VI Anand Next Movie: సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర సమర్పణలో రూపొందిన ఈ సూపర్‌ నేచురల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ఫిబ్రవరి 16న థియేటర్లోకి వచ్చింది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుని, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ ఆనందంలో టాలెంటెడ్ డైరెక్టర్ తో మరోసారి చేతులు కలపడానికి నిర్మాతలు రెడీ అయ్యారు.


'ఊరు పేరు భైరవకోన' విజయం తర్వాత, దర్శకుడు విఐ ఆనంద్‌తో మరో సినిమాటిక్ అడ్వెంచర్ ను రూపొందించనున్నట్లు నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. ఈరోజు దర్శకుడి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అధికారిక ప్రకటన ఇచ్చారు. బ్లాక్‌ బస్టర్ ప్రయాణం కొనసాగుతుందని, ఇది ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కబోయే 27వ చిత్రమని మేకర్స్ పేర్కొన్నారు. సుంకర రామబ్రహ్మం, కిషోర్ గరికపాటి, రాజేశ్ దండా సంయుక్తంగా నిర్మించనున్నారు. అబ్బూరి రవి ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు వెల్లడించనున్నారు.


"బ్రిలియంట్ డైరెక్టర్ విఐ ఆనంద్‌కి బ్లాక్‌ బస్టర్ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో కలిసి మరో సినిమాటిక్ సాహసయాత్రను ప్రారంభించేందుకు ఎంతో థ్రిల్లింగ్ గా వేచి చూస్తున్నాం. త్వరలోనే మ్యాజిక్ ను ప్రారంభిద్దాం" అని చిత్ర బృందం పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేస్తూ.. "నేను వర్క్ చేసిన మోస్ట్ క్రియేటివ్ మైండ్స్ లో వీఐ ఆనంద్ ఒకరు. ఈ ఏడాదిని ఆయన ఎంతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. భైరవకోన విజయం తర్వాత, మా తదుపరి చిత్రాన్ని ప్రకటించినందుకు సంతోషంగా ఉంది'' అని అన్నారు.






వీఐ ఆనంద్ కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో 'హృదయం ఎక్కడున్నది' అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఆనంద్.. తమిళ్ లో 'అప్పుచి గ్రామం' వంటి సైన్స్ ఫిక్షన్ మూవీతో హిట్టు కొట్టారు. ఆ తర్వాత 'టైగర్', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం' 'డిస్కో రాజా' వంటి ఫిక్షనల్ మూవీస్ తో ప్రత్యేకతను చాటుకున్నారు. నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత ఇప్పుడు 'ఊరు పేరు భైరవకోన' వంటి సూపర్ నేచురల్ అడ్వెంచర్ థ్రిల్లర్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు.


'ఊరు పేరు భైరవకోన' సినిమా మూడు రోజుల్లోనే 20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. యూఎస్ఏలో $ 500K మార్క్ దిశగా పయనిస్తోంది. ట్రెండ్ చూస్తుంటే రాబోయే వారాంతం వరకూ అదే జోరు కొనసాగించే అవకాశం వుంది. ఇది చాలా ఏళ్లుగా సరైన సక్సెస్ కోసం వేచి చూస్తున్న హీరో సందీప్ కిషన్ కు, డైరెక్టర్ వీఐ ఆనంద్ కు, నిర్మాత అనిల్ సుంకరకు ఉత్సాహాన్ని కలిగించే విషయమనే చెప్పాలి. ఈ ఆనందంలోనే ఇప్పుడు అదే బ్యానర్ లో మరో ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో పాటుగా హీరో నిఖిల్ కోసం ఆనంద్ ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు.


Also Read: ఆ హీరో వల్ల ఎక్కువ నష్టపోయింది నేనే, బచ్చాగాడిననే అలా చేశారు: విశ్వక్ సేన్