ఈ ఏడాది చిన్న సినిమా గా విడుదలై పెద్ద విజయం సాధించిన సినిమా ‘ఆయ్’. బన్నీ వాస్ నిర్మించిన ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సంగీత దర్శకుడు అజయ్ అరసాడ. తాజాగా ఆయన మ్యూజిక్ అందించిన వెబ్ సిరీస్ ‘వికటకవి’. 1970ల నాటి తెలంగాణ నేపథ్యంలో సాగే ఓ మిస్టరీ థ్రిల్లర్ గా దర్శకుడు ప్రదీప్ మద్దాలి రూపొందించిన ఈ వెబ్ సిరీస్ కు మంచి అప్లాజ్ వస్తోంది. ఓటీటీల నుంచి సినిమాల వరకూ జరిగిన తన మ్యూజికల్ జర్నీ గురించి అజయ్ మాటల్లోనే....


''మాది వైజాగ్. సంగీత నేపథ్యమున్న కుటుంబం మాది. మా అక్కలు, అత్తలు వీణ వాయిస్తూ ఉంటే ఆసక్తిగా గమనించేవాణ్ణి. అలా సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. అయితే నాకు గిటార్ అంటే చాలా ఇష్టం. ముందుగా గిటార్ బేసిక్స్ నేర్చుకున్నా. ఇంజనీరింగ్ కోసం గీతం యూనివర్శిటీలో చేరాను. చదువుతో పాటు మ్యూజిక్ పై కూడా దృష్టి పెట్టాను. నాకు నేనుగా గిటార్ నేర్చుకున్నా. క్లాసెస్ కు బంక్ కొట్టి, మ్యూజిక్ బ్యాండ్స్ తో తిరిగేవాణ్ని. సంగీతంలో ఓనమాలు నేర్పింది నా కాలేజీ రోజులే. నాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అంటే చాలా ఇష్టం. ఆయన ఇన్ స్పిరేషన్ తో నే సంగీత దర్శకుణ్ణ కావాలని డిసైడ్ అయ్యాను.


ఇండస్ట్రీ లో ఎంట్రీ...


బీటెక్ తర్వాత ఎనిమిదేళ్లు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేశాను. ఓ వైపు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూనే నా ప్యాషన్ ను మాత్రం వదులుకోలేదు. మధ్యలో కొన్ని షార్ట్ ఫిలింస్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాను. ఇక సంగీత దర్శకునిగా కెరీర్ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఓ రోజు ఉద్యోగం మానేస్తానని ఇంట్లో చెప్పేశాను. ఇంట్లో వాళ్లు కూడా ఓకే చెప్పేశారు. షార్ట్ ఫిలింస్ చేస్తున్నప్పుడే దర్శకుడు ప్రదీప్ నందన్ తో పరిచయమైంది. ఆయన ‘జగన్నాటకం’ అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమాతోనే నేను సంగీత దర్శకునిగా మారాను.  ‘గూఢాచారి’ ఫేమ్ శ్రీచరణ్ పాకాల నా చిన్ననాటి ఫ్రెండ్. అతని ప్రోత్సాహంతో కీబోర్డ్ ప్రోగ్రామర్ గా ఆ సినిమాకు వర్క్ చేశాను.  ఇక వరుసగా ‘క్షీర సాగ‌ర మ‌థ‌నం’, ‘నేడే విడుద‌ల‌’, ‘మిస్సింగ్’, ‘శ్రీరంగ‌నీతులు’  సినిమాల‌తో పాటు సేవ్ ‘ద టైగర్స్’ వెబ్ సిరీస్ లకు కూడా సంగీతం అందించాను.


మలుపు తిప్పిన ‘ఆయ్’


ఓ సందర్భంలో నేను మ్యూజిక్ స్వరపరిచిన ‘మిస్సింగ్’ సినిమా బీజిఎమ్ విన్నారట నిర్మాత బన్నీ వాస్. ఓ ఈవెంట్ లో ఆయన్ను కలిశారు. ఆ విషయం చెప్పారు. తప్పకుండా కలిసి పనిచేద్దామన్నారు. కొన్ని రోజులకు ఆయన అన్నట్టుగానే ‘ఆయ్’ సినిమాకు మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. ముందుగా ఓ భజన తో పాటు ఐటమ్ సాంగ్ ట్యూన్స్ ఇవ్వమన్నారు బన్నీవాస్. రెండు పాటల ట్యూన్స్ ఆయనకు బాగా నచ్చేశాయి. ఇక సినిమాకు సంబంధించిన మిగిలిన మ్యూజిక్ వర్క్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ‘ఆయ్’ సినిమా మంచి హిట్ అయింది. నా కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఇది.


Also Read: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు నుంచి బయటకొచ్చాక మావయ్య దగ్గరకు మొదటిసారి... పుష్ప 2 టీ షర్ట్ లేకుండా!


నేను డైరెక్టర్స్ టెక్నీషియన్ ను


రీసెంట్ గా ప్రదీప్ మద్దాలి తీసిన ‘వికటకవి’ వెబ్ సిరీస్ కూ సంగీతం అందించాను. ‘ఆయ్’ సినిమా చేస్తున్నప్పుడే ఈ వెబ్ సిరీస్ కూ గా వర్క్ చేశాను. 1970 లలో సాగే కథకథనాలు అయినా దర్శకుడు ప్రదీప్ కు కంటెంట్ మీద పూర్తి క్లారిటీ ఉంది. అందుకే నాకు పెద్దగా కష్టం అనిపించలేదు. దర్శకుడు చెప్పింది చేయడమే నా ప్రయారిటీ. నేను డైరెక్టర్స్ టెక్నీషియన్ ను. కంటెంట్ ఏ జోన‌ర్ అయినా, సిరీస్ లేదా వెబ్ సిరీస్ దేనికైనా మ్యూజిక్ చేయ‌టానికి సిద్ధ‌మే. ప్రస్తుతం ఆహా సంస్థలోనే ‘త్రీ రోజెస్’ (సీజన్ 2) తో పాటు మరో రెండు వెబ్ సిరీస్ లకూ పనిచేస్తున్నా. త్వరలోనే నేను చేయబోయే సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే వాటినీ వెల్లడిస్తాను''.


Also Read: 'బిగ్ బాస్' విజేతలుగా నిలిచిన ఆ ఏడుగురు... వాళ్ళ సరసన చేరేది ఎవరు? Bigg Boss 8 Telugu Winner అతనేనా?