తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుంది. ఈ రోజు (నవంబర్ 11, శనివారం) ఉదయం సీనియర్ కథానాయకులు, నటులు చంద్ర మోహన్ మరణ వార్త చిత్రసీమలో విషాదం నింపింది. ఆ షాక్ నుంచి కోలుకోక ముందు మరొక మరణ వార్తను వినాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే... 


నిర్మాత యక్కలి రవీంద్ర బాబు మృతి
Yakkali Ravindra Babu Death : అవార్డు విన్నింగ్ సినిమాలతో పాటు లో బడ్జెట్ సినిమాలు తీసిన అభిరుచి కల వ్యక్తి, శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపక నిర్మాత యక్కలి రవీంద్ర బాబు ఇక లేరు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచారు. ఆరోగ్య సమస్యతో హైదరాబాద్ సిటీలో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన... చికిత్స పొందుతూ కన్ను మూశారు. 


Yakkali Ravindra Babu Family : యక్కలి రవీంద్ర బాబు వయసు 55 సంవత్సరాలు. ఆయనకు భార్య రమా దేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వృత్తిరీత్యా రవీంద్ర బాబు చార్టెడ్ ఇంజనీర్. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో గల మార్కాపురం. సొంత ఊరిలో పదో తరగతి వరకు చదివిన ఆయన... ఉన్నత చదువులకు వేరే ఊరు వెళ్లారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత చార్టర్డ్ ఇంజనీర్ ఉద్యోగం చేశారు. సినిమాలపై ఇష్టంతో నిర్మాతగా పరిశ్రమలో అడుగు పెట్టారు. 


శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు ప్రొడ్యూస్ చేశారు యక్కలి రవీంద్ర బాబు. నిర్మాతగా ఈ ప్రయాణంలో 17కు పైగా సినిమాలు తీశారు. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రవీంద్ర బాబు ఎక్కువ సినిమాలు చేశారు. 


Yakkali Ravindra Babu Films : విమర్శకుల ప్రశంసలతో పాటు పురస్కారాలు అందుకున్న 'సొంత ఊరు', 'గంగ పుత్రులు' వంటి చిత్రాలను యక్కలి రవీంద్ర బాబు నిర్మించారు. పేరుతో పాటు వసూళ్ళ పరంగా కూడా 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ', 'రొమాంటిక్ క్రిమినల్స్' చిత్రాలు ఆయనకు కమర్షియల్ సక్సెస్ కూడా అందించాయి. ఇంకా 'గల్ఫ్', 'వలస' లాంటి సినిమాలు శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై మిత్రులతో కలిసి ఆయన నిర్మించారు. తర్వాత 'వెల్ కమ్ టు తీహార్ కాలేజ్' సినిమా తీశారు. రఘు కుంచె ప్రధాన పాత్రలో నటించిన 'మా నాన్న నక్సలైట్'లో పాటలు కూడా రాశారు. 


Also Read మరణించిన మూడో రోజున చంద్రమోహన్ అంత్యక్రియలు - రెండు రోజులు ఆలస్యానికి కారణం ఏమిటంటే?


గ్లామర్ కథానాయికలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న డింపుల్ హయతిని తెలుగు తెరకు నిర్మాత యక్కలి రవీంద్ర బాబు పరిచయం చేశారు. ఆ ఒక్క అమ్మాయిని మాత్రమే కాదు... తమ సంస్థలో నిర్మించిన పలు సినిమాల్లో కొత్త నటీనటులకు, హీరో హీరోయిన్లకు అవకాశాలు ఇచ్చారు. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతి సినిమాతో సమాజానికి ఓ సందేశం ఇవ్వడానికి ప్రయత్నించారు. యక్కలి రవీంద్ర బాబు, సునీల్ కుమార్ రెడ్డి కాంబినేషన్ ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులలో కూడా పేరు తెచ్చుకున్నారు.    


Also Read శ్రీదేవి టు జయసుధ - స్టార్ హీరోయిన్లకు ఫస్ట్ హీరో చంద్ర మోహనే... ఆయన పక్కన నటిస్తే టాప్‌ హీరోయిన్‌ పొజిషన్‌ గ్యారంటీ



యక్కలి రవీంద్ర బాబు మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమలో పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాదం నుంచి కోలుకునే శక్తి ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్ధించారు.