కథానాయకుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రయాణం మొదలైన తర్వాత ఇంత స్పీడుగా ఏ సినిమా పనులూ జరగలేదేమో! ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళితే... మార్చిలో విడుదల తేదీ గురించి అనౌన్స్ చేశారు. అదీ జూలైలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని చెప్పారు. అసలు వివరాల్లోకి వెళితే... 


జూలై 28న పవన్, సాయి తేజ్ సినిమా విడుదల
పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఓ సినిమా చేస్తున్నారు కదా! ప్రముఖ నటుడు, ఇంతకు ముందు రవితేజ 'శంభో శివ శంభో'కు దర్శకత్వం వహించిన సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న సినిమా ఉంది కదా! ఆ సినిమా విడుదల తేదీని ఈ రోజు వెల్లడించారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చెప్పారు. 


పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. ఫిబ్రవరి 22న హైదరాబాదులో చిత్రీకరణ ప్రారంభించారు. ఈ సినిమాకు రోజుకు రెండు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు జనసేన పదవ వార్షికోత్సవ సభలో పవన్ తెలిపారు. ఈ సినిమాకు ఆయన 20 నుంచి 25 రోజులు షూటింగ్ చేస్తే చాలు. ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యిందట.


Also Read : 'జాన్ విక్ 4' రివ్యూ : కీనూ రీవ్స్ హాలీవుడ్ సినిమా ఎలా ఉందంటే?


కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది 'వినోదయ సీతమ్' సినిమాలో మెయిన్ కాన్సెప్ట్. తెలుగులో భగవంతుని పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా సాయి ధరమ్ తేజ్ నటించనున్నారు.


పవన్ మోడ్రన్ దేవుడి పాత్ర చేయడం రెండోసారి. ఇంతకు ముందు 'గోపాల గోపాల'లో మోడ్రన్ శ్రీ కృష్ణుని పాత్ర చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కొంత సేపే ఉంటుంది. షూటింగ్ చేయడానికి ఎక్కువ రోజులు అవసరం లేదు. అందుకని, ముందు ఈ సినిమా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 20 డేస్ కేటాయించారట. మార్చి నెలాఖరు వరకు ఈ సినిమా షూటింగ్ చేస్తారని సమాచారం. 'వినోదయ సీతమ్' తెలుగు వెర్షన్ విషయానికి వస్తే... ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన 'రొమాంటిక్' కథానాయిక కేతికా శర్మ నటించనున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో ప్రత్యేక గీతంలో శ్రీలీల కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.


Also Read : ఏయ్ పిల్లా - రవితేజ వారసుడి సినిమా ఆగింది!


'వినోదయ సీతం' రీమేక్ కాకుండా... 'హరి హర వీర మల్లు', హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ సినిమా పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాయి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న 'హరి హర వీర మల్లు' చిత్రీకరణ చాలా వరకు పూర్తి అయ్యింది. వచ్చే నెల నుంచి హరీష్ శంకర్ సినిమా, ఆ తర్వాత మేలో సుజీత్ సినిమా సెట్స్ మీదకు వెళతాయట. ఒక్కో సినిమాకు పది పది రోజులు చొప్పున పవన్ డేట్స్ కేటాయించారట.