ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1998 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటిస్తూ వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా పురస్కారాలు ప్రధానం చేస్తూ వచ్చింది. అయితే అప్పట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమాలు జరగడంతో ప్రభుత్వం నంది అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో 2014, 2015, 2016 సంవత్సరాలకి గానూ నంది అవార్డులను ప్రకటించింది. ఆ సమయంలో ప్రభుత్వం పక్షపాతంతో అవార్డులను ప్రకటించిందని తీవ్ర విమర్శలొచ్చాయి. దీంతో నంది అవార్డుల కార్యక్రమాన్ని నిలిపివేసారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చింది. త్వరలోనే నంది అవార్డులను తిరిగి ప్రారంభిస్తామని చెబుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టి.వి, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి దీనిపై స్పష్టత ఇచ్చారు.
విజయవాడ బస్టాండ్ ఆవరణలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టి.వి, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 22వ నంది నాటకోత్సవం 2022 ప్రాథమిక స్థాయిలో ఎంపికైన నాటకాల వివరాలను పోసాని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటకాల ఎంపికలో జ్యూరీ సభ్యులదే అంతిమ నిర్ణయమని, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నాటక ప్రదర్శనలు తిలకించిన జ్యూరీ సభ్యులు ప్రాథమిక ఎంపికలకు అర్హమైన ప్రదర్శనలను ఎంపిక చేస్తామన్నారు. వారిపై ఎటువంటి ఒత్తిడి లేదని, కనీసం ఒక్కరి పేరు కూడా నేను ప్రతిపాదించలేదని తెలిపారు. జ్యూరీ సభ్యులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, అన్ని విధాలుగా అర్హత ఉన్న నాటకాలను ఎంపిక చేసి సీల్డ్ కవర్‌లో మీ అందరి ముందు జ్యూరీ సభ్యులే చదివి వినిపించారన్నారు. నంది నాటకోత్సవ అవార్డుల ఎంపికలో సిఫార్స్ లకు తావేలేదని, ఆశ్రిత పక్షపాతానికి తావివ్వకుండ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎంపిక జరిగిందన్నారు.
అప్పట్లో కాంపౌడ్లకు నందులు పరిగెట్టేవి, ఇప్పుడు అలా జరగదు
ఈ కార్యక్రమం అనంతరం పోసాని మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నంది అవార్డులను అంతా పంచుకుంటారని మీకు అందరికీ తెలుసు. ఆ కాంపౌడ్‌కు రెండు నందులు వెళ్లాలి. మరో కాంపౌండ్‌కు మూడు నందులు వెళ్లాలి అంటూ అప్పట్లో నందులు పరిగెట్టేవి. నేను ఉన్నంత కాలం నందులు పరిగెట్టవు. ఎవరు అర్హులో వారికే నందులు వస్తాయి. తప్పు చేస్తే మీ కాళ్లకు దన్నం పెట్టి రిజైన్ చేసి వెళ్లిపోతా. ఎప్పుడైనా మీకు (జడ్టిలు) ఫోన్ చేసి మాట్లాడి ప్రలోభ పెడితే.. నా చెప్పుతో నన్నే కొట్టండని చెప్పా’’ అని పోశాని తెలిపారు.
అందుకే నంది అవార్డులు రద్దు చేశారు
‘‘నా సినీ కెరీర్‌లో నేను 100 సినిమాలు రాశాను. వాటిలో చాలామంచి సినిమాలు ఉన్నాయి. వాటిలో కనీసం 5, 6 సినిమాలకైనా నాకు నందులు రావాలి. ఆ బాధతో ఓసారి నంది అవార్డులు చాలా అన్యాయంగా ఇచ్చారని కామెంట్ చేశా. అప్పటి నుంచి నన్ను అనధికారికంగా బ్లాక్ లిస్ట్‌లో పెట్టి బ్యాన్ చేశారు. ‘టెంపర్’ మూవీలో నాకు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ప్రకటించారు. అక్కడ చెక్ చేస్తే ఏదో హంబక్ జరిగిందని తెలిసింది. దీంతో నేను రిజెక్ట్ చేశా. ఎందుకు రిజక్ట్ చేశాననేది అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కూడా తెలిసిపోయింది. నందులు పంచేసుకుంటున్నారనే కారణంతో అవార్డులను రద్దు క్యాన్సల్ చేశారు. ఇప్పుడు నేను అదే ప్లేస్‌కు వచ్చా. నువ్వు సినిమా వాడివే కదా.. ఆ బాధ్యతుల నీకు ఇస్తున్నా అని జగన్ చెప్పారు. సినీ, టీవీ రంగాలను నాకు అప్పగించండి, ప్రోపర్‌గా చేస్తానని చెప్పా’’ అని పోసాని వెల్లడించారు.
Also Read: రచ్చ గెలిచాం, ఇంట గెలవలేమా? నంది అవార్డులు అటకెక్కినట్లేనా?