చరిత్రకు ఒక్క అడుగు దూరంలో 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' చిత్రంలోని 'నాటు నాటు...' నిలిచింది. భారతీయ సినిమా నుంచి, అదీ తెలుగు సినిమా నుంచి ఆస్కార్ నామినేషన్ అందుకున్న తొలి పాటగా 'నాటు నాటు' చరిత్రకు ఎక్కింది. ఈ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవకు అరుదైన గౌరవం దక్కింది. 


ఆస్కార్ స్టేజి మీద లైవ్ పెర్ఫార్మన్స్!
మన భారతీయ కాలమానం ప్రకారం... మార్చి 13, సోమవారం ఉదయం తెల్లవారు జామున ఆస్కార్ అవార్డుల వేడుక జరుగుతుంది. ఆ వేదికపై మన 'నాటు నాటు...' సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఇద్దరూ లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. కెరీర్ స్టార్ట్ చేసిన అతి తక్కువ సమయంలో ఆస్కార్ స్టేజి మీద పాడే అవకాశం ఆ ఇద్దరికీ రావడం గొప్ప విషయం. 






రిహానా లైవ్ పెర్ఫార్మన్స్ కూడా!
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఐదు సాంగ్స్ నామినేట్ అయ్యాయి. అందులో 'బ్లాక్ పాంథర్ : వాఖండా ఫరెవర్'లో రిహానా పాడిన 'లిఫ్ట్ మి అప్' సాంగ్ కూడా ఉంది. ఆ పాటకు ఆమె కూడా లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. నామినేట్ అయిన మిగతా పాటలకు కూడా ఆయా సింగర్స్ లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.  


Also Read : అమెరికాలో కాదు, అపోలోలో ఉపాసన డెలివరీ - ఇండియన్ డాక్టర్లకు తోడు అమెరికన్ గైనకాలజిస్ట్


'నాటు నాటు...'కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ వచ్చింది. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్... ఇద్దరికీ ఆ అవార్డును సంయుక్తంగా ఇచ్చారు. గోల్డెన్ గ్లోబ్ వేదికపై కీరవాణి సగర్వంగా ఆ పురస్కారాన్ని సగర్వంగా అందుకున్నారు. అంతకు ముందు ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ, క్రిటిక్స్ ఛాయస్ మూవీ అవార్డ్స్ నుంచి ఉత్తమ పాటగా 'నాటు నాటు...'కు అవార్డు వచ్చింది. ఆ అవార్డు వేడుకలకు చంద్రబోస్ హాజరు కాలేదు.


Also Read : పవన్ ఇక్కడ, క్రిష్ అక్కడ - 'హరి హర వీరమల్లు' @ 100 డేస్


కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అందుకున్న సమయంలో చంద్రబోస్ ఇండియాలో ఉన్నారు. ఇక్కడ మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నారు. అప్పుడు కొంత మంది రాజమౌళిపై విమర్శలు చేశారు. పాట రాసిన వ్యక్తికి సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని! అన్నయ్య కీరవాణిని ప్రమోట్ చేస్తున్నారని! ఇప్పుడు ఆస్కార్స్ లంచ్ కార్యక్రమానికి చంద్రబోస్ వెళ్ళడం ద్వారా ఆ విమర్శలు ఆగాలి మరి!


లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి ఉత్తమ సంగీతానికి గాను ఎం.ఎం. కీరవాణి అవార్డు అందుకున్నారు. ఆయనకు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ కూడా అవార్డు ఇచ్చారు. అయితే, అందరి చూపు ఆస్కార్ నామినేషన్ మీద ఉంది. ఎందుకు అంటే... ప్రపంచ సినిమాలో అన్ని అవార్డులకు పెద్దన్నగా అకాడమీ పురస్కారాలను చూస్తారు కాబట్టి! ఆస్కార్ షార్ట్ లిస్టులో 'నాటు నాటు...' చోటు సంపాదించుకున్న తరుణం నుంచి నామినేషన్ డిస్కషన్ నడుస్తోంది.


మార్చి 13 కోసం ఇండియా వెయిటింగ్!
మార్చి 13, 2023న ఆస్కార్ విజేతల వివరాలు వెల్లడిస్తారు. ఆ రోజు కోసం యావత్ భారతదేశం వెయిట్ చేస్తోంది. 'నాటు నాటు...'కు అవార్డు రావడం ఖాయం అని అభిమానులు ఆశిస్తున్నారు. 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' విభాగంలో పోటీ పడటానికి మొత్తం 81 పాటలు అర్హత సాధించగా... అందులో 15 పాటలను మాత్రమే షార్ట్ లిస్టుకు ఎంపిక చేశారు. ఆ పదిహేనులో 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు...' ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత నామినేషన్ కూడా అందుకుంది.