AICTE Approved BTech For Working Professionals: సాధారణంగా ఇంజినీరింగ్ అంటే రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లి చదవాల్సిందే. నిర్ణీత హాజరుశాతం తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే పాలిటెక్నిక్ అర్హత ఉండి, ఆర్థిక కారణాలతో ఉద్యోగాలు చేస్తూ.. ఇంజినీరింగ్ చదవాలనుకునే వారికోసం అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గుడ్ న్యూస్ తెలిపింది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం వదిలిపెట్టకుండా, ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా బీటెక్‌ చదువుకోవచ్చు. 


ఉద్యోగాలు చేస్తూ.. ఇంజినీరింగ్ చదవాలనుకునే వారికోసం 'బీటెక్‌ వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌' పేరుతో బీటెక్‌ రెండో సంవత్సరంలో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ కోర్సును నిర్వహించేందుకు తెలంగాణలోని 12 ఇంజినీరింగ్‌ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇటీవలే అనుమతినిచ్చింది. ఉస్మానియా సహా పలు కాలేజీల్లో వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు ప్రవేశాలు కల్పించేందుకు (ఏఐసీటీఈ)అనుమతిని మంజూరు చేసింది. ఈ విద్యాసంవత్సరంలో వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ ప్రవేశాలు పొందేందుకు నవంబరు 30 వరకు అవకాశం ఇచ్చింది. కంప్యూటర్‌సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ వంటి ప్రోగ్రాముల్లో వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు ప్రవేశాలు కల్పించనున్నారు.


ప్రవేశం ఇలా..
పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసిన వారికి నేరుగా బీటెక్‌ రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు ఏఐసీటీఈ అనుమతి తెలిపిన కాలేజీలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు పొందవచ్చు. ప్రవేశాలు పొందినవారికి కళాశాల సమయం ముగిసిన తర్వాత లేదా వారాంతాల్లో ప్రత్యేక తరగతుల నిర్వహించనున్నారు. అయితే ఫీజులను మాత్రం సంబంధిత కళాశాలలే నిర్ణయిస్తాయి. ఓయూలో సంవత్సరానికి రూ.1 లక్షగా నిర్ణయించారు.


ప్రవేశాలు కల్పించే కాలేజీలివే..
ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, మాతృశ్రీ ఇంజినీరింగ్‌ కాలేజీ, మెథడిస్ట్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్‌ కాలేజీ, తీగల కృష్ణారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీ, వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి ఇన్‌స్టిట్యూట్‌ అఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, చైతన్యభారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, జ్యోతిష్మతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌, మాటూరి వెంకటసుబ్బారావు ఇంజినీరింగ్‌ కాలేజీ, కాకతీయ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ – కొత్తగూడెం, అబ్దుల్‌ కలాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజికల్‌ సైన్సెస్‌, అనుబోస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.


ALSO READ:


నీట్‌ పీజీ, ఎండీఎస్ ప్రవేశ పరీక్షల తేదీలు వెల్లడి, ఎగ్జామ్స్ ఎప్పుడంటే?
నీట్ పీజీ(NEET PG), నీట్ ఎండీఎస్(NEET MDS) ప్రవేశ పరీక్షల తాత్కాలిక తేదీలను 'నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(NBEMS)' నవంబరు 9న ప్రకటించింది. దీనిప్రకారం మార్చి 3న నీట్ పీజీ-2024(NEET PG Exam 2024) పరీక్ష నిర్వహించనున్నారు. ఇక నీట్ ఎండీఎస్ పరీక్షను ఫిబ్రవరి 9న నిర్వహించనున్నారు. ప్రస్తుతానికి తాత్కాలిక తేదీలను ప్రకటించినప్పటికీ.. త్వరలోనే కచ్చితమైన తేదీలను ఎన్టీఏ ప్రకటించనుంది. నీట్ పీజీ ప్రవేశపరీక్ష ద్వారా ఎండీ/ఎంఎస్/పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పోస్ట్ ఎంబీబీఎస్ డీఎన్‌బీ కోర్సులు, ఆరేళ్ల డీఆర్‌ఎన్‌బీ కోర్సులు, పోస్ట్ ఎంబీబీఎస్ ఎన్‌బీఈఎంఎస్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ లేదా ప్రొవిజినల్ ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956 ప్రకారం శాశ్వత లేదా తాత్కాలిక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. నీట్ ఎండీస్ పరీక్ష రాయడానికి బీడీఎస్ ఉత్తీర్ణత, ఇంటర్న్‌షిప్ పూర్తిచేసినవారు అర్హులు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...