టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ, అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ డైరెక్టర్ల వెనుక పరుగులు తీయకుండా, వైవిధ్యమైన కథలకే ప్రాధాన్యత ఇస్తూ సొంత స్టార్‌డమ్ ను సృష్టించుకున్నాడు.. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేయగలిగే 'పవర్ స్టార్' గా ఎదిగాడు. సినిమా కోసం ఎలాంటి సాహసమైనా చేయడానికి సిద్ధపడే తత్త్వం... అతని స్టైల్, మేనరిజం, యాటిట్యూడ్ వంటివి పవన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చుపెట్టాయి. అవే ఆయన్ని క్రేజ్ కు పర్యాయపదంగా మార్చాయి. నటుడిగానే కాకుండా నిర్మాతగా, రైటర్ గా, దర్శకుడిగానూ నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అయితే కేవలం సినిమాలకే పరిమితం అవ్వకుండా, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రజా సేవ చేస్తున్నారు. అలాంటి పవన్ ఈరోజుతో 52 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుందాం.


'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో 1996లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. 'సుస్వాగతం' సినిమాలతో విజయాన్ని అందుకుని యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత వచ్చిన 'తొలిప్రేమ' చిత్రం పవన్ కు తొలి బ్లాక్ బస్టర్ ను రుచి చూపించింది. 'తమ్ముడు' తో కమర్షియల్ సక్సెస్ సాధించిన ఆయన.. 'బద్రీ.. బద్రీనాథ్' అంటూ బాక్సాఫీస్ ను షేక్ చేశారు. ఇక 2001లో వచ్చిన 'ఖుషి' సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసి, పవన్ ను టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా నిలిపింది. 


'ఖుషి' తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకున్న పవన్ కల్యాణ్... 2003లో 'జానీ' సినిమా కోసం మెగా ఫోన్ పట్టుకొని డైరెక్టర్ అవతారమెత్తాడు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌ గా మిగిలింది. అయినప్పటికీ కల్ట్ స్టేటస్‌ను పొందింది. ఈ క్రమంలో వచ్చిన 'గుడుంబా శంకర్' 'బాలు', 'బంగారం', 'అన్నవరం' చిత్రాలు ఆశించిన విజయాలు అందించలేదు. ఏడేళ్ళ పాటు హిట్టు లేకపోయినా, బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ పలకరించినా పవన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని 'జల్సా' సినిమా ప్రూవ్ చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డ్స్ ని చెరిపేసి పవన్ కల్యాణ్ స్టామినా ఏంటో చూపించింది కానీ, ఆయన అదే సక్సెస్ ట్రాక్ ను కొనసాగించలేకపోయారు.


Also Read: డిజాస్టర్ డైరెక్టర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా - ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ!


భారీ అంచనాలతో వచ్చిన 'కొమరం పులి' చిత్రం డిజాస్టర్ గా నిలిచిపోయింది. 'తీన్ మార్', 'పంజా' సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. అయితే 2012లో విడుదలైన 'గబ్బర్ సింగ్' మూవీ పవన్ కల్యాణ్ రేంజ్ ఏంటో మరోసారి చూపించింది. బ్లాక్‌ బస్టర్‌ హిట్ సాధించిన ఈ చిత్రం, అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇది కళ్యాణ్ కు బెస్ట్ యాక్టర్ గా తొలి ఫిలింఫేర్ అవార్డ్ తెచ్చిపెట్టింది. ఇదే క్రమంలో వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత 'గోపాల గోపాల' మూవీతో హిట్టు కొట్టిన పవర్ స్టార్.. 'సర్దార్ గబ్బర్ సింగ్' 'కాటమ రాయుడు' వంటి ఫ్లాప్స్ అందుకున్నారు. అలానే తన కెరీర్ లో మైలురాయి సిల్వర్ జూబ్లీ మూవీ 'అజ్ఞాతవాసి' డిజాస్టర్ అయ్యింది.


'అజ్ఞాతవాసి' తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కల్యాణ్.. రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. 'జనసేన' అనే పొలిటికల్ పార్టీ స్థాపించి 2019 ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఎలక్షన్స్ లో ఓటమి పాలైన తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని 2021లో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు పవన్. వచ్చీ రాగానే వరుస సినిమాలకు సైన్ చేస్తూ, కెరీర్ ఎప్పుడూ లేనంత స్పీడ్ గా షూటింగ్స్ చేస్తున్నారు. 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' 'బ్రో' చిత్రాలతో అభిమానులను అలరించారు. 


పవన్ కల్యాణ్ ప్రస్తుతం OG సినిమాతో పాటుగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హర వీరమల్లు' చిత్రాలలో నటిస్తున్నారు. అలానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. తన సినిమాలతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో కొలువై ఉన్న జన సేనాని రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన విజయాలు సాధించాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ 'ABP దేశం' ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. 


Also Read: పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ - న్యూ లుక్ లో సర్ప్రైజ్ చేసిన వీరమల్లు!




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial