సినిమా రివ్యూ : చక్రవ్యూహం
రేటింగ్ : 2.5/5
నటీనటులు : అజయ్, జ్ఞానేశ్వరి కండ్రేగుల, వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి, ప్రగ్యా నయన్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ప్రియ, శ్రీకాంత్ అయ్యంగార్, కిరీటి, రాజ్ తిరందాసు తదితరులు  
ఛాయాగ్రహణం : జీవీ అజయ్
సంగీతం : భరత్ మంచిరాజు 
సహ నిర్మాతలు : వెంకటేష్, అనూష
నిర్మాత : శ్రీమతి సావిత్రి
రచన, దర్శకత్వం : చెట్కూరి మధుసూధన్
విడుదల తేదీ : జూన్ 2, 2023


అజయ్ (Actor Ajay) ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'చక్రవ్యూహం : ద ట్రాప్' (Chakravyuham The Trap Movie). ఇందులో 'మిస్టర్ అండ్ మిస్' ఫేమ్ జ్ఞానేశ్వరి కండ్రేగుల ఎస్ఐ రోల్ చేశారు. వివేక్ త్రివేది, సిరి హీరో హీరోయిన్లుగా నటించగా... ప్రగ్యా నయన్, రిషి, సుదేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉంది (Chakravyuham Movie Review)?  


కథ (Chakravyuham Movie Story) : సంజయ్ (వివేక్ త్రివేది) ఓ అనాథ. శరత్ (సుదేష్)తో స్నేహం అతని జీవితాన్ని మారుస్తుంది. శరత్ ఫ్యామిలీ ఫ్రెండ్ సిరి (ఊర్వశి పరదేశి) పరిచయం ప్రేమగా మారడం, ఆమెను పెళ్లి చేసుకోవడం చకచకా జరుగుతాయి. శరత్, సంజయ్ కలిసి కన్‌స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అంతా హ్యాపీగా ఉందనుకున్న సమయంలో సిరి హత్యకు గురవుతుంది. ఆమె కేసు చిక్కుముడి వీడక ముందు శరత్ హత్యకు గురి అవుతాడు. సిరి, శరత్ హత్యల వెనుక ఉన్నది ఎవరు? ఈ కేసును సీఐ సత్య (అజయ్) ఎలా పరిష్కరించారు? సిరి కుటుంబ నేపథ్యం ఏమిటి? చివరకు ఏం తేలింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Chakravyuham The Trap Review) : థ్రిల్లర్ సినిమాలు తీసే దర్శకుల్లో మెజారిటీ శాతం మంది ఫాలో అయ్యే ఫార్ములా ఒకటి ఉంటుంది. ముఖ్యంగా మర్డర్ మిస్టరీలు విషయంలో! హత్య ఎవరు చేశారు? అందుకు కారణం ఏమిటి? అనేది చివరి వరకు రివీల్ చేయకుండా సస్పెన్స్ మైంటైన్ చేయడం! 'చక్రవ్యూహం' దర్శకుడు చెట్కూరి మధుసూధన్ సైతం సేమ్ ఫార్ములాను ఫాలో అయ్యాడు.


'చక్రవ్యూహం' స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అయితే, కాసేపటి రెగ్యులర్ & రొటీన్ ఫార్మాట్‌లోకి వెళుతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎంత సేపటికీ ముందుకు కదలని పరిస్థితి! అక్కడక్కడే తిరుగుతుంది. అయితే... ఇంటర్వెల్ తర్వాత కాస్త ప్రేక్షకుడి ఊహకు అందని విధంగా ట్విస్టులతో కథను ముందుకు నడిపారు. అప్పటి వరకు సాధారణంగా కనిపించిన పాత్రలు... ఇంటర్వెల్ తర్వాత మరోలా కనపడతాయి. ఒక్కొక్కరి వెనుక ఇంత కుట్ర ఉందా? అనిపిస్తుంది. 


ప్రేమ లేదంటే ఒకరిపై మోజు ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తుందనే కథాంశంతో తీసిన చిత్రమిది. సెకండాఫ్ స్టార్టింగ్ సీన్స్ మాస్ ఆడియన్స్‌ను అట్ట్రాక్ట్ చేస్తాయి. థియేటర్లలో విజిల్స్ వేయిస్తాయి. 'కాఫీ తాగండి' డైలాగుకు వేరే మీనింగ్ ఇచ్చే సీన్స్ అవి!  శుభం కార్డు పడుతుందనుకున్న సమయంలో మరో ట్విస్ట్ ఇచ్చారు. అది ఇటీవల వచ్చిన రాఘవా లారెన్స్ 'రుద్రుడు'లో ముఖ్యమైన అంశానికి చాలా దగ్గరగా ఉంటుంది! మంచి ట్విస్టులు రాసుకున్న దర్శకుడు... ఫస్టాఫ్‌లో లెంగ్త్ తగ్గించి రేసీగా సినిమాను ముందుకు తీసుకువెళ్లి ఉంటే బావుండేది. ఆ ట్విస్టులకు మరింత స్ట్రాంగ్ & న్యూ స్టోరీ యాడ్ రిజల్ట్ బ్లాక్ బస్టర్ అయ్యేది. మ్యూజిక్ ఓకే. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి. 


నటీనటులు ఎలా చేశారు? : ఇంతకు ముందు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు అజయ్ చేశారు. ఇటువంటి పాత్రలు చేయడం ఆయనకు కొట్టిన పిండి. ఆయన అలవోకగా నటించారు. సీఐ సత్య పాత్రకు అవసరమైన బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ క్యారీ చేశారు. అజయ్ తర్వాత ప్రగ్యా నయన్ ప్రేక్షకుల దృష్టిని ఎక్కువ ఆకర్షిస్తారు. ఆమె క్యారెక్టర్ అలా సెట్ అయ్యింది. గ్లామర్ సీన్స్, విలనిజం చూపించే స్కోప్ కూడా ఆమెకు దక్కింది. శిల్ప పాత్రలో పర్ఫెక్ట్ సెట్ అయ్యారు. రాజీవ్ కనకాల, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేఖ సుధాకర్, ప్రియ పాత్రల నిడివి తక్కువ. వాళ్ళు ఉన్నంతలో బాగా చేశారు. సంజయ్ పాత్రలో వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి ఓకే. ఇద్దరూ కొత్త నటీనటులు కాబట్టి కనెక్ట్ కావడానికి టైమ్ పడుతుంది. జ్ఞానేశ్వరి కండ్రేగుల గ్లామర్ కాకుండా యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్ ట్రై చేశారు. 


Also Read : స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్ రివ్యూ: యానిమేటెడ్ స్పైడర్ మ్యాన్ ఆకట్టుకున్నాడా? నిరాశ పరిచాడా?


చివరగా చెప్పేది ఏంటంటే? : ఫస్టాఫ్ రెగ్యులర్ థ్రిల్లర్ ఫార్మాట్‌లో ఉన్నప్పటికీ... సెకండాఫ్‌లో ట్విస్టులు ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్ తర్వాత దర్శకుడు మేజిక్ వర్కవుట్ అయ్యింది. సీక్వెల్‌కు ఇచ్చిన లీడ్ బావుంది. అజయ్ క్యారెక్టర్ మీద మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే థ్రిల్ ఫీల్ అవ్వచ్చు.


Also Read : 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?