Vaishnavi Chaitanya Remuneration for New Movie : సోషల్ మీడియా ద్వారా  గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకులకు దగ్గరై, ‘బేబీ’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తొలి సినిమాతోనే ఓ రేంజిలో పాపులారిటీ సంపాదించుకుంది. తన పాత్రలో ఇట్టే ఒదిగిపోయి నటించి అందరి చేత వారెవ్వా అనిపించుకుంది. తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.


రెండో సినిమాకే పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్


‘బేబీ’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వైష్ణవికి వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పటికే మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం మొదలయ్యాయి. తాజాగా ఈ చిత్రానికి   సంబంధించిన క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో నటనకు గాను వైష్ణవికి దిల్ రాజు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏకంగా కోటి రూపాయలకు పైగా పారితోషికం ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది.  రెండో సినిమాకే ఇంత రెమ్యునరేషన్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో రాణించడమే పెద్ద విషయంగా భావిస్తున్న నేపథ్యంలో వైష్ణవి, ఇతర భాషల హీరోయిన్లతో సమానంగా రెమ్యునరేషన్ అందుకోవడం నిజంగా గొప్ప విషయం అంటున్నారు సినీ జనాలు. 


ఆచితూచి సినిమాలు ఓకే చేస్తున్న వైష్ణవి


‘బేబీ’ సినిమా హిట్ తర్వాత కొంత కాలం వరకు ఎలాంటి అవకాశాలు రాలేదు. ఆ తర్వాత నెమ్మదిగా ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ఇప్పటి వరకు వైష్ణవికి నాలుగైదు సినిమా ఛాన్సులు వచ్చాయట. అయితే, సినిమాలను సెలక్ట్ చేసుకునే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే, వెంట వెంటనే సినిమాలు చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. తొలి సినిమాకు మించి హిట్ అయ్యే కథలకు మాత్రమే ఒకే చెప్పాలని భావిస్తోందట వైష్ణవి. ప్రస్తుతం ఆశిష్ మూవీతో పాటు ఆనంద్ దేవరకొండతో ఇంకో మూవీ చేయబోతున్నది. ఇప్పటికే ‘బేబీ’ మూవీతో అద్భుత విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.  


టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగేనా?


ఇప్పటికే తెలుగమ్మాయి శ్రీలీల టాలీవుడ్ లోవరుస సినిమాలతో సత్తా చాటుతుండగా, ఆమె సరసన వైష్ణవి కూడా నిలిచే అవకాశం ఉందంటున్నారు సినీ ప్రముఖులు. అందుకు నిదర్శనమే దిల్ రాజు సినిమాకు కోటికి పైగా రెమ్యునరేషన్ అందుకోవడం అంటున్నారు. ఆమె నటించబోయే తర్వాతి రెండు సినిమాలు కూడా ‘బేబీ’ మాదిరిగానే విజయం సాధిస్తే, వైష్ణవి టాప్ హీరోయిన్ గా ఎదగడాన్ని ఎవరూ ఆపలేరంటున్నారు.  


Read Also: ప్రియాంక పెళ్లి వెనుక ఇంత కథ ఉందా? నిక్ జోనాస్​ను మధు చోప్రా అనుమానించిందా?