జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఈ సినిమా విజయకేతనం ఎగురవేసింది. ఈ మూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అంతేకాదు ఇటీవల జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలో ఈ సినిమాకు ఆస్కార్ రావడంతో ‘ఆర్ఆర్ఆర్’ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. దీంతో మూవీ టీమ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆస్కార్ అవార్డు రాకతో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తాజాగా మూవీలో కొమరం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ కు అమెరికా ఫ్యాన్స్ వినూత్న రీతిలో థాంక్స్ చెప్పారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటించబోతున్న సినిమా ‘ఎన్టీఆర్30’. ఈ మూవీకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అంతే కాదు కొరటాల-ఎన్టీఆర్ కాంబోకు మంచి డిమాండ్ ఉంది. దీంతో ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ ఈ సినిమా గురించే అడుగుతున్నారు. అయితే ‘ఆచార్య’ సినిమా ఫలితం తర్వాత ఈ మూవీ పై కాస్త గందరగోళం నెలకొంది. సినిమా పట్టాలెక్కుతుందా లేదా అనే సందేహం మొదలైంది. అయితే, ఆ మూవీ టీమ్ గుడ్ న్యూస్ చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అందుకే ఎన్టీఆర్ ఎక్కడ కనిపించినా అభిమానులు ఈ సినిమా గురించి అడుగుతున్నారు. దీంతో ఎన్టీఆర్ కూడా ఈ మూవీను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్తామని ఇటీవలే రెండు మూడు సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయనకు వినూత్న పద్దతిలో థాంక్స్ చెప్పారు.
అమెరికాలోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కలసి ‘‘థ్యాంక్యూ ఎన్టీఆర్, #NTR30 కోసం వేచి ఉండలేకపోతున్నాం’’ అనే బ్యానర్ ను ఎయిర్ జెట్ ద్వారా గాల్లో ఎగురవేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు ‘ఆల్ ది బెస్ట్ అన్నా’ అంటూ విషెస్ తెలుపుతున్నారు. కాగా ‘ఎన్టీఆర్ 30’ సినిమాను ఈ నెల 23న అధికారికంగా ప్రారంభించనున్నట్టు ఇప్పటికే తెలిపారు మేకర్స్. అనిరుద్ రవి చందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 5, 2024 మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.
మరోవైపు ఈ సినిమాలో ఓ పాత్రలో జాన్వీ కపూర్ నటించబోతోంది. ఈ విషయాన్ని కూడా ఇప్పటికే ప్రకటించారు. ఇటీవలే జాన్వీ కూడా ‘ఎన్టీఆర్ 30’ కోసం ఎదురు చూస్తున్నానని, ఎప్పుడెప్పుడు షూటింగ్ కు వెళ్దామా అని రోజూ దర్శకుడు కొరటాల శివకు మెసేజ్ లు చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ తో నటించాలనేది తన కోరిక అని, అది ఇప్పటికి నెరవేరిందని చెప్పింది. అందుకే సినిమా స్టార్ట్ అయ్యేదాక వేచి ఉండలేకపోతున్నాను అని పేర్కొంది జాన్వీ. జాన్వీ వ్యాఖ్యలతో అభిమానుల్లో ఈ మూవీ పై మరింత ఉత్కంఠ పెరిగిందనే చెప్పాలి.
Read Also: మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై కీరవాణి కీలక వ్యాఖ్యలు - ఫ్యాన్స్‌కు పండుగే!