యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR Jr) అభిమానులకు గుడ్ న్యూస్... వాళ్ళు కోరుకున్నది జరుగుతోంది. ఆస్కార్స్ ప్రోగ్రామ్‌కు తారక్ కూడా వెళుతున్నారు. అవును, అక్షరాల ఇది నిజమే! అమెరికాకు ఎప్పుడు వెళతారు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే... 


నందమూరి కుటుంబమే ముఖ్యమని... నందమూరి తారక రత్న మరణం కారణంగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా పూజ కార్యక్రమాలు వాయిదా వేయడమే కాదు... మిగతా పనులు అన్నిటినీ ఎన్టీఆర్ పక్కన పెట్టేశారు. దర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ అండ్ కో కలిసి 'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్' అవార్డులకు వెళ్ళారు. వాళ్ళు ఆహ్వానించినా ఎన్టీఆర్ వెళ్ళలేదు. తనకు అవార్డుల కంటే కుటుంబమే ముఖ్యమని ఆయన చేతల్లో చూపించారు.
 
మార్చి 6న అమెరికాకు తారక్!
'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందంలో కీలక సభ్యులు అమెరికా వెళ్ళడం, ఎన్టీఆర్ వాళ్ళతో లేకపోవడంతో కొంత మంది అభిమానులు ఫీలయ్యారు. ఎన్టీఆర్ వెళ్ళి ఉంటే బావుండేదని అనుకున్నారు. వాళ్ళు అందరికీ ఇది గుడ్ న్యూసే! మార్చి 6న అమెరికాకు ఎన్టీఆర్ వెళుతున్నారు. చిత్ర బృందంతో పాటు కలిసి ఆస్కార్ అవార్డ్స్ కార్యక్రమానికి అటెండ్ కానున్నారు.


ఆస్కార్స్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లైవ్ పెర్ఫార్మన్స్
అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ (Ram Charan), కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ (NT Rama Rao Jr)... ఈ ఇద్దరూ లేకుండా 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాను ఊహించుకోలేం!  రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు వాళ్ళిద్దరి నటన తోడు కావడంతో సినిమా రికార్డులు తిరగ రాసింది. సినిమాలో వాళ్ళిద్దరి యాక్టింగ్ ఒక హైలైట్ అయితే, 'నాటు నాటు...'లో చేసిన డ్యాన్స్ మరో హైలైట్! ఈ పాటకు ఆస్కార్ నామినేషన్ లభించింది. ఆస్కార్స్ లైవ్ షోలో సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ స్టేజి మీద లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. అంతకు మించి? అనేలా ఎన్టీఆర్, చరణ్ డ్యాన్స్ చేయనున్నారు.


లైవ్ పెర్ఫార్మన్స్ కన్ఫర్మ్ చేసిన రామ్ చరణ్ 
'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్' అవార్డుల కార్యక్రమంలో సందడి చేసిన రామ్ చరణ్, ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. లేటెస్టుగా ఇచ్చిన ఇంటర్వ్యూలో లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నట్లు రామ్ చరణ్ కన్ఫర్మ్ చేశారు. 


Also Read : సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మృతి - 'విరూపాక్ష' టీజర్ విడుదల వాయిదా


ఆస్కార్స్, లైవ్ పెర్ఫార్మన్స్ గురించి మీడియా ప్రతినిథి ప్రశ్నించగా... ''ప్రేక్షకులు మాపై ఎంతో ప్రేమ చూపించారు. సినిమాను ఎంతో ఆదరించారు. సాంగుకు పెర్ఫార్మన్స్ చేయడం ద్వారా ప్రేక్షకులకు మా ప్రేమను చూపించాలని అనుకుంటున్నాం. ప్రేక్షకులకు ఇది ట్రిబ్యూట్'' అని రామ్ చరణ్ పేర్కొన్నారు.


కొరటాల శివ సినిమా సెట్స్ మీదకు వెళ్ళేది ఎప్పుడంటే?  
ఆస్కార్స్ అవార్డుల వేడుక ముగిసిన రెండు మూడు రోజుల తర్వాత ఎన్టీఆర్ ఇండియా రిటర్న్ అవుతారని సమాచారం. ఆయన వచ్చిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. నిజం చెప్పాలి అంటే... ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో ఆ సినిమాను ప్రారంభించాలని అనుకున్నారు. అయితే, తారక రత్న మరణంతో ఆ ప్రోగ్రామ్ వాయిదా వేశారు. అయితే, సినిమా మాత్రం అనుకున్న సమయానికి సెట్స్ మీదకు వెళుతుందని టాక్.   


Also Read రజనీకాంత్ 'లాల్ సలాం'లో జీవిత రాజశేఖర్ - రోల్ ఏంటంటే?