భారత దేశంలో ప్రజలు అత్యధికంగా వీక్షించిన టెలివిజన్ ప్రోగ్రామ్‌లలో 'మహా భారత్' ఒకటి. బీఆర్ చోప్రా క్రియేటర్. ఆయనతో పాటు ఆయన తనయుడు రవి చోప్రా దర్శకత్వం వహించారు. అందులోని పాత్రలు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటాయి. ఆ సీరియల్ లో శకుని మామగా నటించి, గుర్తింపు తెచ్చుకున్న గుఫీ పెయింటల్ (gufi paintal) పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. అతని మేనల్లుడు హిటెన్ పెయింటల్ గుఫీ ఆరోగ్యం గురించి వార్తలను ధృవీకరించారు. ఆ తర్వాత గుఫీ స్నేహితురాలు, నటి టీనా ఘై సైతం ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు.
కొంత కాలంగా గుఫీ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. అయితే మే 31న ఆయన ఆరోగ్యం అత్యంత విషమించడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. "అతనికి రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇప్పుడు పరిస్థితి తీవ్రంగా మారింది. అబ్జర్వేషన్ కోసం ఆసుపత్రికి తరలించాం. ఆయన ప్రస్తుతం సబర్బన్ అంధేరిలోని ఆస్పత్రిలో ఉన్నారు. ఏడెనిమిది రోజుల క్రితం జాయిన్ చేశాం. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది" అని గుఫీ మేనల్లుడు హిటెన్ పెయింటల్ తెలిపారు.
సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) కేర్ కమిటీ, వెల్ఫేర్ ట్రస్ట్ చైర్‌పర్సన్... నటి, గాయకురాలు టీనా ఘై సైతం గుఫీ ఆరోగ్యంపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేయాల్సిందిగా అభిమానులను ఆమె కోరారు. "గుఫీ గుండె, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో పాటు వయసు పెరగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల, వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. నేను అతని ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. తరచూ ఆస్పత్రికి వెళ్లి వస్తున్నాను. ప్రస్తుతం బాగానే ఉన్నారు" టీనా పేర్కొన్నారు.
గుఫీ కేవలం నటుడిగానే కాకుండా 'మహా భారత్' షోకి అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్, కాస్టింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. 80వ దశకం చివరలో మొదటిసారిగా టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ ద్వారా ఆయన పేరు తెచ్చుకున్నారు. అంతే కాదు అయన 'రఫూ చక్కర్', 'దేస్ పర్దేస్', 'దిల్లగి', 'మైదాన్ ఈ జంగ్', 'దావా' వంటి రచనలతో ప్రసిద్ధికెక్కారు. 'శర్మాజీ నమ్‌కీన్', 'సుహాగ్ వంటి హిందీ చిత్రాలలోనూ నటించారు. టెలివిజన్ షోలు CID, హలో ఇన్‌స్పెక్టర్‌లలోనూ ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి.
Also Read : భుజం నొప్పి ఉన్నా అమ్మ వంట చేసి పెట్టింది, మహేష్ బాబుకు థాంక్స్: అడవి శేష్
'మహాభారతం' టెలివిజన్ సిరీస్ లో మొత్తం 94 ఎపిసోడ్‌లు ఉన్నాయి. అక్టోబర్ 2, 1988 నుండి జూన్ 24, 1990 వరకు దూరదర్శన్‌లో ప్రసారం చేశారు. దీన్ని BR చోప్రా నిర్మించగా... అతని కుమారుడు రవి చోప్రా దర్శకత్వం వహించారు. రాజ్ కమల్ సంగీతం సమకూర్చారు. వ్యాసుడు రచించిన ఇతిహాసం ఆధారంగా పండిట్ నరేంద్ర శర్మ, హిందీ/ఉర్దూ కవి రాహి మసూమ్ రజా దీనికి స్క్రిప్ట్ రాశారు.