Telugu Film Chamber Election Results 2024: తెలుగు ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడిగా భరత్‌ భూషణ్‌ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా అశోక్‌ కుమార్‌ విజయం సాధించారు. తాజాగా జరిగిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఎన్నికల్లో మొత్తం 48 మంది సభ్యులకు గాను 46 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలువురు నిర్మాతలు, స్టూడియోల యజమానులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఓటింగ్ లో పాల్గొన్నారు. అధ్యక్ష పదవి కోసం భరత్ భూషన్, ఠాగూర్ మధు పోటీ పడ్డారు.


ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా భరత్‌ భూషణ్‌.. ఉపాధ్యక్షుడిగా అశోక్ కుమార్..  


అనంతరం జరిగిన ఓట్ల లెక్కింపులో భరత్‌ భూషణ్‌కు 29 ఓట్లు వచ్చాయి. ఠాగూర్‌ మధుకు 17 ఓట్లు సాధించారు. ఎన్నికల అధికారులు భరత్ భూషణ్ ను ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా ప్రకటించారు. అటు ఉపాధ్యక్షుడి పీఠం కోసం అశోక్ కుమార్, వైవీఎస్ చౌదరి బరిలో నిలిచారు. అశోక్‌ కుమార్‌కు 28 ఓట్లు, వైవీఎస్‌ చౌదరికి 18 ఓట్లు పడ్డాయి. ఎన్నికల అధికారులు నూతన ఉపాధ్యక్షుడిగా అశోక్ కుమార్ ను ప్రకటించారు.


గతేడాది నిర్మాతల తరఫు నుంచి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఆయన పదవీకాలం ముగియడంతో తాజాగా ఎలక్షన్స్‌ నిర్వహించారు. ఈసారి డిస్ట్రిబ్యూటర్‌ తరఫు నుంచి ఠాగూర్‌ మధు (నెల్లూరు), భరత్‌ భూషణ్‌ (విశాఖపట్టణం) బరిలో నిలిచారు.  


సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తా- భరత్ భూషణ్


తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు భరత్ భూషన్ తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత మాట్లాడిన ఆయన, తన గెలుపునకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. “ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో నా విజయానికి సహకరించిన ఈసీ మెంబర్స్ కి, మిత్రులకు పేరు పేరునా కృతజ్ఞతలు. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను. అందరినీ కలుపుకుని ముందుకుపోతాను” అని వెల్లడించారు.


అందరినీ కలుపుకుని పోవాలి- సి కల్యాణ్


అటు తాజాగా విజయం సాధించిన ప్రెసిడెంట్ భరత్ భూషణ్, వైస్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ మాటకు కట్టుబడి ఉండే మనుషులని ఫిల్మ్ ఛాంబర్ సభ్యుడు సి కల్యాణ్ వెల్లడించారు. ఛాంబర్ సభ్యులందరి సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. సినీ ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయని, సమిష్టిగా వాటిని పరిష్కరించుకోవాలన్నారు. గెలిచిన వారికి సభ్యులందరి మద్దతు ఉంటుందని చెప్పారు. 


తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అంతా ఒక కుటుంబం లాంటిదని జనరల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ తెలిపారు. ఇండస్ట్రీలోని సమస్యలను ఎలా ఎదుర్కోవాలో అందరం కలసి చర్చిస్తామన్నారు.  భారత దేశంలోని ఇతర సినీ ఇండస్ట్రీని కలుపుకుని ముందుకుపోతామని చెప్పారు. ఛాబర్ పెద్దలు తీసుకునే నిర్ణయాలు ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేసేలా ఉంటాయని వెల్లడించారు.


Read Also: ఆకట్టుకుంటున్న విశ్వక్‌ సేన్‌ మెకానిక్‌ రాకీ గ్లింప్స్‌  - ఎల్‌కు సరికొత్త అర్థం చెప్పిన హీరోయిన్‌ శ్రద్ధా శ్రీనాథ్



Also Read: ప్రభాస్‌ 'రాజా సాబ్'‌ నుంచి సాలిడ్‌ అప్‌డేట్‌ - 'ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్‌'తో స్వీట్‌ ట్రీట్‌ రెడీ చేసిన మారుతి