Gautam Singhania : టెక్స్‌టైల్ దిగ్గజం రేమండ్ గ్రూప్ (Raymond Group) ఛైర్మన్ అండ్ ఎండీ గౌతమ్ సింఘానియా (Gautam Singhania) సోమవారం సంచలన ప్రకటన చేశారు. తన భార్య నవాజ్ మోదీ సింఘానియా (Nawaz Modi) నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. సోమవారం రోజు.. సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తమ 3 దశాబ్దాల బంధానికి సోమవారంతో ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు.
ఇకపై తాము వేర్వేరు దారుల్లో ప్రయాణిస్తామని గౌతమ్ సింఘానియా స్పష్టం చేశారు. 'గతంలో మాదిరి ఈ దీపావళి ఉండబోదు. 32 సంవత్సరాలుగా జంటగా కలిసి ప్రయాణించిన మేం ఒకరికి ఒకరం అండగా నిలిచాం. సంకల్పం, నిబద్ధత, విశ్వాసంతో ప్రయాణం చేశాం. మా జీవితాల్లోకి ఇంకో ఇద్దరు పిల్లల్ని ఆహ్వానించి తల్లిదండ్రులుగా మారాం. అయితే ఇటీవల జరిగిన కొన్ని దురదృష్టకర పరిణామాల తర్వాత.. ఇకపై నవాజ్, నేను వేర్వేరు దారుల్లో ప్రయాణించాలనుకుంటున్నాను.
ఈ మధ్య కాలంలో జరిగిన దురదృష్టకర పరిణామాలు జరుగుతున్నాయి. చాలా నిరాధారమైన పుకార్లు వ్యాపించాయి. గాసిప్‌లు వచ్చాయి. ఆమె నుంచి నేను విడిపోతున్నాను. తల్లిదండ్రులుగా మా కూతుళ్లు నిహారిక, నీసాకు మంచి జీవితం అందించే బాధ్యతల్ని మాత్రం కొనసాగిస్తాం. మా వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించి.. మా ప్రైవసీని కాపాడండి. అన్ని అంశాలను పరిష్కరించుకోవడానికి మాకు కొంత సమయం ఇవ్వండి. ఈ సమయంలో మా కుటుంబం మొత్తానికి మీ ఆశీస్సులు ఉండాలి'' అని గౌతమ్ సింఘానియా పోస్ట్ చేశారు. అయితే తమ విడాకులకు కారణాలను, తమ పిల్లల భవిష్యత్ బాధ్యతలను వెల్లడించలేదు.
థానేలోని గౌతమ్ సింఘానియాకు చెందిన జేకే గ్రామ్‌లో నవంబర్ 12న దీపావళి పార్టీ జరిగింది. ఆ పార్టీకి హాజరు కాకుండా తనను ఆపివేశారని నవాజ్ ఆరోపిస్తున్న వీడియో వైరల్ అయ్యింది. పార్టీ వేదికకు సమీపంలో చిత్రీకరించబడిన ఈ వీడియోలో, నవాజ్ సింఘానియా గేటు వద్ద మరో మహిళతో కనిపించారు. ఆ వీడియలో ఈవెంట్‌కు ఆహ్వానం అందినప్పటికీ సెక్యూరిటీ గార్డులు తనను ఆపివేశారని పేర్కొన్నారు. పార్టీ జరిగే వేదికకు బయట మూడు గంటలకు పైగా వేచి ఉండవలసి వచ్చిందని చెప్పడం కనిపిస్తుంది. కొద్ది గంటల తేడాతో నవాజ్ మోదీ నుంచి తాను విడిపోతున్నట్లు గౌతమ్ సింఘానియా ప్రకటన చేయడం సంచలనం రేపింది.
న్యాయవాది నాడార్ మోడీ కుమార్తె నవాజ్ మోడీని గౌతమ్ సింఘానియా 1999లో పెళ్లి చేసుకున్నారు. వివాహానికి ముందు ఇద్దరూ 8 ఏళ్లు సహజీవనం చేశారు. నవాజ్ మోదీ ప్రొఫెషనల్ ఫిట్‌నెస్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా రేమండ్ గ్రూపు బలమైన వృద్ధిని సాధించిందనీ, 5 వేల కోట్ల రూపాయలతో ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో 3 కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లను సింఘానియా సోమవారం ట్విటర్ ద్వారా ప్రకటించారు. దుస్తుల బ్రాండ్ రేమండ్ గ్రూప్‌ను జయపత్ సింఘానియా నెలకొల్పగా, అతని కుమారుడు, గౌతమ్ సింఘానియా ఈ గ్రూపును మరిన్ని రంగాలకు విస్తరించారు. అయితే రెండేళ్ల కిందట గౌతమ్ సింఘానియా తన తండ్రి విజయ్‌పథ్‌తో విభేదాల కారణంగా వార్తల్లోకెక్కారు.