Viral Video Telugu Today: పండుగ ముగిసింది. స్వస్థలాలకు వెళ్లిన వారు తిరిగి పయనమయ్యారు. బస్సులు, ఇతర వాహనాలు ప్రయాణికులతో రద్దీగా ఉంటున్నాయి. రైళ్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కిక్కిరిసి పోయాయి. అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్తితి నెలకొంది. దీపావళి వేడుకలు ముగియడంతో వారాంతం తర్వాత రైల్వే స్టేషన్‌లు ప్రయాణికులతో నిండిపోయాయి. అయితే ప్రయాణికులకు సరిపడా లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వారాంతంలో రైళ్లలో ఉండే రద్దీ దృశ్యాలను పంచుకుంటూ రైల్వే శాఖ నిర్లక్ష్యాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. రైల్వే శాఖ తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. గుజరాత్‌లో జరగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న రైలు ఎక్కేందుకు ఓ వ్యక్తి చేసిన విన్యాసాలు రైల్వే శాఖ నిర్లక్ష్యానికి సాక్షంగా నిలుస్తోందని నెటిజన్లు మండిపడ్డారు. గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఒక ప్రయాణికుడు పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
ఓ కిక్కిరిసిన రైలు ఎక్కేందుకు ఓ వ్యక్తి విశ్వప్రయాత్నాలు చేశాడు. రైయిలింగ్ పట్టుకుని వేలాడాడు. బోగి డోర్ వద్ద పది మందికిపైనే నిలబడ్డారు. వారిని దాటుకుని లోపలికి వెళ్లేందుకు ఓ వ్యక్తి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చుట్టుపక్కల వారు ఆశ్చర్యకరంగా, నవ్వుతూ చూస్తుండడంతో ఆ వ్యక్తి చివరకు తన ప్రయాత్నాలు మానకున్నాడు. ఆ సమయంలో పోలీసులు తమకు ఎటువంటి సాయం చేయలేదని మండిపడ్డాడు. తనను రైలు నుంచి తోసేశారని సదరు వ్యక్తి వాపోయాడు.
సూరత్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుడు మృతి
పండుగకు ఇంటికి వెళ్లేందుకు గుజరాత్ రాష్ట్రం సూరత్ రైల్వేస్టేషన్ (Surat Railway Station)కు వచ్చి ఓ ప్రయాణికుడు రద్దీలో చిక్కుకుని మృతిచెందాడు. మరో ఇద్దరు ఆస్పత్రి పాలయ్యారు. రత్‌లోని వజ్ర, వస్త్ర పరిశ్రమల్లో పనిచేసే వేలాది వలస కార్మికులు ఏటా ఛఠ్ పూజ (Chhath festival) సమయంలో బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని తమ స్వస్థలాలకు వెళ్తుంటారు. ఈ సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి సూరత్‌లో ఉంటున్న వారు స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
పెద్దఎత్తున ప్రయాణికులు శనివారం సూరత్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో స్టేషన్ ప్రాంతం అంతా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఆ సమయంలోనే బిహార్‌కు వెళ్లే రైలు ప్లాట్‌ఫాంపైకి చేరుకుంది. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా రైలు ఎక్కేందుకు యత్నించారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. రైలు ఎక్కే క్రమంలో ప్రయాణికుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే పలువురు స్పృహతప్పి పడిపోయారు. వారిలో ఒకరిపై నుంచి ప్రయాణికులు వెళ్లడంతో ఊపిరి ఆడక మృతి చెందాడు.
తొక్కిసలాటతో కిందపడిపోయిన ప్రయాణికుల్లో ఒకరికి గుండె సంబంధిత సమస్య తలెత్తిందని, అతడికి సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. మృతుడు అంకిత్ వీరేంద్ర సింగ్‌గా గుర్తించారు. ఘటనపై హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి (Harsh Sanghavi) స్పందించారు. రైల్వేస్టేషన్‌లో పరిస్థితులను నియంత్రించేందుకు పోలీసులు తమవంతు ప్రయత్నం చేశారని మీడియాకు చెప్పారు.