మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ 'పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2' తాజాగా ఓటీటీ లోకి వచ్చేసింది. నిజానికి మే 26 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. కానీ సినిమా చూడాలంటే 399 రూపాయలు చెల్లించాలని నిబంధన పెట్టారు. ఇక అప్పటినుంచి సుమారు వారం రోజుల పాటు ఇలాగే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండగా.. తాజాగా శుక్రవారం (జూన్ 2) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సబ్స్క్రయిబర్స్ అందరికీ ఈ సినిమా ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. అంటే ఇక నుంచి ఈ సినిమాను అందరూ ప్రైమ్ వీడియోలో ఫ్రీగా చూసేయొచ్చు. ఈ విషయాన్ని తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.


ఇక గత ఏడాది ‘పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1’ని రిలీజ్ చేసిన మేకర్స్ ఈ ఏడాది ఏప్రిల్ 28న పార్ట్ 2 ను థియేటర్స్ లో విడుదల చేశారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని అందుకుంది. కానీ మొదటి పార్ట్ స్థాయిలో మాత్రం కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మణిరత్నం, సుభాస్కరన్ సంయుక్తంగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఈ సినిమాలో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత దూళిపాళ్ల, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఇంత భారీ తారాగణం ఈ సినిమాలో నటించినప్పటికీ 'పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2'కి అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. అందుకు కారణం ఈ సినిమాకు సంబంధించి ఆడియన్స్ లో పెద్దగా బజ్ ఏర్పడకపోవడంతో అది కాస్త కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది. ఈ సినిమా రూ.400 కోట్ల మార్క్ ని అందుకోవడం కూడా కష్టమేనని తెలుస్తోంది.


ఇక ఇటీవల మేకర్స్ 'పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2' రూ.300 కోట్ల మార్క్ ను అందుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ ఏడాదికి తమిళంలోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా 'పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2' నిలిచినట్లు ఓ పోస్టర్ని కూడా విడుదల చేశారు. తమిళ ఇండస్ట్రీలో ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో 'పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2' హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఇప్పటివరకు అక్కడ విజయ్ నటించిన 'వారిసు' మొదటి స్థానంలో ఉండగా.. తాజాగా ఆ రికార్డును పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 అధిగమించింది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర నిర్మాతలు వెల్లడించారు. దక్షిణ భారతదేశంలోని చారిత్రక చోళ సామ్రాజ్యానికి చెందిన రాజుల కాలం నాటి పరిస్థితులను ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కానీ మిగతా భాషల్లో ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది. ఇక థియేటర్స్ లో ఓ మోస్తారు రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి.