నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'డెవిల్' (Devil Indian Movie). ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్... అనేది ఉప శీర్షిక. ఇందులో సంయుక్తా మీనన్ కథానాయిక. ఇంతకు ముందు 'బింబిసార'లో కళ్యాణ్ రామ్, సంయుక్త జంటగా నటించారు. వాళ్ళ కలయికలో రెండో చిత్రమిది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమాలో హీరో హీరోయిన్లపై తెరకెక్కించిన 'మాయ చేసే...' పాటను ఈ రోజు విడుదల చేశారు. 


సిద్ శ్రీరామ్ పాడిన 'మాయే చేసి'
'డెవిల్'కు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ 'రావణాసుర', దుల్కర్ సల్మాన్ 'కనులు కనులు దోచాయంటే'తో పాటు 'జార్జ్ రెడ్డి' తదితర చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. 'అర్జున్ రెడ్డి'కి నేపథ్య సంగీతం చేశారు. 


'డెవిల్' కోసం హర్షవర్థన్ రామేశ్వర్ అందించిన బాణీకి సత్య ఆర్వీ సాహిత్యం సమకూర్చారు. సిద్ శ్రీరామ్ ఆలపించారు. బృందా మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. 


'మాయే చేసి మెల్లగా...
మది దోచేసిందే సిన్నగా!
చూపే చూసి సన్నగా...
నను చంపేసిందే సూటిగా!
ఒక నవ్వే నవ్వి నేరుగా...
గుండెలనే పిండేసిందిగా!''అంటూ ఈ పాట సాగింది. ఇందులో కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది.  


మాంచి మెలోడీగా 'మాయే చేసి...' పాటను రూపొందించారు. ఈ పాట వింటున్న సమయంలో ప్రేక్షకులు అందమైన అనుభూతికి లోనయ్యేలా ఉంది. 'డెవిల్' కథా నేపథ్యానికి మన దేశానికి స్వాతంత్య్రం రాక ముందు కాలాన్ని ఎంచుకున్నారు. ఈ పాటలు, సన్నివేశాలు కూడా రెట్రో నేపథ్యంలో ఉంటాయి. కాస్ట్యూమ్స్ నుంచి లొకేషన్స్, బ్యాక్ గ్రౌండ్ వరకు ప్రతి విషయంలో మేకర్స్ పలు జాగ్రత్తలు తీసుకున్నారు.


Also Read - 'అతిథి' రివ్యూ : హీరో వేణు తొట్టెంపూడి నటించిన హారర్ థ్రిల్లర్ సిరీస్






నవంబర్ 24న 'డెవిల్' విడుదల!
ఆల్రెడీ 'డెవిల్' సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ 24న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దేవాన్ష్‌ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకు ఆయనే దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.


Also Read : అమ్మాయి సముద్రం ఆ అబ్బాయే, ప్రేమ నుంచి జైలు వరకు - తెలుగులో కన్నడ బ్లాక్‌బస్టర్ ట్రైలర్  



శ్రీకాంత్ విస్సా అందించిన కథతో...
'డెవిల్'కు శ్రీకాంత్ విస్సా కథ, మాటలు అందించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప'కూ ఆయన పని చేశారు. ఇంకా ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  గాంధీ న‌డికుడిక‌ర్‌, కూర్పు : త‌మ్మిరాజు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు : శ్రీకాంత్ విస్సా, ఛాయాగ్రహణం : సౌంద‌ర్ రాజన్‌ .ఎస్, సంగీతం : హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్.  


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial