Vishwak Sen Controversy with Arjun: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమై, ఆగిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ కు కమిట్ మెంట్ లేదని, అన్ ప్రొఫెషనల్ యాక్టర్ అని ఆరోపించారు. దీనిపై విశ్వక్ అప్పుడే వివరణ ఇచ్చారు. తన వల్ల ఇంతవరకూ ఏ నిర్మాత కూడా బాధపడలేదని, ఒక్క లైట్ బాయ్ తనని ప్రొఫెషనల్ యాక్టర్ కాదంటే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతానని అనడం చర్చనీయాంశంగా మారింది. అయితే అర్జున్ తో వివాదంపై విశ్వక్ తాజాగా మరోసారి స్పందించారు. ఆ ఇన్సిడెంట్ వల్ల తనకే చెడ్డ పేరు వచ్చిందని, తానే ఎక్కువ నష్టపోయానని అన్నారు. 


విశ్వక్ సేన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు జరిగింది ఒక లెగసీ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోకి జరిగేదా? అని ప్రశ్నించారు. తాను ఆ సినిమాని క్యాన్సిల్ చెయ్యలేదని, ఒక్క రోజు షూటింగ్ మాత్రమే ఆపమని అడిగానని చెప్పారు. ఈ బచ్చాగాడు ఎవడు, వీడికి బ్యాగ్రౌండ్ కూడా లేదు, వీడు నా షూటింగ్ ఒక రోజు ఆపడం ఏంటి? అని ఆయన బీపీ తెచ్చుకొని ప్రెస్‌ మీట్‌ పెట్టారు. కానీ ఆ వివాదాన్ని లాగడం ఇష్టం లేకనే ఒకసారి మాట్లాడి, మళ్ళీ దాని గురించి రియాక్ట్ అవ్వడం మానేసానని అన్నారు. దేవుడికి నేను ఆ సినిమా చెయ్యడం ఇష్టంలేదేమో, అందుకే ఒక రోజు షూటింగ్ ఆపమంటే  సినిమానే ఆపేసారని తెలిపారు. 


అప్పుడు జరిగిన దానిపై ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తీసుకున్న డబ్బులకు రెట్టింపు వెనక్కి ఇచ్చేశానని విశ్వక్ సేన్ చెప్పారు. నేను దొంగను కాదు.. అందుకే ఆ భారం ఏమీ లేకుండా దర్జాగా ఉన్నాను అన్నారు. ఆయనకు కోపం వచ్చి ప్రెస్ మీట్ మీట్ పెట్టినా.. చెడ్డ పేరు వచ్చింది నాకే. ఎక్కువ నష్టపోయింది నేనే. కానీ ఏం చెయ్యలేం. ఎందుకంటే నా మీద ఈజీగా నోరు పారేసుకోవచ్చు. అదే బ్యాగ్రౌండ్ ఉన్న హీరో అయితే వేరేగా ఉంటుంది. నాకు జరిగినవి వేరే హీరోలకు జరిగితే అలాంటి రియాక్షనే వస్తుందా? నేను చేసిన మిస్టేక్ ఆ ఫ్యామిలీ హీరోలు చేస్తే, నిజంగా ఇంతే ధైర్యంగా వాళ్ళని అనగలుగుతారా? అని విశ్వక్ ప్రశ్నించారు. 


ఇండస్ట్రీలో మంచి రిలేషన్ షిప్స్ మెయింటైన్ చేసుకోడానికి తన తండ్రి సూపర్ స్టార్ కాదు.. తాత పెద్ద ప్రొడ్యూసర్ కాదు అని విశ్వక్ అన్నారు. అవమానిస్తే రియాక్ట్ అవుతాడు, ఇంకొంచం అటెన్షన్ ఎక్కువ వస్తుందని అర్థమైపోయింది.. నేను ఈజీ టార్గెట్. నేను రియాక్ట్ అయినా వేరే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే నేను రియాక్ట్ అవడం మానేసాను. ఇదంతా నా ఎదుగుదలలో ఒక భాగం అని నేను రియలైజ్ అయ్యాను అని విశ్వక్ చెప్పుకొచ్చారు. 


కాగా, విశ్వక్ సేన్ తో చేసే సినిమాతో తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ను టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం చెయ్యాలని అర్జున్ సర్జా భావించారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు జరిపారు. అయితే దర్శక హీరోల మధ్య అభిప్రాయాలు భేదాలు రావడంతో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ పై సంచలన ఆరోపణలు చేసారు. షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉదయం స్టార్ట్ చెయ్యాలని అనుకుంటుండగా, షూటింగ్ క్యాన్సిల్ చేయమని మెసేజ్ పెట్టాడని.. అతని కారణంగా అప్పటికే రెండు సార్లు షెడ్యూల్స్ వాయిదా వేసుకున్నామని తెలిపారు. 


42 ఏళ్ళ కెరీర్ లో ఇప్పటివరకూ ఒక్కరి మీద కూడా ఇలా ఆరోపణలు చేయలేదని.. ఇప్పుడు కూడా తన బాధ చెప్పుకోడానికి మాత్రమే వచ్చానని, ఇకపై ఏ నిర్మాతా ఇబ్బంది పడకూడదనే ప్రెస్ మీట్ పెట్టానని అర్జున్ చెప్పుకొచ్చారు. విశ్వక్ తో ముందుకు వెళ్ళలేనని, వేరే హీరోతో ఆ సినిమాని పూర్తి చేస్తానని తెలిపారు. దీనిపై విశ్వక్ స్పందిస్తూ.. కళ్లు మూసుకుని కాపురం చెయ్యమంటే భయమేసిందని.. అందుకే ఆ ఒక్క రోజు షూట్ క్యాన్సిల్ చేసి కొన్ని విషయాలపై డిస్కస్ చేద్దామని మెసేజ్ పెట్టినట్లుగా తెలిపారు. అయితే ఆ తర్వాత వీరిద్దరూ మళ్ళీ ఈ వివాదంపై మాట్లాడలేదు. ఇన్నాళ్లకు విశ్వక్ స్పందించి మరోసారి ఆ వివాదాన్ని వార్తల్లోకి తీసుకొచ్చారు.


Also Read: 'రాయన్'గా ధనుష్, గుండుతో ఫస్ట్ లుక్ అదుర్స్!