ముంబై ఉగ్రదాడిలో దేశం కోసం ప్రాణాలను అర్పించారు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ముష్కరుల దాడిలో వీరమరణం పొందారు. ఆయన జీవితంతో పాటు ఉగ్రదాడి ఆధారంగా రూపొందిన సినిమా 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అడివి శేష్ (Adivi Sesh) టైటిల్ రోల్‌లో నటించారు. గత ఏడాది(2022) జూన్ 3న థియేటర్లలో సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది. 


‘మేజర్’ విజయాన్ని గుర్తు చేసుకున్న అడవి శేష్


‘మేజర్’ సినిమా విడుదలై ఏడాది అయిన సందర్భంగా అడవి శేష్ సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ సుదీర్ఘ  పోస్టు పెట్టారు. “‘మేజర్’ సినిమా విడుదలై  ఏడాది పూర్తయిన సందర్భంగా అమ్మ, మామయ్యను కలిశాను. అమ్మ తన భుజం నొప్పి ఉన్నప్పటికీ అద్భుతమైన వంట చేసి పెట్టింది. వారి ప్రేమ నా ప్రతి విషయంలో ఉంటుంది. ‘మేజర్’ సందీప్ ఉన్నికృష్ణన్ నన్ను ఆశీర్వదించారు. నాకు తెలియని విధంగా మార్చారు. #MajorTheFilm  నాకు మరపురాని చిత్రం. నేను మహేష్ సార్‌కి, మా నిర్మాతలకు, దర్శకుడికి, కష్టపడి పనిచేసిన టీమ్‌కి, రివర్టింగ్ పెర్‌ఫార్మెన్స్‌ని అందించిన మా నటీనటులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్నింటికంటే ముఖ్యంగా ప్రేక్షకులు మా మీద చూపించిన ప్రేమ, గౌరవం అపారమైనది. నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ గౌరవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను” అని రాసుకొచ్చారు.


Also Read : సెట్‌లో గొడవ నిజమే - మేనేజర్‌ను మార్చేసిన సాయి ధరమ్ తేజ్






‘మేజర్’ చిత్రంపై ప్రముఖుల ప్రశంసలు


అప్పట్లో ‘మేజర్’ సినిమాపై సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాని పొగుడుతూ.. ట్విట్టర్ లో ఓ లెటర్ షేర్ చేశారు.  మెగాస్టార్ చిరంజీవి సైతం ట్వీట్ చేశారు. “మేజర్ సినిమా కాదు.. ఒక ఎమోషన్. గొప్ప హీరో సందీప్ ఉన్నికృష్ణన్ కథను చాలా షార్ప్ గా చూపించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. మహేష్ బాబు ఈ సినిమాకి బ్యాక్ బోన్ గా నిలవడం చాలా గర్వంగా ఉంది. అడివి శేష్, శోభితా, సయీ మంజ్రేకర్, దర్శకుడు శశికిరణ్ తిక్క.. టీమ్ మొత్తానికి కంగ్రాట్స్” అని చెప్పారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ సినిమాపై, సినిమా యూనిట్ పై పొగడ్తల వర్షం కురిపించారు. మనసుని హత్తుకునేలా సినిమా తీశారని.. మ్యాన్ ఆఫ్ ది షో అడివి శేష్ అంటూ ట్వీట్స్ చేశారు.   






ఈ చిత్రంలో అడివి శేష్‌కు జంటగా సయీ మంజ్రేకర్, ప్రధాన పాత్రలో శోభితా ధూళిపాళ్ల, హీరో తల్లిదండ్రులుగా ప్రకాష్ రాజ్, రేవతి నటించిన ఈ సినిమాకు శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మహేష్ బాబుతో పాటు సోనీ పిక్చర్స్, ఎ+ఎస్ మూవీస్ సంస్థలు కలిసి నిర్మించాయి. మహేష్ బాబు, నమ్రత, అనురాగ్, శరత్ నిర్మాతలుగా వ్యవహరించారు.  అబ్బూరి రవి మాటలు రాశారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.   


Read Also: అసామాన్యుడితో సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి మనోజ్ సినిమా తెలుగు వెర్షన్