింగ్ : 2.75/5
నటీనటులు : షాహిద్ కపూర్, రోనిత్  రాయ్, డయానా పెంటీ, సంజయ్ కపూర్, రాజీవ్ ఖండేల్వాల్ తదితరులు
ఛాయాగ్రహణం : మార్చిన్ Laskawiec
స్వరాలు : బాద్షా, ఆదిత్య దేవ్, అనూజ్ గార్గ్
నేపథ్య సంగీతం : జూలియస్ పేకియం  
దర్శకత్వం : అలీ అబ్బాస్ జాఫర్
విడుదల తేదీ: జూన్ 9, 2023
ఓటీటీ వేదిక : జియో సినిమా


షాహిద్ కపూర్ (Shahid Kapoor) కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'బ్లడీ డాడీ' (Bloody Daddy Movie). సల్మాన్ ఖాన్ హీరోగా 'సుల్తాన్', 'టైగర్ జిందా హై', 'భారత్' తీసిన అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. పన్నెండేళ్ళ క్రితం విడుదలైన ఫ్రెంచ్ ఫిల్మ్ 'స్లీప్ లెస్ నైట్స్' ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. జియో సినిమా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా (Bloody Daddy Review) ఎలా ఉంది?


కథ (Bloody Daddy Movie Story) : సుమేర్ ఆజాద్ (షాహిద్ కపూర్) నార్కోటిక్ ఆఫీసర్. కరోనా కాలంలో జరిపిన షూటౌట్‌లో రూ. 50 కోట్ల విలువ చేసే డ్రగ్స్ (కొకైన్) చిక్కుతాయి. ఆ మాల్ సికిందర్ (రోనిత్ రాయ్)ది. తన డ్రగ్స్ తన చేతికి రావడం కోసం సుమేర్ కుమారుడు అథర్వ్ (సర్తాజ్ కక్కర్)ను కిడ్నాప్ చేస్తాడు. డ్రగ్స్ ఇచ్చి అబ్బాయిని తీసుకువెళ్ళమని సుమేర్‌కు సికిందర్ ఫోన్ చేస్తాడు. డ్రగ్స్ బ్యాగుతో సికిందర్ సెవెన్ స్టార్ హోటల్‌లో సుమేర్ అడుగు పెట్టిన తర్వాత ఏమైంది? అక్కడికి నార్కోటిక్స్ అధికారులు అదితి (డయానా పెంటీ), సమీర్ (రాజీవ్ ఖండేల్వాల్) ఎందుకు వచ్చారు? బ్యాగ్ సుమేర్ చేతి నుంచి ఎలా మిస్ అయ్యింది? చివరకు, తండ్రీ కొడుకులు ఎలా బయట పడ్డారు? అనేది సినిమా.     


విశ్లేషణ (Bloody Daddy Movie Review) : యాక్షన్ థ్రిల్లర్ సినిమాలతో ఓ సమస్య ఉంటుంది. మెజారిటీ కథల్లో కొత్తదనం కనిపించదు. తర్వాత సన్నివేశంలో ఏం జరుగుతుందో ప్రేక్షకుడి ఊహకు అందకుండా అమేజింగ్ యాక్షన్ సీన్లతో తీస్తే,  హీరో పెర్ఫార్మన్స్ ఇరగదీస్తే హిట్టు వచ్చినట్టే! 'టైగర్ జిందా హై' వంటి యాక్షన్ ఫిల్మ్ తీసిన అనుభవం అలీ అబ్బాస్ జాఫర్ సొంతం! 'బ్లడీ డాడీ'ని ఆయన ఎలా తీశారు? షాహిద్ కపూర్ ఎలా చేశారు?


