ప్రముఖ కవి, గీత రచయిత జావేద్ అక్తర్ హిందూ జీవన విధానంపై, హిందూ దేవతలపై పొగడ్తల వర్షం కురిపించారు. సీతారాములు భారతదేశ సాంస్కృతిక వారసత్వంగా అభివర్ణించిన ఆయన, మొత్తం హిందూ సమాజంలోనే సహనం ఉందన్నారు. సియారామ్ అనే పదం ప్రేమ, ఐక్యతకు చిహ్నం అని కొనియాడారు. మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే దీపావళి సందర్భంగా నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కీలక విషయాలు వెల్లడించారు.
రామాయణం భారతదేశ సాంస్కృతిక వారసత్వం- జావేద్
శ్రీరాముడు, సీతా దేవి ఈ భూమ్మీద జన్మించినందుకు గర్వపడుతున్నానని జావేద్ అక్తర్ తెలిపారు. రామాయణం భారతదేశ సాంస్కృతిక వారసత్వమని తెలిపారు. “శ్రీరాముడు, సీతాదేవి హిందూ దేవతలు మాత్రమే కాదు, భారతదేశ సాంస్కృతిక వారసత్వం. నేను వాస్తవానికి నాస్తికుడిని. కానీ రాముడు, సీత ఈ దేశ సంపదగా భావిస్తాను. రామాయణం మన సాంస్కృతిక వారసత్వం. అందుకే, ఈరోజు నుంచి జై శ్రీరామ్ చెప్పండి" అని వెల్లడించారు. స్వయంగా తానే ‘జై సియారామ్’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా చిన్నప్పుడు తాను లక్నో గడిపిన రోజులను జావేద్ అక్తర్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ప్రజలు ఒకరినొకరు ‘జై సియారామ్’ అని పలకరించుకునే వారని చెప్పారు. "నేను లక్నో నుంచి వచ్చాను. నా చిన్నప్పుడు ధనవంతులు మాత్రమే గుడ్ మార్నింగ్ చెప్పుకునేవారు. సామాన్యులు మాత్రం జై సియారామ్ అని పలకరించుకునే వాళ్లు. సీతను, రాముడిని విడివిడిగా మంచిది కాదు. సియారామ్ అనే పదం ప్రేమ, ఐక్యతకు చిహ్నం" అన్నారు.
హిందూ సమాజంలో ఎంతో సహనం ఉంది- జావేద్
అటు హిందూ సమాజం పైనా జావేద్ అక్తర్ ప్రశంసలు కురిపించారు. హిందూ సమాజంలో ఎంతో సహనం ఉందని వెల్లడించారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాల కారణంగా భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సమాజంలో కొంతకాలంగా అసహనం పెరిగిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులు ఉదారంగా, విశాల హృదయంతో ఉంటారని వెల్లడించారు. కొంతమంది ఎప్పుడూ అసహనంతో ఉంటారని, హిందువులు అలా ఉండరని చెప్పారు. హిందులు గొప్ప గుణం, విశాల హృదయాన్ని కలిగి ఉన్నారని, వాటిని కోల్పోకూడదని చెప్పారు. ఆ గుణాలు లేకపోతే ఇతరుల మాదిరిగా తయారవుతారని వెల్లడించారు. తాము హిందువుల జీవన విధానం నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని చెప్పారు.
త్వరలో అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో జావేద్ అక్తర్ ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. అయోధ్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాలయాన్ని వచ్చే ఏడాది జవనరి 22న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. శ్రీ రామ జన్మభూమి మందిర్‌లో శ్రీరాముని విగ్రహానికి ప్రధాని మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారని తెలిపింది.
Read Also: మాజీ ప్రియుడిని ఇంకా మర్చిపోలేదా? దీపిక షేర్ చేసిన పిక్ వెనుక అసలు కథేంటి?