'ఆర్ఎక్స్ 100'తో తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ భామ పాయల్. ఆ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస అవకాశాలు వచ్చాయి. వెంకటేష్, రవితేజ వంటి అగ్ర హీరోలతోనూ పాయల్ సినిమాలు చేశారు. అయితే... ప్రతి సినిమాలో ఆమె గ్లామర్ ఎక్కువ హైలైట్ అయింది. 'ఆర్ఎక్స్ 100' వంటి విజయం మళ్లీ లభించలేదు. ఈ తరుణంలో తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వమంటూ దర్శకుడు వెంటపడ్డానని పాయల్ తెలిపారు. ఆ దర్శకుడు ఎవరో కాదు... 'ఆర్ఎక్స్ 100' అజయ్ భూపతి.


'ఆర్ఎక్స్ 100, 'మహా సముద్రం' చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా 'మంగళవారం'. ఇందులో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించారు. తొలుత ఈ సినిమాలో ఆమెను తీసుకోవాలని అనుకోలేదని దర్శకుడు తెలిపారు. పాయల్ కూడా సినిమా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ మాటే చెప్పారు.


అజయ్ భూపతి వెంటపడ్డా! - పాయల్
''నేను తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయకగా ప్రవేశించి ఐదేళ్లు పూర్తి అయ్యాయి. ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమ, ఆదరాభిమానాలు చూపించారు. ‌ అయితే నేను ఆశించిన క్యారెక్టర్లు సినిమాలు రాలేదు. ఈ సమయంలోనే 'సార్... నాకు అవకాశం ఇవ్వండి' అంటూ అజయ్ భూపతి వెంటపడ్డా. మంచి క్యారెక్టర్ ఏదైనా ఉంటే తప్పకుండా ఫోన్ చేస్తానని ఆయన చెప్పారు. చిన్న పాత్రల కోసం నన్ను తీసుకోలేనని కూడా వివరించారు. మధ్య మధ్యలో ఫోన్ చేసినప్పుడు కొత్త సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని చెబితే... 'నన్నెందుకు తీసుకోరు' అని అడిగా. ఎందుకంటే... అజయ్ భూపతికి నా పొటెన్షియల్ ఏంటో బాగా తెలుసు. 'మీరు అవకాశం ఇస్తే నాకు కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుంది' అని కూడా చెప్పా. సుమారు 35 మందిని ఆడిషన్ చేసిన తర్వాత నాకు ఫోన్ చేశారు. నన్ను కూడా ఆడిషన్ లుక్ టెస్ట్ చేసి ఓకే చేశారు'' అని పాయల్ తెలిపారు. తెలుగులో 'మంగళవారం' సినిమా తనకు కం బ్యాక్ మూవీ అవుతుందని పాయల్ చాలా నమ్మకంగా ఉన్నారు. 


ఇండియన్ స్క్రీన్ మీద కొత్త ప్రయోగం ఇది
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇప్పటివరకు రానటువంటి కథ క్యారెక్టర్లతో అజయ్ భూపతి 'మంగళవారం' చేశారని పాయల్ తెలిపారు. ఈ సినిమాలో తాను చేసినటువంటి పాత్ర ఇంతకు ముందు ఇండియన్ సినిమా హీరోయిన్లు ఎవరు చేయలేదన్నారు. 'మంగళవారం'లో తాను శైలు పాత్రలో కనిపిస్తానని, ఆ క్యారెక్టర్ ద్వారా మహిళలకు సంబంధించిన ఓ సెన్సిటివ్ టాపిక్ సినిమాలో అజయ్ భూపతి డిస్కస్ చేశారని పాయల్ వివరించారు. 


క్యారెక్టర్ నుంచి బయటకు రావడానికి 15 రోజులు పట్టింది!
'మంగళవారం'లో పల్లెటూరి అమ్మాయిగా కనిపించడానికి ఆ మేకప్ గట్రా వేసుకోవడానికి ప్రతిరోజు రెండు గంటలు పట్టేదని పాయల్ వివరించారు. మేకప్ వేసుకోవడం తీయడం కంటే ఆ క్యారెక్టర్ నుంచి బయటకు రావడానికి తనకు ఎక్కువ సమయం పట్టిందన్నారు. ఈ సినిమా తనపై మానసికంగా చాలా ప్రభావం చూపించిందని ఆమె తెలిపారు. చిత్రీకరణ అంతా పూర్తి చేసిన తర్వాత ఢిల్లీలోని తన తల్లి దగ్గరకు వెళ్లి 15 రోజులు ఉంటే గాని మామూలు మనిషిని కాలేదని అన్నారు.


Also Read : సూర్య, రజనీకాంత్ రిజెక్ట్ చేసిన తర్వాత విక్రమ్ దగ్గరకు...


'మంగళవారం' మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల శుక్రవారం (నవంబర్ 17). అయితే... ఈ రోజు గురువారం రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సినిమాపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. 


Also Read శివ కార్తికేయన్ - మురుగుదాస్ సినిమాకు 'జైలర్' టచ్?