'బ్లడీ డాడీ'లో యాక్షన్ సీన్లను అలీ అబ్బాస్ జాఫర్ బాగా డిజైన్ చేశారు. మేకింగ్ & టేకింగ్‌ ద్వారా హాలీవుడ్ స్టైల్ సినిమా ఫీల్ తీసుకొచ్చారు. అయితే... హీరో క్యారెక్టర్, ఆ కాస్ట్యూమ్ డిజైన్ అంతా హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంచైజీ 'జాన్ విక్'లో హీరో కీనూ పాత్రను గుర్తు చేస్తుంది. ఫ్రెంచ్ ఫిల్మ్ 'స్లీప్ లెస్ నైట్స్'కు ఇండియన్ టచ్ ఇవ్వడం కోసం దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్, రచయితలు ఆదిత్య బసు & కో గట్టిగా కష్టపడ్డారు. కామెడీ వర్కవుట్ అయ్యింది. కానీ, రేసీగా సినిమా తీయడంలో ఫెయిల్ అయ్యారు. కొన్ని సీన్లలో లెంగ్త్ ఎక్కువైంది.


నార్కోటిక్ ఆఫీసర్, రా ఏజెంట్స్, స్పై బేస్డ్ ఫిల్మ్స్ అంటే... ఆ అధికారుల సంసార జీవితంలో సంతోషం ఉండదని, భార్యలు వదిలేసి వెళతారని చూపించే ఫార్ములా ఈ సినిమాలోనూ కంటిన్యూ అయ్యింది. 'స్లీప్ లెస్ నైట్స్' రీమేక్ అయితే మార్పులు చేయకూడదని ఏమీ లేదుగా! ఆల్రెడీ కొన్ని సినిమాల్లో సేమ్ సీన్లు చూడటంతో రొటీన్ అనిపిస్తాయి. పాటలు విడిగా వింటే బావున్నాయి. సినిమాలో సెట్ కాలేదు. సినిమాటోగ్రఫీ బావుంది. నేపథ్య సంగీతం సన్నివేశంలో ఫీల్, మూడ్ ఎలివేట్ చేసింది. ముందు చెప్పినట్టు యాక్షన్ సీన్స్ డిజైన్ బావుంది. 'స్లీప్ లెస్ నైట్స్' ఆధారంగా కమల్ హాసన్ 'చీకటి రాజ్యం' చేశారు. 


నటీనటులు ఎలా చేశారు? : 'హైదర్' నుంచి మొదలు పెడితే 'ఉడ్తా పంజాబ్', 'కబీర్ సింగ్', 'ఫర్జి' వెబ్ సిరీస్ వరకు... సీరియస్ & ఇంటెన్స్ యాక్షన్ రోల్స్ చేయడంలో షాహిద్ కపూర్ స్టయిలే వేరు. నటనలో అతని కంటూ ఓ స్పెషల్ సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది. 'బ్లడీ డాడీ'లోనూ షాహిద్ కపూర్ మార్క్ పెర్ఫార్మన్స్ బావుంది. యాక్షన్ సీన్లలో చక్కగా చేశారు. చాలా సీన్లలో వన్ మ్యాన్ షో చేశారు. సికిందర్ పాత్రలో రోనిత్ రాయ్ సెటిల్డ్ విలనిజం చూపించారు. సంజయ్ కపూర్ క్యారెక్టర్ రెగ్యులర్ డ్రగ్ డీలర్ టైపులో ఉంది. నటన పరంగా ఓకే. డయానా పెంటీ నార్కోటిక్ అధికారిగా కనిపించారు. షాహిద్ కుమారుడిగా నటించిన సర్తాజ్ కక్కర్ నటన బావుంది.


Also Read : విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?


చివరగా చెప్పేది ఏంటంటే? : షాహిద్ కపూర్ వన్ మ్యాన్ షో 'బ్లడీ డాడీ'. యాక్షన్ సినిమాల కోసం చూసే ప్రేక్షకులకు నచ్చుతుంది. మధ్యలో అక్కడక్కడా కామెడీ కోటింగ్ ఇచ్చారు. కథ, స్క్రీన్ ప్లే, కంటెంట్ పరంగా కొత్తదనం ఏమీ లేదు. జస్ట్... యాక్షన్ & యాక్షన్! మధ్యలో థ్రిల్ ఇచ్చిన సీన్స్ కొన్ని ఉన్నాయి. యాక్షన్ లవర్స్ ఈ వీకెండ్ ఓ లుక్ వేయొచ్చు.


Also Read 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?