Bandi Sanjay News: ‘‘రంజాన్ పండుగకు రూ.33 కోట్లు కేటాయిస్తరు. తబ్లిగీ జామాతే సంస్థకు రూ.2.4 కోట్లు ఇస్తరు... బోనాల పండుగ సందర్భంగా పాతబస్తీలోని దేవాలయాలకు రూ.5 లక్షలిస్తరా? హిందువులేమైనా బిచ్చగాళ్లనుకుంటున్నరా?...మీ దగ్గర బిచ్చమెత్తుకోవాల్నా?’’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి రాగానే గల్లీగల్లీలో అధికారికంగా బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ప్రకటించారు. పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామని ఉద్ఘాటించారు.
బోనాల పండుగ సందర్భంగా పాతబస్తీలోని వివిధ ఆలయాల సందర్శనలో బిజీబిజీగా ఉన్న బండి సంజయ్ తొలుత భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. పార్టీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ‘గౌలిపురా’లో ప్రధానమంత్రి ‘మన్ కీ బాత్’ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించారు. అంతకుముందు భాగ్యలక్ష్మీ ఆలయ సమీపంలో మీడియాతో మాట్లాడారు. ఏమన్నారంటే....
తెలంగాణ అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములకు... తెలంగాణ ఆడబిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు...ఇయాళ భాగ్యనగర్ ఆషాడ మాసం సందర్భంగా గల్లీగల్లీలో ప్రారంభమైన బోనాల జాతర రాష్ట్రవ్యాప్తంగా భక్తియుత ధార్మిక వాతావరణంలో వైభవంగా నిర్వహించుకుంటున్నాం. అన్ని కుటుంబాలు కలిసి సామూహికంగా ఆ తల్లికి బోనం సమర్పించుకుంటున్నాం. బోనం అంటే అమ్మవారికి ఇష్టంగా సమర్పించే నైవేద్యం. నైవేద్యం సమర్పిస్తే కష్టాలు తీరుతాయని నమ్మకం.
1908లో మూసీ నది వరదలతో హైదరాబాద్ మొత్తం అతలాకుతలమైతే... ఇట్లనే అమ్మవారికి మొక్కుకుంటే తగ్గిపోయింది. అప్పటి నుండి లాల్ దర్వాజా అమ్మవారికి బోనాల ఉత్సవాలను జరపడం ఆనవాయితిగా మారింది. భాగ్యనగరాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఎల్లవేళలా రక్షిస్తున్న మన భాగ్యలక్ష్మీసహా అమ్మవార్లందరినీ దర్శించుకునేందుకు ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది.
1869లో హైదరాబాద్‌లో ప్లేగ్ వ్యాధితో జనం పిట్టల్లా రాలిపోతుంటే.. ఈ వ్యాధి తగ్గితే అమ్మవారికి గుడి కట్టించి బోనాలు జరుపుతామని అప్పటి జవాన్లు, ప్రజలు మొక్కుకున్నారు. అమ్మవారి దయతో ఆ వ్యాధి తగ్గిపోవడంతో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి గుడి కట్టించి ఘనంగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటున్నం.ఈ పండుగకు ఓ సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఈ వానా కాలంలో అనేక రోగాలు పుట్టుకొస్తయ్. బోనం చుట్టూ పసుపు పూస్తం. వేపాకులు కడ్తం. దీనివల్ల బ్యాక్టీరియా, వైరస్ లు నాశనమై మన ఆరోగ్యం పైలంగా ఉంటదని నమ్ముతం.
నేను ఇయాళ ఇటొస్తుంటే ఓ పెద్దాయన నాతో ఏమన్నడంటే....నాకు పాతబస్తీని చూస్తే గుబులు పట్టుకుంది. యాకత్ పురా కోమటివాడ, చందులాల్ బారాదరి, చావునిసహా పాతబస్తీలో చాలా ప్రాంతాల్లో ఇప్పుడు బోనాలు జరుపుకునేందుకు పరిస్థితి లేదని బాధపడ్డడు. ఇతర ప్రాంతాల్లో బోనాల పండుగకు హాజరయ్యే దుస్ధితి ఏర్పడిందని వాపోయాడు.
రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. పాతబస్తీలోనే కదా... గల్లీగల్లీలో, బస్తీబస్తీలో అధికారికంగా ప్రతి ఏటా బోనాల పండుగ జరుపుకునే అవకాశం రావాలంటే అన్ని వర్గాలను సమానంగా చూసే బీజేపీ ప్రభుత్వం రావాలి. అది కచ్చితంగా వచ్చి తీరుతుంది.
