800 Movie Muttiah Muralitharan Biopic OTT Release : లెజెండరీ క్రికెటర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారం రూపొందిన సినిమా '800'. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ (2022) విన్నర్ షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ రాశారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. శ్రీలంకలో సింహళ భాషలో విడుదలైంది.
జియో ఓటీటీలో '800'... విడుదల ఎప్పుడంటే?
800 movie digital streaming platform : అక్టోబర్ 6న '800' థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది. '800' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను 'జియో సినిమా' ఓటీటీ వేదిక సొంతం చేసుకుంది. డిసెంబర్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ మొదలు కానుందని ఈ రోజు ట్వీట్ చేసింది.
800 digital release date : తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ సింహళ భాషల్లో '800' డిజిటల్ రిలీజ్ కానుంది. థియేటర్లలో సినిమా విడుదలైన సమయంలో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే... ఆశించిన రీతిలో వసూళ్లు రాలేదు. ప్రేక్షకులు ఎక్కువ మంది థియేటర్లకు రాలేదు. ఆ కారణంగా జియో ఓటీటీలో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది.
Also Read : సంక్రాంతి బరిలో మామా అల్లుళ్ళ మధ్య పోటీనా? మాజీ భార్య భర్తల మధ్య పోటీనా?
'800' సినిమాలో మురళీధరన్ పాత్రలో 'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్ (Madhur Mittal), మురళీధరన్ భార్య మది మలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. 'అఖండ', 'స్కంద' సినిమాల ఫేమ్ శరత్ లోహితస్య కీలక పాత్ర చేశారు.
'800'లో క్రికెట్ మాత్రమే కాకుండా... అంతకు మించి తన వ్యక్తిగత విషయాలు ఎన్నో విషయాలు ఉన్నాయని సినిమా విడుదలకు ముందు ముత్తయ్య మురళీధరన్ తెలిపారు. తన బాల్యంలో శ్రీలంకలో తమిళులపై జరిగిన దాడులు, క్రికెట్ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎదురైన అవమానాలు వంటివి చూపించారు. చెన్నైకు చెందిన అమ్మాయిని మురళీధరన్ వివాహం చేసుకున్నారు. ఆయనతో వివాహం తర్వాత ఆమెకు మీడియా నుంచి ఎదురైన ప్రశ్నను కూడా సినిమాలో ఉంచారు. తొలుత విజయ్ సేతుపతి హీరోగా ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ చేయాలని సన్నాహాలు చేశారు. అయితే... తమిళనాడులో కొందరి నుంచి వ్యతిరేకత రావడంతో ఆయన తప్పుకొన్నారు. అప్పుడు మధుర్ మిట్టల్ వచ్చారు. తొలుత సినిమా నిర్మించాలనుకున్న వ్యక్తులు కూడా తప్పుకోవడంతో మరొకరు వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి శ్రీదేవి మూవీస్ అధినేత సినిమా కొని విడుదల చేశారు.