Madhu Chopra on Nick Jonas : అమ్మాయి పెళ్లి అనగానే తల్లిదండ్రులు ఎంతో ఆలోచిస్తారు. అబ్బాయి ఎలాంటి వాడు? తమ అమ్మాయిని బాగా చూసుకుంటాడా? లేదా? అబ్బాయి తల్లిదండ్రులు ఎలాంటి వారు? అంటూ రకరకాలుగా ఆరా తీస్తారు. అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటేనే అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు. అందరు తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారో తాను కూడా అలాగే ఆలోచించానని చెప్పింది ప్రియాంకా చోప్రా తల్లి మధు చోప్రా. నిక్ జోనాస్ తో పెళ్లి అనగానే తన మదిలో ఎన్నో సందేహాలు నెలకొన్నట్లు వెల్లడించింది.

  


కూతురు పెళ్లి విషయంలో తీవ్ర ఆందోళన


ఓ రోజు ప్రియాంక తన తల్లికి నిక్ జోనాస్​ను పరిచయం చేసిందట. తననే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నట్లు చెప్పిందట. ఆ సమయంలో మధు చోప్రా అందరు తల్లుల్లాగే ఆలోచించిందట. తన కూతురిని అతడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు చాలా సందేహించిందట. నిక్ ఎలాంటి వాడు? అమ్మాయిని ఎలా చూసుకుంటాడు? అని ఆలోచించిందట. అమ్మాయి పెళ్లి విషయంలో ఆమె చాలా ఆందోళన పడిందట. ప్రియాంక నిక్ ను పెళ్లి చేసుకుంటే తను ఎక్కడ దూరం అవుతుందోనని భయపడిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మధు, ప్రియాంక పెళ్లి గురించి చాలా విషయాలను పంచుకుంది.


నిక్ గురించి అన్ని విషయాలు తెలుసుకున్న మధు


తన కూతురు పెళ్లి విషయంలో నిక్ జోనాస్ తో చాలా విషయాలు చర్చించినట్లు మధు తెలిపింది. అతడితో వ్యక్తిగతంగా మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నట్లు చెప్పింది. అంతేకాదు, నిక్ తో చాట్ చేసి పలు విషయాల గురించి ఆరా తీసిందట. ఈ సమయంలో తన మనసుకు అర్థం అయ్యేలా నిక్ మాట్లాడ్డం నచ్చిందని చెప్పింది. అతడితో పెళ్లి అయితే, ప్రియాంకను బాగా చూసుకుంటాడనే నమ్మకం కలిగించినట్లు వివరించింది. మీకు ఏ ఇబ్బంది ఉన్నా, గంటల వ్యవధిలోనే మీ కూతురు మీ ముందు ఉంటుందని నిక్ చెప్పాడట. ఆ మాటలు మధుకు నచ్చాయట. ప్రియాంకకు ఎలాంటి వరుడు కావాలి అనుకుందో అలాంటి లక్షణాలు అన్ని నిక్ లో ఉన్నాయని భావించి  పెళ్లికి ఓకే చెప్పిందట.  


అవమానాలను పట్టించుకోని ప్రియాంక


వాస్తవానికి ప్రియాంక తల్లి దగ్గర కంటే అమ్మమ్మ తాతయ్య దగ్గరే ఎక్కువ సమయం గడిపినట్లు మధు వెల్లడించింది. తనతో చాలా తక్కువ సమయం గడిపిందని వివరించింది. తన జీవితంలో జరిగిన కొన్ని తప్పుడు ఘటనల కారణంగానే చాలా కాలం బాధ పడాల్సి వచ్చిందని చెప్పింది.  ప్రియాంకను చిన్నప్పుడే బోర్డింగ్ స్కూల్లో చేర్పించినట్లు వెల్లడించింది. అంతేకాదు, ప్రియాంక ఒకానొక సమయంలో డ్రిప్రెషన్(PTSD)కు గురైనట్లు వివరించింది. కొంత కాలం తర్వాత ఆమె ఆ సమస్య నుంచి దూరం అయినట్లు చెప్పింది. ఇక ప్రియాంక కలర్ గురించి చాలా మంది చాలా కామెంట్స్ చేసే వారని వివరించింది.ఆ అవమానాలను పట్టించుకోకుండా తన పని ఫోకస్ పెట్టడం మూలంగానే ఆమె ఈ రోజు ఉన్నత స్థాయిలో కొనసాగుతున్నట్లు మధు వివరించింది.  


Read Also: ప్రకృతితో మమేకం, దైవ చింతనకు దగ్గరగా- భూటాన్ లో సామ్ ఎంజాయ్