దురద్రుష్టమేమిటంటే... ప్రభుత్వాలు మారినా వివక్ష, సంతూష్టీకరణ విధానాలు మాత్రం మారడం లేదు.. పాతబస్తీలో బోనాల పండుగ నిర్వహణ కోసం 24 దేవాలయాలతో కమిటీ ఉంటే రూ.5 లక్షలు మాత్రమే ఇవ్వడం దారుణం. బిచ్చమెత్తుకునే దుస్థితి ఏర్పడింది. బోనాల పండుగకు వచ్చి పేపర్లకు ఫోజులిచ్చి గొప్పలు చెప్పుకోవడం కాదు... బోనాల పండుగకు ఎన్ని నిధులు కేటాయించినమని ఆత్మవిమర్శ చేసుకోవాలి.
రంజాన్ పండుగకు రూ.33 కోట్లు ఇస్తున్నట్లు బడ్జెట్ లో ప్రతిపాదించారు.. మేమైనా వద్దన్నమా? ఇంకా రూ.10 కోట్లు ఇచ్చుకోండి. కానీ హిందూ పండుగలకు ఎందుకివ్వరు? బోనాలు, గణేష్ ఉత్సవాలతోపాటు నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం కదా... ఎందుకు నిధులివ్వరు? భాగ్యలక్ష్మీ అమ్మవారి ఉత్సవాలకు ఎందుకు నిధులివ్వరు? బీజేపీ అధికారంలోకి వస్తే భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మార్చి తీరుతాం...
తబ్లిగీ జమాతే వంటి నిషేధిత సంస్థలకు కాంగ్రెస్ ప్రభుత్వం 2 కోట్ల 4 లక్షలిచ్చిందంటే ఏమనాలి? ఇదేనా సెక్యూలరిజమంటే... ఇదేదో దేశానికి సేవ చేసినట్లు బడ్జెట్ లో ప్రస్తావించిర్రు...సిగ్గుండాలే.. హిందువులంత పనికిరాకుండా పోయారా? ఇంత స్థాయికి దిగజారాలా? ఇట్లనే వ్యవహరించిన గత పాలకుల పరిస్థితి ఏమైందో అర్ధం చేసుకోవాలి.
నేను వాస్తవాలు మాట్లాడితే మతతత్వవాది అంటారా? అయినా సరే.. బరాబర్ మాట్లాడతా. నేనేమీ మతానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. సనాతన ధర్మాన్ని కించపరిస్తే మాట్లాడి తీరుతా. హిందువులను బిచ్చగాళ్లగా చూడొద్దు. ఇకనైనా అన్ని వర్గాలను సమానంగా చూడాలని కోరుతున్నా...
గతంలో మజ్లిస్ నేత కేసీఆర్ ను అంకుల్ అనే వాడు... ఇప్పుడు రేవంత్ రెడ్డిని అన్న అని సంబోధిస్తున్నడు. అన్నదమ్ముల సంబంధం మొదలైందేమో... మజ్లిస్ నేతలు గోడమీద పిల్లులు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల పంచన చేరడం వాళ్లకు అలవాటే. మొన్నటిదాకా కాంగ్రెస్ ను తిట్టి బీఆర్ఎస్ గడీలకు పోయిర్రు. ఇప్పుడు బీఆర్ఎస్ ను తిట్టి కాంగ్రెస్ పంచన చేరతరు. ఎందుకంటే వాళ్లు చేసే వ్యాపారాలు బాగుండాలే. ఓల్డ్ సిటీలో ట్యాక్స్ లు, బిల్లులు కట్టొద్దనే భావన వాళ్లది...అట్లాంటోళ్లకు మద్దతిస్తరా? సిగ్గుచేటు..
కొడంగల్ వాళ్ల అయ్య జాగీరా? పంచుకోవడానికి... కొడంగల్ లో పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేస్తాం.. ఒక్కో కాషాయ కార్యకర్త, ఒక్కో యువకుడు ఇంటికి ఇంఛార్జీగా ఉంటూ ఆ రెండు పార్టీల అడ్రస్ గల్లంతు చేస్తం.. 15 నిమిషాలు సమయమిస్తే హిందువులను నరికి చంపుతానన్న వ్యక్తిని డిప్యూటీ సీఎం పదవిస్తానని చెప్పడం సిగ్గు చేటు...’’ అని బండి సంజయ్ అన్నారు.