Good Night Movie: మనలో చాలా మంది నిద్రపోయేటపుడు గురక(snoring) పెడుతుంటారు. మన పక్కన ఎవరైనా గురక పెడుతూ ఉంటే భలే చికాకుగా అనిపిస్తుంటుంది. కుదిరితే దూరంగా వెళ్తాం లేదంటే చేసేదీమీలేక మనం కూడా వాళ్ల గురకకు అలవాటు పడిపోతాం. ఇది చెప్పుకునేంత పెద్ద సమస్య కాదు అలా అని చిన్నది కూడా కాదు. అలాంటి గురక బ్యాక్డ్రాప్ లోనే సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు గురక మీద ఎలా సినిమా తీస్తారు అనేగా మీ సందేహం. అయితే తమిళంలో తెరకెక్కిన ‘గుడ్ నైట్’ సినిమాను చూడాల్సిందే. గురక సమస్య ఉన్న ఓ వ్యక్తి కథే ఈ సినిమా. ఈ మూవీను తమిళ దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్ తెరెక్కించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో తెలుగులోకి కూడా అందుబాటులోకి రానుంది.
ఓటీటీలో తమిళం సూపర్ హిట్ మూవీ ‘గుడ్ నైట్’..
నిత్య జీవితంలో మన చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిల్లోంచే ఓ చిన్న అంశాన్ని తీసుకొని దాన్ని కథలా మార్చి రెండున్నర గంటల సినిమా తీసి హిట్ కొడుతున్నారు కొంతమంది టాలెంటెడ్ దర్శకులు. సినిమాలో కంటెంట్ ఉండాలే గానీ దాన్ని హిట్ చేయడానికి ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఈ మధ్య కాలంలో అన్ని భాషల్లోనూ ఇలాంటి సినిమాలు చాలానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గురక అనే చిన్న సమస్యను తీసుకొని దానికి ఇంట్రస్టింగ్ రైటింగ్ ను జతచేసి సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు గతంలో కూడా చాలా వచ్చాయి. గతేడాది తమిళంలో వచ్చిన ‘లవ్ టుడే’ సినిమా, మలయాళం లో వచ్చిన ‘రోమాంచమ్’ ఇవన్నీ ఇలాంటి కేటగిరీలోనివే తెలుగులో కూడా మారుతి లాంటి దర్శకులు నిత్య జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాలను తీసుకొని పలు సినిమాలు తీసి హిట్ అందుకున్నారు కూడా. ఆ కోవలోకే ఇప్పుడు ఈ ‘గుడ్ నైట్’ సినిమా కూడా వచ్చి చేరనుంది. ఈ మూవీను జూలై 3 నుంచి తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
‘గుడ్ నైట్’ కథేంటంటే..
ఈ సినిమాలో హీరో కు గురక సమస్య ఉంటుంది. తన అక్కాబావతో కలసి ఉంటాడు. అయితే తనకున్న గురక సమస్య వల్ల నిత్యం ఎవరొకరితో తిట్లు తింటూనే ఉంటాడు. అయినా లైఫ్ ను అలా నెట్టుకుంటూ వస్తాడు. తర్వాత కొన్నాళ్లకు హీరోయిన్ పరిచయం అవుతుంది. ఆమెతో పరిచయం కాస్త స్నేహంగా తర్వాత ప్రేమగా మారి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. తనకు గురక సమస్య ఉందనే విషయం ముందునుంచీ హీరోయిన్ దగ్గర దాస్తూవస్తాడు. పెళ్లి తర్వాత అసలు విషయం బయటపడుతుంది. గురక వల్ల వారి మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. భర్త సమస్యను భార్య అర్థం చేసుకుందా లేదా తర్వాత ఏం జరిగింది? అనేదే సినిమా. ఈ మూవీలో మణికందన్, మీరా రఘునాథ్ హీరో, హీరోయిన్లుగా చేశారు. రమేష్ తిలక్, రాయచల్ రెబెక్కా, బాలాజీ శక్తివేల్, మరియు భగవతి పెరుమాళ్ కీలక పాత్రలు పోషించారు. యువరాజ్ గణేశన్, మగేష్ రాజ్ పసిలియన్, నజెరత్ పసిలియన్ సంయుక్తంగా నిర్మించారు.
Also Read: ‘లియో’ ఫస్ట్ లుక్ - సుత్తితో పళ్లు రాలగొట్టేంత కసి, డెవిల్‌ను తలపిస్తున్న విజయ్!