'బలగం' సినిమాకు ముందు వేణు టిల్లును తెలుగు చిత్రసీమ, మెజారిటీ ప్రేక్షక లోకం ఓ హాస్య నటుడిగా చూసింది. 'జబర్దస్త్' కమెడియన్ అనేది ఆయనకు ఉన్న గుర్తింపు. 'బలగం' విడుదల తర్వాత వేణులో దర్శకుడ్ని చూశారంతా! మరి, శాంతి కుమార్ కూడా అదే విధంగా మెప్పిస్తారా? లేదా? కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. బుల్లితెరపై నవ్వించిన ఆయన... త్వరలో వెండితెరపైకి దర్శకుడిగా రానున్నారు.  


'నాతో నేను'తో దర్శకుడిగా శాంతి కుమార్!
సాయి కుమార్‌ (Sai kumar), శ్రీనివాస్‌ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజ్‌పుత్, 'జబర్దస్త్' ఐశ్వర్య, రాజీవ్‌ కనకాల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'నాతో నేను' (Naatho Nenu Movie). ఈ చిత్రానికి శాంతి కుమార్‌ తూర్లపాటి (జబర్దస్త్ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్‌ టంగుటూరి నిర్మిస్తున్నారు. 


ఆది విడుదల చేసిన 'వయ్యారి రామ్ సిలకా'! 
'నాతో నేను' సినిమాలో తొలి పాట 'ఓసినీ వయ్యారి రామ్ సిలకా...' పాటను ఆది సాయి కుమార్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ''ఈ మధ్య నాన్న గారు (సాయి కుమార్) కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 'నాతో నేను' సినిమాలో ఆయనది కీలక పాత్ర. ఇదొక ఫీల్ గుడ్ సినిమా అని, ఇందులో తన పాత్ర పాత్ర కొత్తగా ఉంటుందని నాతో నాన్న గారు చెప్పారు. తెలుగు ప్రేక్షకులు మంచి కథలతో రూపొందే సినిమాలను తప్పకుండా ఆదరిస్తారు. ఈ 'ఓసినీ వయ్యారి రామ్ సిలకా' పాట నాకు బాగా నచ్చింది. పాటతో పాటు ఈ సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు. 


Also Read : ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు రమ్మంటే 2 లక్షలు అడుగుతావా? సుమన్‌పై శివనాగు ఫైర్


'నాతో నేను' చిత్ర దర్శకుడు, నటుడు శాంతి కుమార్ తుర్లపాటి మాట్లాడుతూ ''మన తెలుగు ప్రేక్షకులు 'జబర్దస్త్‌'లో హాస్య నటుడిగా నన్ను ఎంతగానో ఆదరించారు.  నేను ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేసి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. 'నాతో నేను' తీశాను. ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు నేనే రాసుకున్నా. మా నిర్మాతల సహకారంతో సినిమా పూర్తి చేశాం. ఆది సాయి కుమార్ గారు బిజీగా ఉన్నప్పటికీ... మా పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇందులో సాయి కుమార్ గారి పాత్ర కొత్తగా ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన ప్రేక్షకులను ఏడిపిస్తుంది. అంత భావోద్వేగభరిత సన్నివేశాలు ఉన్నాయి'' అని చెప్పారు.


Also Read రామ్ చరణ్‌ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే  



నిర్మాత ప్రశాంత్ టంగుటూరి మాట్లాడుతూ ''నిర్మాతగా నాకూ తొలి చిత్రమిది. మంచి కథతో సినిమా చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, అతి త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం'' అని అన్నారు. సమీర్, సీవీఎల్ నరసింహా రావు, గౌతమ్ రాజు, ఎమ్మెస్ చౌదరి, భద్రం, సుమన్ శెట్టి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : మురళి మోహన్ రెడ్డి, స్వరాలు : సత్య కశ్యప్, నేపథ్య సంగీతం : ఎస్. చిన్నా, కూర్పు : నందమూరి హరి, కళా దర్శకత్వం : పెద్దిరాజు అడ్డాల, పాటలు : రామ జోగయ్య శాస్త్రి, శాంతికుమార్, పోరాటాలు : నందు, నిర్మాణ సంస్థ : శ్రీ భావనేశ్ ప్రొడక్షన్స్, సమర్పణ : ఎల్లలు బాబు టంగుటూరి.