టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రతి శుక్రవారం కనీసం రెండు సినిమాలైనా విడుదలవుతూ ఉంటాయి. ఒక్కోసారి అంతకంటే ఎక్కువ సినిమాలు సైతం థియేటర్స్లోకి వస్తుంటాయి. కానీ సక్సెస్ రేట్ చూస్తే చాలా తక్కువగా ఉంటుంది. నెల మొత్తంలో ఒకే ఒక సినిమా మంచి సక్సెస్ ని అందుకుంటుంది. అలా ఈ సంవత్సరంలో చూసుకుంటే మార్చిలో 'దసరా', ఏప్రిల్ లో 'విరూపాక్ష' బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ హిట్స్ ను అందుకున్నాయి. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే అదే రెండు నెలల్లో విడుదలైన దాదాపు ఇతర తెలుగు స్ట్రైట్ సినిమాలన్నీ డిజాస్టర్లు అయ్యాయి. అందులో 'శాకుంతలం', 'ఏజెంట్', 'రావణాసుర', 'మీటర్' వంటి మరిన్ని సినిమాలు కూడా ఉన్నాయి. ఇక మే నెల విషయానికొస్తే ఒక్క తెలుగు సినిమా కూడా పెద్ద సక్సెస్ ని అందుకోలేకపోయింది. మే నెల మొత్తం డబ్బింగ్ సినిమాలదే హవా. మే నెలలో విడుదలైన రెండు డబ్బింగ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ అందుకున్నాయి.
అందులో ఒకటి 'బిచ్చగాడు 2' కాగా మరొకటి '2018'. ఈ రెండు సినిమాలతో పాటు ఇదే నెలలో విడుదలైన ఓ చిన్న సినిమా 'మేం ఫేమస్' ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకున్నా.. కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేక పోయింది. అందుకు కారణం 'బిచ్చగాడు2', '2018' వంటి డబ్బింగ్ సినిమాలే. ఈ డబ్బింగ్ సినిమాలే ఎక్కువ థియేటర్స్ లో ప్రదర్శితమవుతూ మంచి కలెక్షన్స్ ని అందుకోగా 'మేంఫేమస్' మూవీ మాత్రం కలెక్షన్స్ పరంగా నిరాశపరిచింది. ఒకవేళ ఈ డబ్బింగ్ సినిమాలు కనుక లేకుంటే 'మేం ఫేమస్' మూవీ బాగానే కలెక్ట్ చేసి ఉండేది. ఇక మే నెలలో ముందుగా వచ్చిన డబ్బింగ్ మూవీ 'బిచ్చగాడు 2' రిలీజ్ కి ముందు భారీగా ప్రమోషన్ చేయడం, అలాగే 'బిచ్చగాడు' పెద్ద హిట్ అవడంతో ఇవి కాస్త 'బిచ్చగాడు 2' కి సానుకూలంగా మారాయి. ఇక 'బిచ్చగాడు2' రిలీజ్ రోజున సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా పుంజుకుంటూ మంచి కలెక్షన్స్ ని అందుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన మరో డబ్బింగ్ మూవీ '2018'. ఈ సినిమా అయితే ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ ని అందుకుంది.
మలయాళంలో అప్పటికే భారీ సక్సెస్ అందుకున్న ఈ మూవీని రీసెంట్ గా తెలుగులో రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించారు. 2018 సంవత్సరంలో కేరళ ప్రాంతంలో వచ్చిన వరదల ఆధారంగా ఈ సినిమా రూపొందిగా.. మలయాళ అగ్ర హీరో టోవినో థామస్ ఇందులో ప్రధాన పాత్రను పోషించారు. మలయాళం లోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమా భారీ లాభాలను అందుకుని మే నెలలో రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో కంటే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలా మే నెలలో 'బిచ్చగాడు2', '2018' వంటి డబ్బింగ్ సినిమాలు తప్ప మరే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది. 'రామబాణం', 'ఉగ్రం', 'అన్ని మంచి శకునములే', 'కస్టడీ', 'మళ్లీ పెళ్లి' వంటి స్ట్రైట్ తెలుగు సినిమాలు మే నెలలోనే విడుదలయ్యాయి. కానీ వీటిలో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కాలేక పోయింది. సో మొత్తంగా చూసుకుంటే మే నెల మొత్తాన్ని రెండు డబ్బింగ్ సినిమాలే బాక్సాఫీస్ ని శాసించాయని చెప్పొచ్చు.
Also Read: భోళా శంకరుడి మేనియా షురూ - ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?