తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ గా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న అలనాటి నటీమణుల్లో భానుమతి రామకృష్ణ కూడా ఒకరు. ఈమె కేవలం నటి మాత్రమే దర్శకురాలు, నిర్మాత, గాయని, స్వరకర్త. ఇలా అన్ని రంగాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారి అత్యధిక పారితోషకం తీసుకున్న నటి కూడా ఈమెనే కావడం విశేషం. తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ ఫిమేల్ సూపర్ స్టార్ ఎవరంటే భానుమతి రామకృష్ణ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.90 ఉన్నప్పుడు భానుమతి ఒక్కో సినిమాకి రూ.25,000 వసూలు చేసేవారు. అంటే ప్రస్తుత కాలంలో చూసుకుంటే రెండు కోట్ల రూపాయలతో తో సమానం.
తన 60 ఏళ్ల సినీ జీవితంలో భానుమతి 97 తమిళ, తెలుగు, హిందీ, చిత్రాల్లో పనిచేశారు. అంతేకాదు తెలుగు సినిమాకి మొదటి మహిళా దర్శకురాలు కూడా ఈమెనే. హీరోయిన్ అయిన తర్వాత దర్శకురాలిగా మారి 1953 లో 'చండీరాణి' అనే సినిమాను తీశారు. భారతీయ సినిమాకు ఆమె అందించిన సేవలకు గాను భానుమతికి 2001లో పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఇక భానుమతి వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. సెప్టెంబర్ 7, 1925 ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో జన్మించారు. ఆమె తల్లిదండ్రులకు భానుమతి మూడవ సంతానం. తల్లిదండ్రులు సంగీతంలో ప్రావీణ్యం పొందడంతో చిన్న వయసులోనే ఆమెకు సంగీతం నేర్పడం మొదలుపెట్టారు.
మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన భానుమతి చిన్నప్పటినుంచి తన తండ్రి స్టేజ్ పై ప్రదర్శనలు చేస్తుంటే చూసేవారు. 1939 లో భానుమతికి కేవలం 13 ఏళ్ల వయసులోనే మొదటి సినిమా అవకాశం లభించింది. 'వరవిక్రయం' అనే చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టారు భానుమతి. ఈ సినిమాలో కలింది అనే 13 ఏళ్ల అమ్మాయి పాత్రను పోషించారు. సినిమాలో ఆమెకు ఓ వృద్ధుడితో బలవంతంగా వివాహం జరుగుతుంది. ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత 'మాలతి మాధవం', 'ధర్మపత్ని', 'భక్తిమాల' వంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు. అయితే కెరీర్ ప్రారంభంలో 'కృష్ణ ప్రేమ' అనే సినిమా నటిగా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఇక 1951లో భానుమతి నటించిన మ్యూజికల్ సూపర్ హిట్ మూవీ 'మల్లేశ్వరి' తర్వాత ఆమె కెరియర్ టాప్ ప్లేస్ కి చేరుకుంది. ఈ మూవీలో ఆమె ఎన్టీ రామారావు తో కలిసి పని చేసింది. సౌత్ ఇండస్ట్రీలోనే ఈ మూవీ ఆల్ టైం కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. అటు హిందీలోనూ దిలీప్ కుమార్ తో కలిసి పని చేసింది. 1962లో భానుమతి 'అన్నే' అనే తమిళ సినిమాలో నటించగా, ఆ సినిమాకి జాతీయ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా 1964లో 'అంతస్తులు', 1966 లో 'పల్నాటి యుద్ధం' సినిమాలకు గాను ఆమెకు జాతీయ పురస్కారాలు లభించాయి.
ఇక 1943లో 'కృష్ణ ప్రేమ' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన రామకృష్ణారావుతో భానుమతికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో ఆగస్టు 8, 1943న వీరు వివాహం చేసుకున్నారు. అయితే భానుమతి తండ్రి ఈ వివాహాన్ని వ్యతిరేకించారు. దాంతో ఆమె ఇంట్లో నుంచి పారిపోయి రామకృష్ణరావును పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారు భానుమతి. కానీ కొన్ని నెలల తర్వాత మళ్లీ సినిమాల్లోకి తిరిగి వచ్చి పలు సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆమె డిసెంబర్ 24 2005న మరణించారు.
Also Read : అట్లీతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న బాలీవుడ్ యంగ్ హీరో?