Paruchuri Gopala Krishna About Maharaja Movie: తమిళ హీరో విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ చిత్రంగా తెరకెక్కింది ‘మహారాజా’. ఈ సినిమాకు మొత్తంగా పాజిటివ్ టాక్ రావడమే విశేషం. ‘మహారాజా’ చూసిన ప్రేక్షకులు ఎవరూ దీనికి నెగిటివ్ రివ్యూలు ఇవ్వలేకపోయారు. తాజాగా సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ సైతం ఈ సినిమాను చూసి, దీనిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పైగా ఈ మూవీని తాను డైరెక్ట్ చేసిన ‘సర్పయాగం’తో పోలుస్తూ రివ్యూ ఇచ్చారు. ‘మహారాజా’ కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరిని అభినందించారు.
భారతీరాజాకు నమస్కారం..
‘‘మహారాజా మూవీ చాలా హార్ట్ టచింగ్‌గా ఉంది. సర్పయాగం స్క్రీన్ ప్లే వేరు కానీ అక్కడ కూడా కన్నకూతురిని రేప్ చేశారనే బాధతో శోభన్ బాబు వారందరినీ చంపుతూ ఉంటాడు. మహారాజా స్టోరీ లైన్ కూడా అదే. సస్పెన్స్, సెంటిమెంట్ ఒక ఒరలో ఉండలేవు అన్నది స్క్రీన్ ప్లే సిద్ధాంతం. కానీ ఇందులో సస్పెన్స్‌ను ముక్కలుగా విడదీసి వర్కవుట్ చేశారు’’ అని ముందుగా ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పరుచూరి. ఇక ‘మహారాజా’లో భారతీరాజా కూడా చిన్న పాత్రలో కనిపించారు. ఆయన తెరపై కనపించగానే నమస్కారం పెట్టుకున్నానని, ఒకప్పుడు ఇంటికి వచ్చి తాను చెప్పిన కథ విని కలిసి సినిమా చేద్దామని మాటిచ్చి వెళ్లారని గుర్తుచేసుకున్నారు పరుచూరి. కానీ వారి కాంబినేషన్‌లో సినిమా వర్కవుట్ అవ్వలేదని బయటపెట్టారు.
చట్టం పరిధిని దాటింది..
‘‘మహారాజాలో తన కూతురిని రేప్ చేశారని కాకుండా డస్ట్ బిన్ పోయిందని ఫిర్యాదు చేయడానికి హీరో పోలీస్ స్టేషన్‌కు వస్తాడు. 400 సినిమాలు రాశాం కాబట్టి దాని వెనుక ఏదో కథ ఉందని ఊహిస్తూనే ఉన్నాం. కానీ ప్రేక్షకులు ఊహించలేకపోవచ్చు. ఇలాంటి కథను చెప్పడానికి నిర్మాతకు, దర్శకుడికి ధైర్యం ఉండాలి. ఇందులో పోలీస్ ఆఫీసర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి వెధవలు ఎన్నో అసత్యాలు చెప్పి, రకరకాల ఆధారాలు చూపించి తప్పించుకొని బయటకు వచ్చే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అతిక్రూరంగా హత్యలు, రేప్ చేసినవారు శిక్ష అనుభవించకుండా బయట తిరుగుతున్నారు. వాళ్ల తరపున లాయర్లే వారికి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వారు నేరస్తులను నమ్ముతారు. చట్టం పరిధిని దాటి ప్రవర్తించిన కథానాయకుడి కథే మహారాజా’’ అని వివరించారు.
మంచి మెసేజ్..
‘‘అన్యాయం జరిగింది విలన్ బిడ్డకు అని క్లైమాక్స్‌లో చూపించగానే దిమ్మతిరిగిపోతుంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా అంత కలెక్షన్స్ సాధించిందంటే నేరం చేసినవాడు శిక్షకు గురికావాల్సిందే అని చాలామంది నమ్ముతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ అలా కనిపించి వెళ్లిపోవడం విశేషం. హీరోతో డ్యూయెట్, రొమాన్స్ ఏమీ లేవు. సర్పయాగం చూసి ఇన్‌స్పైర్ అయ్యారో, అసలు ఆ సినిమా చూశారో లేదో తెలియదు కానీ.. అన్ని భాషల్లోకి ఆ సినిమా వెళ్లింది. విజయ్ సేతుపతి కోసం ‘మహారాజా’ చూడాలి. మనం లీనమయ్యే పర్ఫార్మెన్స్‌లు ఎక్కువగా లేవు’’ అని తెలిపారు పరుచూరి. రేప్‌కు గురయితే చనిపోవడం పరిష్కారం కాదు అనే మెసేజ్ కూడా ‘మహారాజా’ మూవీలో ఉందన్నారు.
Also Read: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్- ఉపాధ్యక్షుడు ఎవరంటే?