ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ (Chandrabose lyricist)కి చిన్న పెద్ద తేడాలు లేవు. ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో పాటలు రాస్తున్నారు. మరోవైపు తన దగ్గరకు వచ్చిన చిన్న సినిమాల్లో పాటలు కూడా రాస్తున్నారు. లేటెస్టుగా 'కలియుగంలో పట్టణంలో' అని ఓ చిన్న సినిమాలో ఆయన టైటిల్ సాంగ్ రాశారు. ఆ పాట ఎలా ఉంది? చంద్రబోస్ సాహిత్యం ఎలా ఉంది? అనేది చూడండి.


చంద్రబోస్ పాట... ఆలోచింపజేసేలా!
విశ్వ కార్తికేయ హీరోగా నటించిన సినిమా 'కలియుగం పట్టణంలో' (Kaliyugamlo Pattanamlo Movie). నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకాలపై కందుల గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వర రెడ్డి, కాటం రమేష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రమాకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. త్వరలో థియేటర్లలో సినిమాను విడుదల కానుంది. ఈ సందర్భంగా టైటిల్ సాంగ్ విడుదల చేశారు. 


గాలి కలుషితం నీరు కలుషితం...
నీరు పైరు పాడి పంట కలుషితం
మాట కలుషితం మనసు కలుషితం
మనసు మనసును కలిపే ప్రేమ కలుషితం


నీతి లేదు నియమం లేదు నిజమూ లేదు అసలు లేదు
పైపై పూతలు పైపై మెరుపులు అన్నీ నకిలీలే
ఎంచి ఎంచి ఎంచి చూస్తే ఒక్కటి కూడా మంచే లేదు
ఉంది ఉంది ఉందనుకోవడం అది మన పిచ్చేలే
కలి కలియుగం కలి కలియుగం కలియుగమంతా కలుషితం
అంటూ సమాజం గురించి ఆలోచింపజేసేలా చంద్రబోస్ సాంగ్ రాశారు. అజయ్ అరసాడ సంగీతంలో విజయ్ ప్రకాష్ ఈ గీతాన్ని ఆలపించారు.


Also Readతంత్ర రివ్యూ: ప్రతి పౌర్ణమికి రక్తం తాగే పిశాచి వస్తే - అనన్య సినిమా హిట్టా? ఫట్టా?



ప్రేమతో పాటు అనుబంధాలు, పంచభూతాలు, రాజకీయాలు, పాఠ్య పుస్తకాలు... ప్రతి ఒక్క అంశాన్ని పాటలో స్పృశించారు చంద్రబోస్. ''పూర్ణ సత్యమే లేని పాఠ్య పుస్తకాలు. పాతివ్రత్యమే లేని రాజకీయాలు'' అంటూ క్లుప్తంగా సత్యాన్ని చెప్పారు. రాజకీయాల్లో విలువల్ని ఒక్క మాటలో ఆవిష్కరించారు. భుక్తి కోసమే భక్తి వ్యాపారాలు లైనులోనూ ఎంతో అర్థం ఉంది. తాజాగా విడుదల చేసిన ఈ పాట ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. దీనికి లభిస్తున్న స్పందన తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందోని హీరో విశ్వ కార్తికేయ చెప్పారు.


Also Read: రజాకార్ రివ్యూ: మారణహోమం సృష్టించిన మతోన్మాదం - తెలంగాణ చరిత్రను ఎలా తీశారంటే?



విశ్వ కార్తికేయ జోడీగా ఆయుషి పటేల్
విశ్వ కార్తికేయ సరసన యంగ్ హీరోయిన్ ఆయుషి పటేల్ నటించిన చిత్రమిది. మరో కీలక పాత్రలో 'మా అబ్బాయి', 'రంగుల రాట్నం', 'సిల్లీ ఫెలోస్' 'తెల్లవారితే గురువారం' సినిమాల ఫేమ్ చిత్రా శుక్లా నటించారు. ఇంకా ఈ సినిమాలో దేవి ప్రసాద్ మరో ప్రధాన పాయ్త్రా చేశారు. ఈ చిత్రానికి కూర్పు: గ్యారీ బీహెచ్, పాటలు: చంద్రబోస్ - భాస్కర భట్ల రవికుమార్, ఛాయాగ్రహణం: చరణ్ మాధవనేని, సంగీత దర్శకుడు : అజయ్ అరసాడ, నిర్మాణ సంస్థలు: నాని మూవీ వర్క్స్ - రామా క్రియేషన్స్, నిర్మాతలు: డాక్టర్ కె. చంద్ర ఓబుల్ రెడ్డి - జి మహేశ్వర రెడ్డి - కాటం రమేష్‌, దర్శకుడు : రమాకాంత్ రెడ్డి.