తెలుగు తెరపై వేశ్య పాత్రలు పోషించిన కథానాయికలు కొందరు ఉన్నారు. ఒకరి చేతిలో మోసపోవడం కావచ్చు, మరొకటి కావచ్చు... పడుపు వృత్తిలోకి వచ్చిన పడతి మనోవేదనను తమ నటనతో ఆవిష్కరించారు. అయితే... ఈ తరం తెలుగు కథానాయికలలో గుర్తుండిపోయేలా వేశ్య పాత్రను పోషించినది ఎవరు? అంటే... అనుష్క పేరు ముందు వరుసలో ఉంటుంది. 'వేదం' సినిమాలో ఆమె నటన కన్నీళ్లు పెట్టించింది. 'విమానం'లో అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) పాత్ర సైతం అదే విధంగా ఉంటుందని తెలిసింది. 


'విమానం'లో వేశ్యగా అనసూయ
Anasuya Character In Vimanam 2023 Movie : రీసెంట్‌గా 'విమానం' ట్రైలర్ విడుదల అయ్యింది. అందులో అనసూయ ఓ డైలాగ్ చెబుతారు. గుర్తు ఉందా? 'ఇప్పటి దాకా మోకాళ్ళ పైన పట్టుకునే మగాళ్ళనే చూసినన్రా! మొదటిసారి మోకాళ్ళ కింద పాదాలను పట్టుకుంటుంటే... చానా కష్టంగా ఉందిరా' అని! ఆ మాట వెనుక నిగూడార్థం ఎంత మందికి అర్థమైందో గానీ... అసలు మ్యాటర్ ఏమిటంటే?


'విమానం'లో సినిమాలో అనసూయ వేశ్య పాత్రలో కనిపించనున్నారు. ఓ బస్తీలో నివసించే వేశ్య అన్నమాట! ఆమెను ప్రేమించే యువకుడిగా రాహుల్ రామకృష్ణ నటించారు. ఆయనది చెప్పులు కుట్టుకునే పాత్ర. చెప్పులు కుడుతూ 'ఆ పిల్ల దక్కాలంటే ఇటువంటివి ఎన్ని బిళ్ళలు సంపాయించాలనో' అని రాహుల్ రామకృష్ణ చెప్పే డైలాగ్ కూడా ట్రైలర్ లో ఉంది. 

అనసూయ, రాహుల్ రామకృష్ణ మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల చేత కంట తడి పెట్టిస్తాయని తెలిసింది. ముఖ్యంగా రాహుల్ రామకృష్ణను అనసూయ కౌగిలించుకునే సన్నివేశం! ఎప్పటికీ గుర్తుండిపోయేలా, 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్తను మించేలా 'విమానం'లో అనసూయ నటించారట.


అనసూయ... రాహుల్ రామకృష్ణ... ఓ పాట!
'విమానం'లో అనసూయ పాత్ర పేరు సుమతి. ఆమె కోసం రాహుల్ రామకృష్ణ ఓ పాట కూడా పాడతారు. 'సుమతి' అంటూ సాగే ఆ గీతంలో 'ఏ సదువు సంధ్య లేదే... నాకే ఆస్తి పాస్తి లేదే... ఈ గరీబోని ముఖము జూసి గనువ తీయరాదే' అంటూ సాహిత్యం సాగింది. చరణ్ అర్జున్ బాణీ అందించడంతో పాటు పాటను రాశారు.


Also Read : 'చక్రవ్యూహం' రివ్యూ : ఆస్తి కోసం ఒకరు, ప్రేమ కోసం మరొకరు - మర్డర్ మిస్టరీలో దోషి ఎవరు?



జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో 'విమానం'
తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 9న 'విమానం' సినిమా విడుదల కానుంది. ఇందులో సముద్రఖని వికలాంగుని పాత్ర పోషించారు. ఓ కాలు లేని వ్యక్తిగా నటించారు. ఆయన కుమారుడిగా మాస్టర్ ధ్రువన్ నటించగా... ధనరాజ్, మీరా జాస్మిన్, తమిళ నటుడు మొట్ట రాజేంద్ర‌న్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్‌, కిర‌ణ్‌ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్ సంస్థలు నిర్మించిన చిత్రమిది. దీనికి శివ ప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వం వహించారు.  ఈ చిత్రానికి కళ :  జె.జె. మూర్తి, కూర్పు :  మార్తాండ్ కె. వెంక‌టేష్‌, మాటలు : హ‌ను రావూరి (తెలుగు), ప్ర‌భాక‌ర్ (త‌మిళం), పాటలు : స్నేహ‌న్‌ (తమిళ్), చరణ్ అర్జున్ (తెలుగు), ఛాయాగ్రహణం : వివేక్ కాలేపు, సంగీతం : చ‌ర‌ణ్ అర్జున్‌.


Also Read : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్