World Cup 2023 Semi Final : భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీస్‌ అనగానే.... భారత క్రికెట్‌ అభిమానుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి గత ప్రపంచకప్‌లో.... ధోనీ రనౌట్‌ రూపంలో వెనుదిరిగి టీమిండియా మ్యాచ్‌ ఓడిపోవడం. రెండోది... ఐసీసీ నాకౌట్‌ మ్యాచుల్లో న్యూజిలాండ్‌పై భారత్‌కు ఉన్న ఘోరమైన రికార్డు. 


2019 ప్రపంచకప్‌ సెమీస్‌లో అసలు ఏమైంది..? 
ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా జరిగిన ఆ సెమీస్‌ మ్యాచ్‌లో భారత్‌పై న్యూజిలాండ్‌ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.3 ఓవర్‌లలో 221 పరుగులకు ఆలౌటైంది. ఉత్కంఠభరితంగా సాగిన ఆ పోరులో భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ చివరి వరకు పోరాడినా కీలక సమయంలో జడేజా, ధోనీ ఔట్ అవ్వడంతో కివీస్ గెలుపొందింది. ధోని రనౌట్‌ అయి కన్నీళ్లను అపుకుంటూ సెమీస్‌కు చేరిన క్షణాలు ఇప్పటికీ అభిమానుల మనసులను తడి చేస్తాయి. 


ఐసీసీ నాకౌట్‌ మ్యాచుల్లో ఏం జరిగింది..?
ఐసీసీ నిర్వహించే ఈవెంట్లలో టీమిండియాకు ఘనమైన రికార్డు లేదు. ICC టోర్నమెంట్‌లలో భారత్‌-న్యూజిలాండ్‌ మొత్తం పదిసార్లు తలపడగా అందులో కేవలం రెండుసార్లు మాత్రమే టీమిండియా గెలుపొందింది. గతంలో నాలుగు సార్లు నాకౌట్‌ మ్యాచుల్లో తలపడగా నాలుగుసార్లు ఓడిపోయింది. కానీ ఇదే ప్రపంచకప్‌లో ఈ సంప్రాదాయాన్ని టీమిండియా బద్దలు కొట్టింది. లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి కొత్త శకానికి నాంది పలికింది. రోహిత్ నాయకత్వంలో న్యూజిలాండ్‌ను దెబ్బతీయడం ద్వారా భారత్‌ తన దీర్ఘకాల పరాజయ పరంపరను ముగించింది. ఇక భారత్‌ సునామీలో కివీస్ జట్టు గల్లంతు కావడమే మిగిలింది. 


 సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్న టీమిండియా బలాబలాలను పరిశీలిస్తే.. కప్పు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 2011లో మహేంద్రసింగ్ ధోని తర్వాత ప్రపంచకప్‌ను అందుకున్న కెప్టెన్‌గా నిలవాలంటే రోహిత్‌ మరో రెండు మ్యాచ్‌ల దూరంలో ఉన్నాడు. కానీ 2019 భారత జట్టుకు ఇప్పటి భారత జట్టు చాలా తేడా ఉంది. రోహిత్‌, గిల్‌, కోహ్లీ, అయ్యర్‌, రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ ఇలా ఎటు చూసినా బ్యాటర్లు భీకరఫామ్‌లో ఉన్నారు. టాపార్డర్‌ బ్యాటర్లంతా కనీసం ఒక అర్ధ సెంచరీ ఆయినా చేసి ఉన్నారు. ఇక కోహ్లీ, రోహిత్‌, అయ్యర్‌, రాహుల్‌ శకతకాలతో చెలరేగారు. రవీంద్ర జడేజా కూడా బ్యాట్‌తో రాణించాడు. సొంతగడ్డపై ఆడటం టీమిండియాకు సానుకూలాంశం. రోహిత్ విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. టెక్నిక్‌లో, షాట్ సెలెక్షన్‌లో తనెంత పర్‌ఫెక్ట్ అనేది కోహ్లీ నిరూపిస్తున్నాడు. కేఎల్ రాహుల్ స్లో అండ్ స్టడీ.. అన్నట్లు ఆడుతున్నాడు. మిడిలార్డర్‌లో అయ్యర్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. బుమ్రా, షమీ, సిరాజ్‌లతో బౌలింగ్‌ విభాగం షార్ప్‌గా తయారైంది. యార్కర్లు, బౌన్సర్లు కచ్చితత్వంతో బౌలింగ్‌ వేస్తూ ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తున్నారు. బుమ్రా, షమీ అయితే.. బాల్ విడిచిపెడితే వికెట్లను గిరాటేసేలా నిప్పులు చెరిగే బంతులు విసురుతున్నారు. స్పిన్ బౌలింగ్‌లో కుల్దీప్, జడేడా అదరగొడుతున్నారు.