Naa Saami Ranga Music Sittings : టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున రీసెంట్ గానే తన కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 'నా సామిరంగా'(Naa Saami Ranga) అనే మాస్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నాగార్జున కెరీర్లో 99వ సినిమా ఇది. 'ఘోస్ట్'(Ghost) మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నాగార్జున మాస్ కంటెంట్ ఉన్న మూవీ చేస్తుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తోనే పక్కా మాస్ కంటెంట్ తో ఈ మూవీ ఉండబోతుందని మేకర్స్ చెప్పకనే చెప్పారు.
మలయాళీ హిట్ సినిమా రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్ లో జరుగుతుంది. అక్కడ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు అంతేకాదు ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్ పాటలు రచిస్తున్నారు. ఇదే విషయాన్ని చంద్రబోస్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం మైసూర్ లో ‘నా సామిరంగా’ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నట్లు చంద్రబోస్ వెల్లడిస్తూ నాగార్జున, కీరవాణి లతో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు.
మరోవైపు నాగార్జున కూడా తన ట్విట్టర్లో.." నా సామిరంగా పాటల సందడిలో" అంటూ కీరవాణితో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేశారు. దీంతో నాగార్జున నా సామి రంగా మూవీకి కీరవాణి, చంద్రబోస్ పనిచేస్తున్నారనే అనే విషయం బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కచ్చితంగా ఈ మూవీ ఆల్బమ్ చార్ట్ బస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా వీరి కాంబినేషన్లో గతంలో 'శ్రీరామదాసు', 'షిరిడి సాయిబాబా' లాంటి భక్తి చిత్రాలతో పాటూ 'నేనున్నాను' వంటి క్లాసిక్ మూవీ కూడా వచ్చింది. మ్యూజికల్ గా ఈ సినిమాలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ త్రయం చేతులు కలపడం విశేషం అనే చెప్పాలి.
ఇక రీసెంట్ టైమ్స్ లో కీరవాణి, చంద్ర బోస్ కలయికలో ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్ వచ్చాయి. ఇటీవలే ఈ ఇద్దరు 'నాటు నాటు' పాటతో ఏకంగా ఆస్కార్ ని తీసుకొచ్చి తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో నాగార్జున సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలిసింది. అందులో ఒక హీరోయిన్ గా అమిగోస్' మూవీ ఫేమ్ ఆషికా రంగనాథ్ నటిస్తున్నట్లు సమాచారం. 'నేను లోకల్', 'ధమాకా' వంటి సినిమాలకు పని చేసిన ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : ఓటీటీలో ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ - రిలీజ్ డేట్ ఎప్పుడంటే?