తెలుగు హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ముంబై హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఉత్తరాదిలో దక్షిణాది సినిమాలు దుమ్ము దులిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ హీరోలను, దర్శకులను ముంబై తీసుకు వెళ్ళడానికి బాలీవుడ్ ముందుకు వస్తోంది. హృతిక్ రోషన్ 'వార్ 2'లో మరో హీరోగా జూనియర్ ఎన్టీ రామారావును తీసుకున్నారు. సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' సినిమాలో వెంకటేష్ కీలక పాత్ర చేశారు. ఇప్పుడు సౌత్ హీరోలు, దర్శకుడితో బాలీవుడ్ మల్టీస్టారర్ రెడీ అవుతోంది. అసలు వివరాల్లోకి వెళితే...


రవితేజ, వరుణ్ ధావన్ హీరోలుగా...
రానా, ఏసియన్ సునీల్ నిర్మాతలుగా!
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్ (Varun Dhawan) హీరోలుగా ఓ సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శింబు కథానాయకుడిగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన తమిళ సూపర్ హిట్ 'మానాడు'కు ఈ సినిమా రీమేక్ అని తెలిసింది. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. 'మానాడు'లో ఎస్.జె. సూర్య చేసిన పాత్రను రవితేజ, శింబు చేసిన పాత్రను వరుణ్ ధావన్ చేయనున్నారని సమాచారం.


పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి (Rana Daggubati), ఏషియన్ సునీల్ (Asian Sunil Producer) నిర్మాణంలో 'మానాడు' హిందీ రీమేక్ రూపొందుతోంది. ఒక్క వరుణ్ ధావన్ మినహా సినిమా హీరో, దర్శక - నిర్మాతలు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన వాళ్ళే కావడం గమనార్హం. 


సెప్టెంబర్ నుంచి షూటింగ్ షురూ!
రవితేజ 'రావణాసుర' కొన్ని గంటల్లో విడుదల కానుంది. ప్రస్తుతం 'ఈగల్', 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలు చేస్తున్నారు. హిందీలో వరుణ్ ధావన్ ఓ సినిమాతో బిజీగా ఉన్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా 'గాంధీవధారి అర్జున' తెరకెక్కిస్తున్నారు ప్రవీణ్ సత్తారు. ముగ్గురు చేస్తున్న సినిమాలు కంప్లీట్ అయ్యాక.... ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో 'మానాడు' హిందీ రీమేక్ సెట్స్ మీదకు వెళ్ళనుంది. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యాక... హీరోయిన్, ఇతర వివరాలు వెల్లడించే ఆలోచనలో ఉన్నారట. ప్రవీణ్ సత్తారు ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా చేసుకుంటారు. ఆల్రెడీ అందుకు తగ్గట్టు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
   
కరణ్ జోహార్ డిస్ట్రిబ్యూషన్!
ప్రముఖ హిందీ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) కూడా 'మానాడు' హిందీ రీమేక్ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అని వినబడుతోంది. అసలు విషయం ఏమిటంటే... ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. అదీ అసలు సంగతి! త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.


రవితేజ, రానా దగ్గుబాటి...
'భీమ్లా నాయక్' మిస్ అయినా!
రవితేజ, రానా హీరోలుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఓ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి సన్నాహాలు చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా ఆ సంస్థ తీసిన 'భీమ్లా నాయక్'లో ముందుగా రవితేజను అనుకున్నారు. పవన్ కళ్యాణ్ రాకతో ఆ కాంబినేషన్ మిస్ అయ్యింది. అయితే, ఆ సినిమా మిస్ అయినా హిందీ 'మానాడు'తో రవితేజ, రానా కాంబినేషన్ కుదిరింది. కాకపోతే... హీరోలుగా కాదు! రవితేజ హీరో అయితే, రానా నిర్మాత.


Also Read : బాలకృష్ణతో సినిమా నా కోరిక, చిరుతో పూనకాలు లోడింగ్ - స్టార్స్‌తో సినిమాలపై 'దిల్' రాజు క్రేజీ అప్డేట్స్


'టైగర్ నాగేశ్వరరావు' పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ఆ తర్వాత 'మానాడు' సినిమాతో రవితేజ మరోసారి పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వెళ్లనున్నారు. తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. తొలుత నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు 'మానాడు'ను తెలుగులో రీమేక్ చేస్తారని వినిపించింది. అయితే... రీమేక్ రైట్స్ రానా కొన్నారని, చైతూతో తమిళ, తెలుగు బైలింగ్వల్ చేస్తున్నానని వెంకట్ ప్రభు చెప్పారు. ఆ సినిమాయే 'కస్టడీ'.


Also Read : నీ భార్యకు, నీకు సంబంధం ఏమిటో చెప్పగలవా? - విష్ణు వర్సెస్ మనోజ్ గొడవపై మోహన్ బాబు